Delhi Liquor Scam Latest News(Telugu breaking news today): ఢిల్లీ లిక్కర్ స్కాం. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఆ కేసులో ఎమ్మెల్సీ కవిత పూర్తిగా ఇరుక్కుపోవడమే అందుకు కారణం. రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీగా ఉంటూ సౌత్ గ్రూప్ యవ్వారమంతా ముందుండి నడిపించారనేది దర్యాప్తు సంస్థల ఆరోపణ. అందుకే, పిళ్లై చుట్టూ పూర్తిగా ఉచ్చు బిగించి.. జైల్లో పెట్టారు. మరి, పిళ్లై ఎవరికోసమైతే ఇదంతా చేశారో ఆమెను అరెస్ట్ చేసే సాహసం మాత్రం చేయలేకపోతున్నారు. రేపోమాపో కవిత అరెస్ట్ అంటూ ప్రచారమైతే జరుగుతోంది కానీ.. ఆ దిశగా అడుగులు వెనక్కే పడుతుండటం ఆసక్తికరం. అందుకే, బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఏదో డీల్ కుదిరిందని.. ఆ రెండు పార్టీలూ దొందుదొందేనంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.
కట్ చేస్తే.. అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్ తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా కవిత పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. సౌత్ గ్రూప్‌ను కవిత తరఫున పిళ్లైనే లీడ్ చేశారంటూ ఈడీ వాదనలు వినిపించింది. ఇదీ లేటెస్ట్ అప్‌డేట్. ఇలా పదే పదే కవిత చుట్టూనే ఈడీ దర్యాప్తు జరుగుతుండటం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే కవితను రెండుసార్లు సుదీర్ఘంగా ప్రశ్నించింది ఈడీ. ఆమెకు చెందిన 10 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని.. అందులోని డేటా పరిశీలించింది. అప్పుడే అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఆఖరి నిమిషంలో ఏదో జరిగి.. కవిత హైదరాబాద్‌కు తిరిగొచ్చేశారు.
అయితే, ఈడీ ఇంత దూకుడుగా దర్యాప్తు చేస్తున్నా.. ఇదే కేసులో సీబీఐ తీరు మాత్రం మరోలా ఉంది. కవితను మొదట ప్రశ్నించింది సీబీఐనే. హైదరాబాద్‌లోని ఆమె ఇంటికే వెళ్లి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు సీబీఐ అధికారులు. ఈడీ మాత్రం అలా కాదు. కవితనే ఢిల్లీ పిలిపించారు. తాను మహిళనని.. తనకు కొన్ని హక్కులు ఉంటాయని.. కవిత ఎంతగా గగ్గోలు పెట్టినా, కోర్టుకు వెళ్లినా.. ఈడీ వెనక్కి తగ్గలేదు. ఢిల్లీ రప్పించి.. రెండు రోజుల పాటు టెన్షన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కోర్టులో మరోసారి కవిత బినామీ పిళ్లైయ్యే అంతా చేశారంటూ వాదించి అదే దూకుడు ప్రదర్శించింది.
ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ వేసిన రెండో ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంది ప్రత్యేకకోర్టు. అయితే, గతానికి భిన్నంగా సీబీఐ తాజా చార్జ్‌షీట్‌లో ఎక్కడా కవిత పేరు కనపించలేదు. కవితను ప్రశ్నించినా.. ప్రశ్నించిన వారి జాబితాలో కవిత పేరును చేర్చలేదు సీబీఐ. ఇప్పటి వరకు ప్రశ్నించిన 89 మంది వివరాలను ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు సీబీఐ అధికారులు. అందులో కవిత పేరు లేకపోవడం ఆసక్తికరం. ఇలా, ఒకే కేసులో.. ఈడీ ఒకలా, సీబీఐ మరొకలా వ్యవహరిస్తుండటాన్ని ఎలా చూడాలి?