Big Stories

Congress: సీఎం రేసులో కోమటిరెడ్డి? బర్త్‌డే పేరుతో బలప్రదర్శన?.. కర్నాటక ఎఫెక్ట్?

Komatireddy-Venkat-Reddy

Congress: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. 57వ పుట్టిన రోజు. ఇదేమంత ప్రత్యేకమైన ఏజ్ కాదు.. అయినా, ఎందుకో ఏమో కానీ.. చాలా అట్టహాసంగా, ధూంధాంగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. వేలాది మంది కార్యకర్తలతో, భారీ ర్యాలీ తీసి.. నల్గొండ జిల్లాలో బలప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ర్యాలీలో కోమటిరెడ్డి సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తింది.

- Advertisement -

ముఖ్యమంత్రి పీఠంపై వెంకట్‌రెడ్డి కన్నేశారా? అందుకే ఇలా బర్త్ డే పేరుతో తన బలగంతో బలప్రదర్శన చేశారా? కార్యకర్తలతో సీఎం నినాదాలు ఆయనే చేయించారా? అనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి మాత్రం ఇది బల ప్రదర్శన కాదంటున్నారు. మరేంటి?

- Advertisement -

మరో నాలుగు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. సీఎం పదవి వెతుక్కుంటూ వస్తుందంటూ హాట్ కామెంట్ చేశారు కోమటిరెడ్డి. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంటే వారే సీఎం అవుతారని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో అలానే జరిగిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారని.. తాను సీఎం రేసులో లేనని.. గతంలో ఇదే కోమటిరెడ్డి అన్నారు. ఇప్పుడు మాత్రం మాట మార్చారు. బహుషా, కర్నాటక పరిణామాలు ఆయనలో సీఎం ఆశను రేకెత్తించాయని అంటున్నారు. ఎన్నికలకు మరో 4 నెలలు మాత్రమే టైమ్ ఉండటంతో.. కాంగ్రెస్ విజయావకాశాలు బాగా మెరుగుపడటంతో.. ఇప్పటినుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును వ్యూహాత్మకంగా ప్రచారంలో ఉంచుతున్నారా? అనే డౌటు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే, ఇంతగా ఎండ దంచుతుంటే.. మండుటెండలో బర్త్‌డే పేరుతో అంతగా హంగామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది సగటు కాంగ్రెస్ కార్యకర్త అనుమానం. కావాలనుకుంటే సీఎం పదవి అదే వస్తుందనడంలో ఆంతర్యం ఏంటి?

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొన్నాళ్లుగా కాంగ్రెస్‌కు కిరికిరిగా మారారు. పీసీసీ చీఫ్ పదవి రాకపోవడంతో బాగా అసహనంలో ఉన్నారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని పిలుపిచ్చి బాగా బద్నామ్ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డిలానే ఈయనా బీజేపీలో చేరుతారంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అటూఇటూగా ఉంటున్న సమయంలో కర్నాటకలో బీజేపీకి చావు దెబ్బ తగలడం, కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో.. కోమటిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. నల్గొండకు ప్రియాంకగాంధీని తీసుకొస్తానంటూ.. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేస్తానంటూ.. సీఎం సీటు వెతుక్కుంటూ వస్తుందంటూ.. కొత్త పాట అందుకున్నారు.

ఇదంతా సరేగానీ, ఒక్క నల్గొండలో బలం ఉన్నంత మాత్రాన సీఎం పదవి వచ్చేస్తుందా? ఓవైపు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు పార్టీ కోసం తమవంతుగా కష్టపడుతుంటే.. వారికి కాదని ఈయనకు ముఖ్యమంత్రి కిరీటం కట్టబెడతారా? మునుగోడులో కిరికిరి రాజకీయాలు చేసి పార్టీకి డ్యామేజ్ చేసిన విషయం అంతా మర్చిపోతారా? సర్దుకుపోయి సీఎంను చేస్తారా? ఇంత చిన్న లాజిక్ కోమటిరెడ్డి ఎలా మిస్ అయ్యారబ్బా!? అంటూ తమలో తాము చర్చించుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News