Raja Singh on Owaisi: కొట్టుకో.. డప్పు కొట్టుకో.. అసలు సంగతి తేల్చేందుకు ఓ మంచి చట్టం రాబోతోంది. అప్పుడు మీ బాగోతం బయట పడుతుందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్ చేశారు.
టీటీడీ చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు చేసిన కామెంట్స్ పై అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారాయి. తన నియామకంపై తొలిసారిగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను తొలగించడం జరుగుతుందన్నారు. కేవలం హిందువులు మాత్రమే ఉండేలా తాను చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందుకు ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తామన్నారు.
ఈ విషయంపై ఓవైసీ స్పందిస్తూ.. టీటీడీలో అన్యమతస్తులకు స్థానం లేనప్పుడు, వక్ఫ్ బోర్డులో కూడా ఇతరుల ప్రమేయం ఎందుకంటూ ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడం సబబు కాదని , వారిని చేర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్రం పలు సవరణలు తెచ్చిందని ఓవైసీ విమర్శించారు. ఇలా ఓవైసీ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం ఇదే విషయంపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆదివారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మొదటగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఒక మంచి నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు తీసుకున్నారని అందుకు తన మద్దతు ఉంటుందన్నారు. ఇక ఓవైసీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ నిరంతరం వార్తల్లో నిలవాలన్న ఆకాంక్షతోనే ఓవైసీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారని, వక్ఫ్ బోర్డుకు, టీటీడీకి ఒకే రీతిలో పోల్చడం సరికాదన్నారు.
తాను అమెరికాలో చదివానని చెప్పే ఒవైసీ, బారిష్టర్ చదువుకున్నానంటూ చెబుతుంటారని, తాజాగా చేసిన కామెంట్స్ తో బుద్ధి తక్కువ ఓవైసీగా గుర్తింపు వచ్చిందని ఘాటుగా విమర్శించారు రాజా సింగ్. ఒవైసీ డప్పు కొట్టుకో కానీ, త్వరలోనే కేంద్రం వక్ఫ్ బోర్డు పైన మంచి చట్టాన్ని తీసుకువస్తుందని ఎమ్మెల్యే అన్నారు. 1947లో వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఏమేరకు ఉందో చూడాలని, ప్రస్తుతం ఏ మేరకు ఉందో గమనించాలన్నారు. ఆలయాల భూములను ఆక్రమించుకున్నారని, అలాగే హిందూ రైతుల భూములను లాక్కొన్నారని, అందుకే వక్ఫ్ భూములు పెరిగాయని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. మరి ఈ కామెంట్స్ పై ఒవైసీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.