Minister Sridhar Babu: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై చర్చ నిర్వహించారు. కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విభజన చట్టాల గురించి కేంద్రం ప్రస్తావించ లేదని రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆరోపించారు. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిందేమీ రాలేదని అన్నారు. తెలంగాణ, దేశంలోనే అతి పెద్ద గ్రోత్ ఇంజన్ అని తెలిపారు. తెలంగాణ ప్రమేయం లేకుండా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా చేప్తారని ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ భాగం కాదా అని ప్రశ్నించారు. ఇందుకు కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీకి ఏపీ మద్దతు ఇవ్వడం వల్లే ఎక్కువ నిధులు ఆ రాష్ట్రానికి కేటాయించారని అన్నారు. ఏపీకి కేంద్రం ఏం ఇచ్చినా అభ్యంతరం లేదన్న మంత్రి ఇరు రాష్ట్రాలకు విభజన చట్టం ఒకటైనప్పుడు తెలంగాణకు కటాయింపులు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తామని బడ్జెట్‌లో హామీ ఇచ్చారని అన్నారు. కానీ తెలంగాణ విజ్ఞప్తులను కేంద్రం పట్టివంచుకోలేవని అసహనం వ్యక్తం చేశారు.