Nadargul Farmers :
⦿ నమస్తే తెలంగాణ ఎండీపై కేసు నమోదు
⦿ ఫిర్యాదు చేసిన గుర్రంగూడ రైతులు
⦿ తమ భూములపై తప్పుడు కథనాలు రాశారని ఆగ్రహం
⦿ దామోదర్ రావుపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్
⦿ ఆరు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు
హైదరాబాద్, స్వేచ్ఛ: రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్ భూములకు సంబంధించిన నమస్తే తెలంగాణ పత్రిక ఇచ్చిన కథనాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచురించారని, నమస్తే తెలంగాణ మేనేజింగ్ ఎడిటర్ దీవకొండ దామోదర్ రావుపై మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తప్పుడు వార్తలు రాసి తమకు నష్టం కలిగించేలా చేశారని అందులో పేర్కొన్నారు గుర్రంగూడ రైతులు. నాదర్‌గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 92లో ఉన్న భూమికి సంబంధించి అబద్ధపు కథనాలు రాశారని పోలీసులకు వివరించారు. బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ అంటూ తప్పుడు వార్తలు ప్రచురించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ భూములను డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు అంగీకరించామని, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నమస్తే తెలంగాణ పేపర్‌లో ప్రచురించారని రైతులు మండిపడుతున్నారు. ఎకరానికి 1,000 స్క్వేర్ యార్డ్స్‌తో పాటు రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారనేది తప్పని పేర్కొన్నారు. భూములను అమ్ముకునేందుకు ఎన్‌వోసీలు ఇవ్వాలని అధికారుల చుట్టూ చాలాకాలంగా రైతులు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో నమస్తే తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తులకు రైతులు భూమి అమ్మినట్టు వార్తలు వచ్చాయని, దీనివల్ల తమకు తీవ్ర నష్టం కలిగిందని వాపోతున్నారు.
వార్త ప్రచురించిన నమస్తే తెలంగాణ మేనేజింగ్ ఎడిటర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ఫిర్యాదు మేరకు నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావుపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 319 (2), 338, 340(2), 353(2), 61 (2)(ఏ) ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.