EPAPER

Telangana Assembly : సామాజిక సాధికారతకే బీసీ కులగణన..!

Telangana Assembly : సామాజిక సాధికారతకే బీసీ కులగణన..!
Telangana Assembly Session 2024

Telangana Assembly Session 2024 : తెలంగాణ శాసనసభ శుక్రవారం ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జనాభా దామాషా ప్రకారం తమ వాటా తమకు కల్పించాలంటూ బీసీ వర్గాలు దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పినట్లు ‘ఎంత జనాభాకు.. అంత వాటా’ విధానానికి కట్టుబడిన తెలంగాణలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ప్రజలందరి వాస్తవ స్థితిగతులు, వారి వివరాలను శాస్త్రీయంగా సేకరించేందుకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించడానికి వీలుగా ఈ కులగణనను చేపట్టనున్నారు. ఇంతకూ బీసీ కులగణన ఎందుకంటే..


భారత రాజ్యాంగంలోని 15(4), 16(4) (5) ప్రకారం బీసీలకు విద్య- ఉద్యోగాల్లో కల్పించిన రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయటానికి ఇది అత్యంత అవసరం. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఏ మేరకు ప్రాతినిథ్యం ఉంది? ఏయే కులాలు వివక్షకు గురవుతున్నాయి? ఆయా కులాల్లోని అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయి? వంటి అంశాలు కులగణనతో స్పష్టంగా తెలుస్తాయి. ఇవన్నీ తెలియాలంటే.. ముందుగా కులాల వారీగా జనాభా, వారి వివరాలు తెలియాలి.

Read more : చట్టానికి తూట్లు.. కంచర్లకు కోట్లు..!


మన రాజ్యాంగం పంచాయతీ రాజ్, మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు అమలు కావాలంటే.. వార్డు మొదలు మండలం, మున్సిపాలిటీ వరకు అక్కడ జనాభా ఎంత? అందులో బీసీ జనాభా ఎంతో తెలియాలి. ఒకవేళ అక్కడ బీసీ జనాభా ఎక్కువ ఉంటే.. ఆ సీట్లను బీసీలకు కేటాయిస్తారు. కానీ.. చట్టబద్ధమైన కులగణన వివరాలు లేకపోవటంతో ప్రస్తుతం లాటరీ పద్ధతిలో బీసీలకు స్థానాలు కేటాయిస్తున్నారు. ఏ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను బీసీలకు కేటాయించాలి? ఏ మేరకు ఇవ్వాలనేదానిపై పలు కోర్టు కేసులూ నడుస్తున్నాయి. సమగ్ర బీసీ కులగణన జరిగితే.. ఈ తలనొప్పులన్నీ శాశ్వతంగా తప్పిపోతాయి.

1992లో వచ్చిన మండల్‌ కమిషన్‌ కేసులో సందర్భంగా సుప్రీంకోర్టు 11 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం.. బీసీ కులాల ఆర్థిక, సామాజిక ప్రగతిని పరిశీలించి, వారిలో అభివృద్ధి చెందిన కులాలను బీసీ జాబితా నుంచి తొలగించాలని తీర్పు చెప్పింది. అది అమలు కావాలంటే.. కులాల వారీ జనాభా, ఆయా కులాల్లోని ఉద్యోగుల వాటా, విద్యావంతుల శాతం వంటి లెక్కలు తేలాలి. కనుక కులగణన అవసరమే.

రిజర్వేషన్ల కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టు ముందుకు వచ్చిన ప్రతిసారీ స్పష్టమైన కులగణన చేయాలంటూ ఆయా కోర్టులు కేంద్రానికి ఆదేశాలు ఇస్తూనే వచ్చాయి. ఇక.. 1992 మండల్‌ కేసు, 2006లో కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్లపై పెట్టిన కేసు, 2010లో పంచాయతీరాజ్‌ రిజర్వేషన్ల కేసు ఇలా పలు కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బీసీ కులాల లెక్కలు తేల్చాలని పేర్కొంది.

దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నా.. కేవలం ఎస్సీ, ఎస్టీలకు కులగణన జరుగుతోంది. దీనివల్ల వారు తమ జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారు. అటు.. కేంద్రంలో, రాష్ర్టాల్లో ఎస్సీ/ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసి వారికోసం బడ్జెట్‌ కేటాయింపులు జరుగుతున్నాయి. కానీ.. బీసీల విషయంలో ఇది జరగటం లేదు. బీసీ జనాభా లెక్కలు బయటికొస్తే.. బీసీలకు ఆ వెసులుబాటు లభిస్తుంది.

1971 నాటి అనంతరామన్‌ కమిషన్‌, 1989 నాటి మండల్ కమిషన్ నివేదికల ఆధారంగా ఇన్నాళ్లుగా మనం బీసీలకు విద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వస్తుండగా, గత 30 ఏళ్లలో బీసీల్లో వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతి మీద సాధికారమైన లెక్కలేవీ లేవు. కనుక తాజా బీసీ గణన ఈ లోటును తీరుస్తుంది. దీనివల్ల అభివృద్ధి చెందిన బీసీ కులాలను జాబితా నుంచి తొలగించి, వెనకబడిన బీసీ కులాలకు న్యాయం చేయవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో బీసీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించారు గానీ.. కేంద్రంలో, అనేక రాష్ర్టాల్లో బీసీలంతా ఒకే రిజర్వేషన్ గొడుగు కింద ఉన్నారు. అనేక విజ్ఞప్తుల తర్వాత కేంద్రం జస్టిస్‌ రోహిణి కమిషన్‌ను నియమించి బీసీల విభజనకు ముందడుగు వేసింది. కానీ.. కులగణన వివరాలు లేకపోవడంతో రోహిణి కమిషన్‌ ఏదీ తేల్చలేకపోయింది. కనుక కులగణన అవసరం ఉన్నదని చెప్పక తప్పదు.

జాతీయ బీసీ కార్పొరేషన్‌, రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ వంటి సంస్థలు ఉన్నప్పటికీ.. ఆయా కులాల జనాభా లెక్కలు లేకపోవటంతో బీసీలకు బడ్జెట్ కేటాయింపుల్లో తగిన న్యాయం జరగటం లేదు. దీంతో ప్రభుత్వాల దయ మీద బీసీల బతుకులు ఆదారపడుతూ వస్తున్నాయి. స్పష్టమైన గణాంకాలు ఉంటే.. ప్రభుత్వాలకూ ఈ విషయంలో ఇబ్బందులు తప్పుతాయి. అలాగే.. ఆయా కులాల జనాభా లెక్కను బట్టి సంక్షేమ పథకాలకు కేటాయించే నిధుల విషయంలోనూ స్పష్టత వస్తుంది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×