Mynampally Hanumanth Rao: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మైనంపల్లి హనుమంత రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనంపల్లి మీడియాతో మాట్లాడారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డితో కలిసి మాట్లాడుతూ తాను ప్రతి వారం సిద్దిపేట పర్యటిస్తానని వివరించారు. సిద్దిపేట నియోజకవర్గానికి తన పూర్తి సమయాన్ని కేటాయిస్తానని చెప్పారు. ప్రతిగ్రామంలో తిరుగుతానని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ నేతలను గెలిపించుకుంటానని పేర్కొన్నారు.
ఇక మాజీ మంత్రి హరీశ్ రావుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే హరీశ్ రావు హల్ చల్ చేశాడని గుర్తు చేశారు. తన రాజీనామా లేఖను పట్టుకుని గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని హంగామా చేశాడని వివరించారు. హరీశ్ రావు తన రాజీనామా సవాల్‌కు కట్టుబడి ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రకటించినట్టుగానే తమ ప్రభుత్వం సాగు రుణమాఫీ చేస్తున్నదని వివరించారు. ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర రూపాయల లోపు లోన్లను మాఫీ చేసిందని తెలిపారు. ఆగస్టు నెలలోనే రూ. 2 లక్షల లోపు రుణాలను కూడా మాఫీ చేసి తీరుతుందని వివరించారు.
Also Read: పరుష పదజాలం ఉపయోగించిన ఎమ్మెల్యే.. అసెంబ్లీలో ఢీ అంటే ఢీ
అందుకే హరీశ్ రావు తన రాజీనామా సవాల్‌కు కట్టుబడి ఉండాలని ప్రతిసవాల్ చేశారు. హరీశ్ రావుతో రాజీనామా చేయించే వరకు తాను విశ్రమించబోనని స్పష్టం చేశారు.ఆయను తిరిగి తోటపెల్లికి పంపిస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం రుణమాఫీ చేసినట్టుగానే ఇతర హామీలను కూడా అమలు చేయడానికి కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు. గత ప్రభుత్వం చింతమడకలో ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పంచాడని, రూ. 10 లక్షలు పంచిందని ఆరోపించారు. అదే మిగిలిన గ్రామాలకు మాత్రం డబ్బులు పంచలేదని పేర్కొన్నారు. ఇతర గ్రామాలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.