EPAPER

KOULU RAITHULA GOSA: సర్కారు మొండి వైఖరి.. కౌలు రైతు గోస కనబడదా?

KOULU RAITHULA GOSA: సర్కారు మొండి వైఖరి.. కౌలు రైతు గోస కనబడదా?

KOULU RAITHULA GOSA: తెలంగాణ గ్రామీణ సమాజంలో కౌలు రైతుల సంఖ్య క్రమేనా పెరిగిపోతోంది. వారి శ్రేయస్సుపై సోయి పెట్టాల్సిన వ్యవస్థ చోద్యం చూస్తుంటే సంక్షోభాల సంకెళ్లను తెంచుకోలేక అప్పుల చట్రంలో బందీ అయిపోతున్నారు కౌలురైతులు.తెలంగాణలో మెుత్తం రైతులు ఎంత మంది అంటే ఎవరైనా చెప్పే సమాధానం 63 లక్షల పైమాటే అని. మరి తెలంగాణలో కౌలు రైతుల సంఖ్య ఎంత అంటే ఏ ప్రభుత్వ రికార్డుల్లోనూ సమాధానం దొరకదు. ఇందుకు కారణం కౌలు రైతులను తాము రైతులుగానే పనిగణనలోకి తీసుకోమన్న కేసీఆర్ సర్కారు మొండి వైఖరే.


పంట పెట్టుబడికి సాయం అందదు. బ్యాంకులు రుణాలివ్వవు. పంట నష్టపోతే పరిహారం అందదు. వచ్చిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో అవకాశం ఉండదు. అసలు వారిని రైతుగానే గుర్తించదు సర్కారు. రాష్ట్రంలో కౌలు రైతుల దుస్థితి ఇది.

అసలు కౌలు రైతులు అంటే ఎవరు ? అంటే ఏమాత్రం భూమి లేని వ్యవసాయదారులన్నది వ్యవహారిక సూత్రం. ఇదే కాదు అంతో ఇంతో భూమి ఉండి అది జీవనోపాధికి సరిపోక సాగులో లేని ఇతరుల పొలాలను సంవత్సరానికి కొంత డబ్బు ఇచ్చి వ్యవసాయం చేసుకునే వారు కూడా కౌలుదారులే. ఐతే వీరికి కౌలు తీసుకున్న పొలానికి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ సహాయం అందదు. కౌలుకు తీసుకొని సాగుచేసిన భూమిలో పంటపండినా పండకున్నా భూయజమానికి కౌలు మొత్తం చెల్లించాల్సిందే. ఇలా భూమిపై ఎలాంటి హక్కు లేకుండా కేవలం సాగును మాత్రమే నమ్ముకున్న బతికుతున్నారు కౌలు రైతులు. భూ యజమానుల కనికరం లేక ప్రభుత్వం నుంచి చేయూత అందక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


రాష్ట్రంలో కౌలు రైతులసంఖ్య నానాటికి పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం.. మొత్తం రైతాంగంలో కౌలు రైతులు 35.6 శాతం. మొత్తంగా 63.25 లక్షల మంది రైతుల్లో దాదాపు 36 శాతం అంటే 18 లక్షల మంది కౌలు రైతులే. ఐనా సరే వారిని రైతులుగా గుర్తించేందుకు కూడా కేసీఆర్ సర్కారుకు మనసు రావడంలేదు. అందుకే ఇప్పటిదాకా కౌలు రైతులకు సంబంధించి కనీస గణాంకాలు కూడా రూపొందించలేదు. స్వచ్ఛంధ సంస్థలు చేపడుతున్న సర్వేలు.. వాటి లెక్కలే దిక్కయ్యే పరిస్థితి. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లో 80 శాతం కౌలు రైతులవే అంటే.. వారి జీవనం ఎంత దుర్భరంగా మారిందో వేరే ఆధారాలు కావాలా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాత్రికి రాత్రే పథకాలు తీసుకు వచ్చే కేసీఆర్ సర్కారుకు.. కౌలు రైతులు చస్తున్నా కనికరం మాత్రం కలగట్లేదు. వారి కోసం ఒక్కటంటే.. ఒక్క పథకం కూడా తేలేదు. దీంతో.. విపరీతంగా పెరుగుతున్న వ్యవసాయ సంక్షోభ భారాన్నంతా .. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులే భరించాల్సి వస్తున్నది. ఇదే వారిని అప్పుల ఊబిలోకి నెట్టి.. ఉరికొట్టలనో, పురుగుమందుల అన్నాన్నో తిని బలవన్మరణానికి పాల్పడే దుస్థితి కల్పిస్తున్నది.

కౌలు రైతుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోయినా..వారి సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చలేకపోయింది. దీంతో.. కౌలు రైతుల దీన గాథపై సమాజంలో చర్చ మొదలైంది.ఇదే విషయంపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు..కొన్ని రైతు సంఘాలు ముందడుగు వేశాయి. తెలంగాణలో అసలు కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు? కౌలు స్వభావం ఎలా ఉంది? కౌలు రైతుల జీవన పరిస్ధితులు ఎలా ఉన్నాయి? వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? తదితర అంశాలపై రైతు స్వరాజ్యవేదిక ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేసింది.మొత్తం రైతాంగంలో కౌలు రైతులు 35.6 శాతం ఉన్నట్లు తేల్చింది. ఈ సర్వేలో కౌలు రైతులకు సంబంధించి అనేక విస్తుపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాగు కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో ఒక్కో కౌలు రైతు సగటున 2.60 లక్షల అప్పుల భారాన్ని మోస్తున్నట్లు రైతు స్వరాజ్య వేదిక నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. రాష్ట్రంలో ‌‌దాదాపు 42% భూమి కౌలు రైతుల సాగులోనే ఉందని స్పష్టమైంది. వ్యవసాయం చేస్తున్న ప్రతి‌‌ ముగ్గురు రైతుల్లో ఒకరు కౌలుదారేనని..కానీ సర్కారు నుంచి వీరికి ఎలాంటి సాయం అందడం లేదని తేలింది. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో కౌలుదారులే ఎక్కువగా ఉంటున్నారన్న చేదు నిజం స్టడీలో వెలుగుచూసింది.

మల్లారెడ్డి అనే పెద్దాయన తనకున్న 3 ఎకరాలకు తోడు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాడు. ఎనిమిది ఎకరాలకు కలిపి ఏడాదికి 1 లక్ష రూపాయలు కౌలు కట్టాలి. పంట రాబడితో దీనికి సంబంధం ఉండదు. భూయజమానులకు కౌలు బయానా ఇచ్చేముందే.. ఈ మేరకు కాగితం రాసి ఇవ్వాల్సిందే. పంట వేసినప్పుడు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వాతావరణ పరిస్ధితులు బాగోలేక.. వానాకాలం పంట దిగుబడి బాగా తగ్గిపోయింది.పెట్టుబడి మందం కూడా గిట్టుబాటు కాని పరిస్థితి.ఐనా.. సరే మరెక్కడైనా అప్పు చేసైనా .. కౌలు కట్టాల్సిందే. ఈ భారానికి తోడు కుటుంబ ఖర్చులు వెరసి .. తడిసి మోపెడవుతున్నాయి. అప్పుకోసం ప్రామిసరీ నోట్లపై సంతకం పెడుతున్నప్పుడల్లా గుండె తరుక్కుపోయే పరిస్థితి. కౌలు చేసి తాను సాధించింది అప్పుతప్ప మరేం లేదని తెలిసి.. కన్నీరుమున్నీరవుతున్నాడు. ఎందరికో ఎన్నో పథకాలు తెచ్చిన కేసీఆర్.. కౌలు రైతులను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుకున్నాడు. మా గోడు ఇకనైనా ముఖ్యమంత్రి పట్టించుకోవాలని కోరుతున్నాడు.

