Aghori In Kushna Palli: అఘోరీ నాగ సాధువు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అఘోరీ నాగసాధువు ఎంత వైరల్ అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు ఉన్న క్రేజ్ కు చివరికి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసే స్థాయికి చేరారంటే.. అభిమానుల తాకిడి ఏవిధంగా ఉందో చెప్పవచ్చు. మొన్న తెలంగాణ, నిన్న కేదరీనాధ్, నేడు ఏపీ ఇలా రాష్ట్రాలు మారుతున్న అఘోరీ నెక్స్ట్ ప్లాన్ ఏంటనేదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు చెందిన అఘోరీ ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజలు నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రకటనలు, ఇలా ఒకటి కాదు ఆమె నోటి నుండి వచ్చిన ప్రతి మాట వైరల్. కానీ తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లు, తన మాటలను వక్రీకరించడం తగదని ఆమె తనపై వస్తున్న కామెంట్స్ పై స్పందించారు. అంతేకాదు తెలంగాణ నుండి వెళ్లిన అఘోరీ, తాను ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించి సంచలనం రేకెత్తించారు.
తన ఆత్మార్పణం కూడా ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద జరుగుతుందని ప్రకటించగా, భక్తులు అలర్ట్ కాగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చివరికి వేములవాడ వద్ద అఘోరీని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆమె స్వగ్రామం కుశ్నపల్లికి తరలించారు. అక్కడ కొంతసేపు హడావుడి కూడా నెలకొంది. పోలీసులు ఆత్మార్పణం వద్దని కోరడం, అలాగే పెద్ద ఎత్తున భక్తులు గ్రామానికి చేరుకొని నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, ఏమి చెప్పినా వింటామని అఘోరీ మాతకు మాటిచ్చారు. దీనితో అఘోరీ కొంత వెనుకడుగు వేయగా, పోలీసులు ఆమెను కాన్వాయ్ తో రాష్ట్రం దాటించారు.
అసలు అఘోరీ కారు కనిపిస్తే చాలు, అక్కడ ఆమె భక్తులు ప్రత్యక్షం కావడం, ఆశీస్సులు పొందడం పరిపాటిగా మారింది. అందుకే పోలీసులు కూడా బందోబస్తు చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే తొలి కార్తీక సోమవారం సంధర్భంగా అకస్మాత్తుగా అఘోరీ మాత శ్రీశైలం లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ పూజలు నిర్వహించిన ఆమెను చూసి భక్తులు సెల్ఫీలు దిగారు. అయితే తెలంగాణ నుండి వెళ్ళిన అఘోరీ మాత మళ్ళీ ఏపీలో కనిపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ పోలీసులు కూడా ఈమె వ్యవహారంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు.
తాను అనుకున్నది సాధించే వరకు పట్టువదలకుండా ఉండే నైజం ఆమెదని చెప్పవచ్చు. అందుకే స్వగ్రామం కుశ్నపల్లికి చేరుకొని, అక్కడ శివాలయం నిర్మించాలన్నది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకు సుమారు 100 మందికి పైగా అఘోరాలను తీసుకువచ్చి ప్రత్యేక పూజలు, ఆలయ శంఖుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు అదే అఘోరీ మాత అభిమతంగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆలయం నిర్మిస్తామని పలువురు భక్తులు అఘోరీ మాతకు మాటిచ్చారని, అందుకే ఆమె మళ్లీ కుశ్నపల్లికి రావడం ఖాయం అంటున్నారు ఆమె భక్తులు. మరి ఇప్పటికే ఏపీలో కనిపించిన అఘోరీ మాత తన రూట్ మ్యాప్ ఎటువైపు సాగిస్తారో వేచి చూడాలి.