⦿ జీవన్ రెడ్డికి బుజ్జగింపులు
⦿ రంగంలోకి మధుయాష్కీ గౌడ్
⦿ గంగారెడ్డి కుంటుంబానికి పరామర్శ
⦿ పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న జీవన్ రెడ్డి
⦿ వలస నేతలకు ఏ హామీ ఇవ్వలేదన్న మధుయాష్కీ
జగిత్యాల, స్వేచ్ఛ : గంగారెడ్డి హత్య విషయంలో అలకబూనిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ రంగంలోకి దిగారు. శనివారం జాబితాపూర్‌లో హత్యకు గురైన గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. జీవన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ, గంగారెడ్డి అతి దారుణంగా హత్యకి గురికావడం బాధాకరమన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొన్నారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసులకి చెప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రాణానికి ముప్పు ఉందని చెప్పినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని కాపాడుకోవాల్సిన అవసరం తమపై ఉందని, 2014లో ఉమ్మడి జిల్లా నుండి జీవన్ రెడ్డి ఒక్కరే గెలిచారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా అటువైపు చూడలేదని చెప్పారు. జీవన్ రెడ్డికి తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగిందని, ఈ విషయం తనకూ తెలియదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా భావంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు, ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అంటూ ఫైరయ్యారు మధుయాష్కీ గౌడ్. తమ పార్టీలో ఏ వలస నేతకూ ముందుగా పదవి హామీలు ఇవ్వలేదని తెలిపారు. ఈదే సందర్భంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్నారు. ఆయనను వాట్సాప్‌లో బెదిరించినా పట్టించుకోలేదని చెప్పారు. వందకు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని తెలిపారు. ఈ హత్య వెనుకున్న కుట్రను, వాస్తవాలను వెలికి తీయలేకనే పాత కక్షలు అని పోలీసులు చెబుతున్నారని ఆరోపించారు.
ALSO READ : సీఎం రేవంత్ తో మేఘా ఎండీ కృష్ణారెడ్డి మీటింగ్