Ponguleti Serious Comments on KCR(Telangana politics): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో భూసంస్కరణలు, ధరణిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసంస్కరణలకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారంటూ ఆయన గుర్తు చేశారు. ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు కూడా భూసంస్కరణలు చేశారని ఆయన అన్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన భూదాన ఉద్యమం తెలంగాణలోనే పుట్టిందని మంత్రి పేర్కొన్నారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చిందని, ఈ చట్టంతోనే పేదలకు భూములు పంచారని ఆయన చెప్పారు. వైఎస్ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారంటూ మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి కేసీఆర్ పై మండిపడ్డారు. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న చాలామంది కూడా భూసంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారని ఆయన అన్నారు. అయితే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ సమస్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయన్నారు.
Also Read: రెనెన్యూ రాబడులు పెరిగాయి: కాగ్
‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉన్నది. ధరణి తెచ్చిన సమస్యల వల్ల పేద రైతులు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ధరణి పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను మోసం చేశారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు’ అంటూ మంత్రి పొంగులేటి ఫైరయ్యారు.