KTR Padayatra: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓ వైపు నేతలు, మరోవైపు కేడర్ వెళ్లిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది కారు పార్టీ. కొత్త కొత్త అస్త్రాలను తెరపైకి తెస్తోంది. లేటెస్ట్‌గా రాష్ట్రమంతా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు కేటీఆర్.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతోంది కారు పార్టీ. అధికార పార్టీ నుంచి వస్తున్న మాటల యద్దాన్ని ఎదుర్కోలేక పోతోంది. ఈ క్రమంలో నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఈ విషయంలో హైకమాండ్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది.
ఇటీవల బీఆర్ఎస్ ఏ అంశం ఎత్తుకున్నా బూమరాంగ్ అవుతోంది. కీలక నేతలపై ప్రభుత్వం నుంచి కౌంటర్ ఎటాక్ మొదలవుతోంది. వీటిని ధీటుగా ఎదుర్కోలేక నేతలు చెదిరిపోతున్నారు. కేడర్ కకావిలకం అవుతోంది. దీన్ని నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. నేరుగా ప్రజల్లోకి వెళ్లడమే ఉత్తమని భావించింది ఆ పార్టీ.
తన మనసులోని మాటను బయటపెట్టారు కేటీఆర్. త్వరలో రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని ఓపెన్‌గా చెప్పేశారు. పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలుపెడతారు అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్.
ALSO READ: మూసీ పునరుజ్జీవనం, మెత్తబడిన విపక్షాలు.. రేపో మాపో టెండర్లు
అధికారంలోకి రావడానికి నేతలు ఎంచుకునే ఏకైక మార్గం పాదయాత్ర. గతంలో చాలామంది నేతలు ఆ అస్త్రాన్ని ప్రయోగించారు.. సక్సెస్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్, నారా లోకేష్, మల్లు భట్టివిక్రమార్క ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలే వస్తారు. పాదయాత్ర తర్వాత ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయి కూడా.
ఇటీవల మీడియా చిట్ చాట్‌లో పాదయాత్ర చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు ఆలోచనలో పడ్డారు.
ఇప్పుడున్న పరిస్థితి నుంచి గటెక్కాలంటే పాదయాత్ర చేయడమే ఉత్తమమని కేసీఆర్ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. దాని ప్రకారమే ఈ విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారట. ప్రజల తరపున పోరాటం చేయడమే తమ బాధ్యతని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నది ఆయన మాట. పాదయాత్ర అనగానే ప్రజలు హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన కారు పార్టీ ఎలాంటి హామీలు ఇస్తుందో చూడాలి.