Jharkhand Assembly elections : మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్ రాష్ట్రంలోని భోకారో ప్రాంతంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రత్యేక పరిశీలకుడిగా పర్యటిస్తున్నారు. అక్కడి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన భట్టి.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ కూటమిని విజయ తీరాలకు చేర్చాలని భావిస్తున్న ఏఐసీసీ.. భట్టి సహా కీలక నాయకులకు అక్కడ సమన్వయ బాధ్యతలు అప్పగించింది. దీంతో.. ఝార్ఖండ్ లో పర్యటిస్తున్న భట్టి విక్రమార్క కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
రాష్ట్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముందు ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన భట్టి విక్రమార్క.. దేశం ఆధునికత దిశగా సాగడంలో ఇందిరా గాంధీ మరువలేదని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి ఇరవై సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయీకరణ, గరీభీ హటావో నినాదంతో ఈ దేశ భవిష్యత్తుపై ఇందిరా గాంధీ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రస్తుత బీజేపీ నాయకుల చేతిలో దేశం నానాటికి వెనక్కి వెళుతుందని విమర్శించిన భట్టి విక్రమార్క.. సంపన్న పెట్టుబడి దారులు ఈ దేశాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
దేశాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగ మౌళిక సూత్రాలను కాపాడడంతో పాటు దేశ వనరులను కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ఓటు వేసి కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా సమన్వయంగా పనిచేస్తే ఇండియా కూటమి ఝార్ఖండ్ లో ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోకారో అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్వేతా సింగ్ ను గెలిపించి, చట్ట సభకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భోకారో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమేష్ గుప్త, మనోజ్ సింగ్ ఏఐసీసీ మెంబర్ సుశీల్ ఝా, ఉమేష్ గుప్తా సహా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : బీఆర్ఎస్ నేతల్లో గందరగోళం.. ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు?
ఇటీవల ఎన్నికలు జరిగిన హరియాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ.. ఒటమి పాలయ్యారు. దీంతో.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఘండ్ రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అక్కడి డివిజన్లకు జాతీయ నాయకుల్ని ప్రత్యేక పరిశీలకులుగా కొందరిని నియమించింది. తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలను ఏఐసీసీ ఆయా రాష్ట్రాల్లో సమన్వయ కర్తలుగా నియమించింది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు నవంబర్ 20న ఒకే విడుతలో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌లో ఉన్న 81 స్థానాలకు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా… రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి.