BRS Women Leaders: బీఆర్ఎస్ పెద్దలు కొన్ని రాజనీతి సూత్రాలు చెబుతారు. తాము అన్ని వర్గాల ప్రజలను గౌరవిస్తున్నామని, ముఖ్యంగా మహిళలంటే తమకు ఎనలేని అభిమానమని సందర్భాన్ని బట్టి చెప్పారు.. చెబుతున్నారు కూడా. మా పార్టీ మాదిరిగా వారికి అంత గుర్తింపు ఎవరు ఇవ్వరని ఓపెన్‌గా చెబుతారు. కానీ లోగుట్టు మాత్రం వేరేలా ఉంది. అసలు విషయం బయటకు వచ్చాక నేతలు సైలెంట్ అయిపోయారు. అది మాకు తెలీదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కారు పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. పవర్ పోయిన తర్వాత ఇప్పుడిప్పుడే అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. మహిళల అంశంపై అప్పుడప్పుడు నోరు జారిన సందర్భాలున్నా యి.
రెండు నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రీ బస్సుల స్కీమ్‌పై కేటీఆర్ టంగ్ స్లిప్ అయ్యారు. మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కి బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారంటూ చేసిన కామెంట్స్ తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారాయన.
మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేను అధికార పార్టీ సభ్యులు ఏదో అన్నట్లు ఇంట బయటా తెగ రచ్చ చేశారు ఆ పార్టీ నేతలు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదంతా డ్రామా అని చివరకు తేలిపోయింది. ఆ సమయంలో మహిళలపై ఆ పార్టీ నేతలు నీతి సూత్రాలు వల్లించారు కూడా.
ALSO READ: హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ స్కామ్.. రంగంలోకి ఏసీబీ!
లేటెస్ట్‌గా ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త కారు పార్టీ నేతపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీలో కొందరు ఉన్నారని, వాడికి తప్ప ఎవరికీ సపోర్టు చేసినా నరకం చూపిస్తాడంటూ ఆ మహిళ చేసిన ట్వీట్ ఆ పార్టీలో పెద్ద దుమారం రేగింది.
వాడి టార్చర్ తట్టుకోలేక పార్టీలో కొనసాగడం కష్టంగా ఉందని, అందుకే గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించింది. ఆ పార్టీ ఆమెకున్న రెండున్నర దశాబ్దాల బంధాన్ని తెంచేసుకుంది. జరుగుతున్న పరిణామాలను గమనించిన కొందరు మహిళా నేతలు కారు ఎక్కాలంటే భయపడిపోతున్నారు.
ఉద్యమం నుంచి ఉన్న మహిళలకు అలాంటి పరిస్థితి ఉంటే కొత్తగా వెళ్తేవారి పరిస్థితి ఏంటంటూ చర్చించుకోవడం మొదలైపోయింది. ఇంకో విషయం ఏంటంటే.. ఆ పార్టీలో మహిళలకు కేటాయించిన పదవులు అలాగే ఉండిపోయాయట. వాటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ ఆ పార్టీ శ్రేణులు గుసగుసలు పెట్టేసుకున్నాయి.
దశాబ్దాల తరబడి ఇండియాలో చాలా పార్టీలు ఉన్నాయని, వాటిలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు లేదన్నది గులాబీ శ్రేణుల మాట. ఈ లెక్కన రేపటి రోజున ఆ పార్టీ ఉన్న కొంతమంది మహిళా కార్యకర్తలు, నేతలు సైతం దూరం కావచ్చనే చర్చ పొటిలికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. మరి గుసగుసలకు గులాబీ హైకమాండ్ చెక్ పెడుతుందా? లేదా? అన్నది చూడాలి.