రాయనర్సు అనే రైతు తనకున్న 30 గుంటల పొలానికి తోడు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నారు. గతంలో మక్క వేస్తే కేవలం 20 బస్తాలే దిగుబడి వచ్చింది. కూలీ ఖర్చులు, పెట్టుబడి పోనూ.. మిగిలిందేమీ లేదు. తాత తండ్రుల నుంచి వీరికి తెలిసింది వ్యవసాయమే. మరొక పని తెలియక.. కష్టమో నష్టమో పొలాన్నే నమ్ముకుంటున్నామంటున్నారు. ఈ ఏడు కాకపోయినా .. మరుసటి ఏటికైనా పంట మంచిగా పండకపోతదా అన్న ఆశతో .. భూదేవినే నమ్ముకొని బతుకున్నమంటున్నాడు.సేద్యం కోసం చేసిన 5 లక్షల రూపాయల అప్పు .. రోజూ వెంటాడుతున్నదని వాపోతున్నాడు.

వీరేకాదు.. తెలంగాణలో గ్రామగ్రామానా ఉన్న వేలాది మంది కౌలు రైతులది ఇదే దుస్థితి. మొత్తం కౌలు రైతుల్లో.. అసలుభూమే లేని వారి సంఖ్య.. 19 శాతం. అంటే దాదాపు 9 లక్షల మంది భూమిలేని కౌలురైతులే. మరో 9లక్షల మంది రైతులకు కాస్తో కూస్తో భూమి ఉంది. దానికి అదనంగా ఇతరుల భూమి కౌలుచేస్తున్నారు.

వ్యవసాయంలో పెట్టుబడి పెరిగిపోవడం.. కౌలు ధరలు ఆకాశాన్నంటడం.. పంట నష్టాలు, ఇతర కారణాలతో.. తెలంగాణ ఏర్పడే నాటికే రైతు ఆత్మహత్యల సంఖ్య తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 ఏళ్లలో దాదాపు 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 75 శాతం మంది అంటే.. ఆరువేలకు పైగా కౌలు రైతులే కావడం ..వారి దుర్భర పరిస్థితికి నిదర్శనం.

తెలంగాణ ఆర్థిక కులగణన ప్రకారం కూడా.. మొత్తం 83 లక్షల కుటుంబాల్లో 30 శాతం మందికి ఎలాంటి భూమి లేదు. NSSO 70వ రౌండ్ గణాంకాల ప్రకారం తెలంగాణలో వ్యవసాయ కుటుంబాలలో సగటు రుణగ్రస్తత..జాతీయస్థాయి కంటే రెట్టింపుగా ఉంది. ఇక కౌలు రైతులది మరీ దయనీయ పరిస్థితి. సగటు కౌలు రైతు తలపై 2.7 లక్షల అప్పు ఉందంటే .. వారెంత కష్టాల్లో ఉన్నారే వేరే చెప్పాలా?

కౌలు వ్యవసాయం మొదలే.. అప్పులతో ప్రారంభమవుతుంది. మొదట కౌలు బయానాగా ..భూయజమానులకు ఎంతో కొంత ముట్టజెప్పాలి.డిపాజిట్ అన్నమాట.పోలాన్ని కౌలుకు తీసుకున్నాక.. దున్నడానికి, విత్తనాలకు, ఎరువులకు, పురుగుమందులకు, కలుపుకూలీలకు.. ఇలా ప్రతి దానికి డబ్బులు ఖర్చు చేయాల్సిందే. వీరికి బ్యాంకులు లోన్లు ఇవ్వవు. దీంతో.. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులే గతి. ఇదే అదనుదా .. ఫైనాన్సర్లు అధిక వడ్డీలకు అప్పులిస్తుంటారు. ఇంత కష్టపడి అప్పోసొప్పో చేసి పంటపండించినా.. అంతా దైవాధీనం అన్న పరిస్థితే. వాతావరణ పరిస్థితులు బాగోలేకున్నా.. చీడపీడలు చెలరేగినా మొత్తం మునగాల్సిందే. ఒకవేళ కాస్తో కూస్తో పంట చేతికి వచ్చి.. దాన్ని సీసీఎస్ లో అమ్మితే.. వచ్చే డబ్బులు భూ యజమాని బ్యాంకు ఖాతాలోనే పడతాయి. దీంతో.. వారు వారికి రావాల్సిన కౌలు పోను మిగితాదే రైతులకు ఇస్తారు. ఒక్కోసారి కౌలుకు సరిపోను రాకపోతే.. మిగతా మొత్తం కట్టాలని వేధిస్తారు. లేదంటే కౌలు కొనసాగించేది లేదని బెదిరిస్తారు. దీంతో.. మరోచోట అప్పుచేసి.. భూయజమానులకు కట్టాల్సిందే.

కౌలురైతుల డొక్కలు ఎండుతూ.. అప్పుల కత్తి గొంతుపై వేలాడుతున్నది.ఐనా..ఆశచావక అన్ని పంటిబిగువన భరిస్తూ.. సాగుచేస్తున్నారు. అలాంటి కౌలు రైతుల్లో ఎవరిని కదిలించినా.. ఏకరువు పెట్టేవి కష్టాలే. తమ సమస్యలపై సర్కారు నిర్లక్ష్యంపై రగిలిపోతున్నారు. సర్కారు తీరుకు నిరసనగా పోరుబాట పట్టాలని ఉన్నా.. ఆర్థిక సత్తువ లేమి వల్ల.. దేవుడే దిక్కని మౌనంగా సమస్యలను భరిస్తున్నారు.

అసలు కౌలు రైతంటే రాష్ట్ర సర్కారుకే కాదు.. కేంద్ర ప్రభుత్వానికి కూడా అలుసే. కౌలు రైతుల కోసం తీసుకుంటున్న చర్యలు శూన్యం.ఏదో హడావుడి చేసి .. ఆ తర్వాత ఊసే ఎత్తకపోవడమనేది సర్వసాధారణమైపోయింది.ఇలాగే 2015లో దేశవ్యాప్తంగా కౌలు రైతుల గుర్తింపు, హక్కుల కల్పన కోసం.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో నీతి అయోగ్ సంస్ధ నమూనా కౌలు రైతు చట్టాన్ని రూపొందించాలని సంకల్పించింది. దానికి సిఏసిపి మాజీ చైర్మన్ డాక్టర్ టి.హక్ ఛైర్మన్ గా ఒక కమిటీని వేసింది.ఈ కమిటీ దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి.. ఒక నమూనా కౌలు చట్టాన్ని రూపొందించింది. ఈ కమిటీ నివేదిక అంచనా ప్రకారం తెలంగాణాలో కౌలు రైతుల సంఖ్య 13.56 శాతం. గత ఏడేళ్లలో కౌలు రైతుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. అంటే.. 2018 లో రైతు బంధు పథకం వచ్చాక కూడా కౌలు రైతులు, కౌలు సేద్యం పెరుగుతూనే ఉంది. అంటే.. రైతు బంధు తీసుకుంటున్న యజమానులు .. తమ పొలాలను కౌలుకు ఇస్తూ.. రెండు రకాలుగా లాభపడుతున్నారన్నమాట.

వ్యవసాయ భూమి కలిగిన భూయజమానుల్లో 26 శాతం మంది ప్రైవేట్ ,ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తూ తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. వీరు సేద్యం చేసేది లేదు కానీ.. ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సౌకర్యాలని అంటే రైతు బంధు, రైతు భీమా ,తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం ఇతరత్రా సౌకర్యాలన్ని దర్జాగా అనుభవిస్తున్నారు. వీటికి తోడు కౌలు డబ్బులు అదనంగా జేబులో వేసుకుంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 చట్టం ప్రకారం భూ అధీకృత సాగుదారుల చట్టం..కౌలు రైతులను గుర్తించింది. వారికి రుణ అర్హత కార్డులను -LSEC జారీ చేయాలని పేర్కొంది. ఇది తెలంగాణలో కూడా అమల్లో ఉంది. దీని ప్రకారం తాము కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో రెవెన్యూ అధికారులకు కౌలు దారులు దరఖాస్తు చేయాలి. దీన్ని అధికారులు ధ్రువీకరిస్తే.. రుణ అర్హత కార్డులు ఇవ్వడంతోపాటు వారికి సాగురుణాలు, పంటల బీమా పథకాలకు అర్హత లభించేది. కానీ తెలంగాణ ప్రభుత్వం దీన్ని బుట్టదాఖలు చేసింది. కౌలు రైతులను గుర్తించడానికి తాము సిద్ధంగా లేమని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే.. ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. కౌలు రైతులు ఒక ఏడాది ఒకరి దగ్గర.. మరో ఏడాది మరొకరి దగ్గర కౌలుకు తీసుకుంటారు. అలాంటప్పుడు వారిని గుర్తించడం వీలుకాదనేది ప్రభుత్వ వాదన. అంతేకాక అడంగల్ లో వాస్తవ సాగుదారులను నమోదుచేసే సాగుదారుల కాలమ్ ను 2018లోనే రాష్ట్రప్రభుత్వం తొలగించింది. దీనితో వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు ఎటువంటి హక్కులు లేకుండా పోయాయి.

కౌలు రైతులను గుర్తించమని చెప్పడం .. ప్రజాస్వామ్య విరుద్ధమంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఒక మనిషి చేసే వృత్తిని గుర్తించమని చెప్పే అధికారం ప్రభుత్వానికెక్కడిదని ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలైన కౌలు రైతులకు రైతు భీమా ఇవ్వలేనప్పుడు.. భూమి యజమానులకు రైతుబంధు వర్తింపజేయడం ఎలా సబబు అని నిలదీస్తున్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు.. క్షేమంగా ఉన్న భూయజమానుల కోసమా .. సంక్షోభంలో ఉన్న కౌలు రైతుల కోసమా అని ప్రశ్నిస్తున్నారు.

చిన్న సన్నకారు రైతులైన కౌలుదారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్యాంగమే చెప్పిందని గుర్తుచేస్తున్నారు వ్యవసాయ నిపుణులు. రాజ్యాంగంపై చిత్తశుద్ధి ఉంటే.. కౌలు రైతులకే.. రైతుబంధు, రైతుభీమా, పంటరుణం, పంట నష్టపరిహారం, పంటలబీమా తదితర పథకాలను వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ధరణిలో సాగుదారుల కాలమ్ ను పునరుద్దరించి.. ప్రతి సీజన్ లో వాస్తవ సాగుదారులను అధికారికంగా గ్రామస్థాయిలో నమోదుచేయాలంటున్నారు. ఇలా అన్ని విధాలా కౌలురైతులకు భరోసా ఇస్తేనే వారికి కాస్తా అయినా ఉరట కలుగుతుందంటున్నారు.

సాగుతప్ప మరోటి తెలియని కౌలు రైతులు.. రోజురోజుకూ సంక్షోభంలో చిక్కుకు పోతున్నారు. ఆపతిసోపతిలో ఎవరు అక్కరకు రాకున్నా.. ముళ్లబాటల్లాంటి సమస్యల నడుమ ఓంటరి పోరు చేస్తూ అష్టకష్టాలుపడుతున్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాదు భూయజమానులది కూడా. వారు మానవత్వంతో ఆలోచించి పంటపెట్టుబడిని వాస్తవంగా సాగుచేసేవారికి అందించడం కనీస బాధ్యత. కానీ చాలామంది వ్యవసాయం చేయకున్నా తమ భూమి మీద వచ్చే అన్ని సహాయాలను పొందుతూ.. కౌలు రైతుల దగ్గరి నుంచి ముక్కుపిండి మరీ కౌలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పద్ధతి మారాలంటున్నారు వ్యవసాయవేత్తలు.

తమ బతుకులు బాగుపడాలంటే..తెలంగాణ సర్కారు సత్వరమే 2011 అధీకృత చట్టాన్ని అమలుచేయాలని కౌలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. గుర్తింపుకార్డులు ఇవ్వాలని.. ఇందుకు అవసరమైతే చట్టంలో మార్పులు చేయాలని కౌలు రైతులందరూ కోరుతున్నారు.ఇదీ.. రైతు రాజ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న తెలంగాణలో .. కౌలు రైతుల గోస. మరి ఇప్పటికైనా కౌలురైతుల ఆక్రందనలు ప్రగతిభవన్ గోడలను దాటి .. కేసీఆర్ చెవికి చేరుతాయా? కౌలు రైతుల గోడు మారుతుందా? కాలమే సమాధానమే చెప్పాలి.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×