EPAPER

N Convention: మనల్ని ఎవడ్రా ఆపేది..!.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. పూర్వపరాలు

N Convention: మనల్ని ఎవడ్రా ఆపేది..!.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. పూర్వపరాలు

హైడ్రా ఆన్ డ్యూటీ.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
ఆనాడు ఏం జరిగింది? ఇప్పుడేం జరిగింది?


– నగరంలో హైడ్రా దూకుడు
– వివాదాస్పద ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
– హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున
– అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని వెల్లడి
– 3.5 ఎకరాలు అక్రమమంటూ హైడ్రా కౌంటర్
– అసలీ వివాదం ఏంటి?
– బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది?
– తిమ్మిడికుంట చెరువు ఎంతమేర కబ్జాకు గురైంది?
– ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఏంటి?
– కూల్చివేతలు సరే ఆ డబ్బంతా వసూలు చేస్తారా?
– స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ కథనం

దేవేందర్ రెడ్డి, 9848070809


అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా). చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరు ఆక్రమణకు పాల్పడినా వదలడం లేదు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. దీంతో మరోసారి తిమ్మిడికుంట చెరువు వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలీ వివాదం ఏంటి? కబ్జా ఎలా జరిగింది? నాగార్జునకు ఉన్న వాటా ఎంత? రేవంత్ రెడ్డి ఈ కబ్జాపై ఎప్పటినుంచి పోరాటం చేస్తున్నారు? ఇలా అన్నింటిపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం వివరాలు తెలుసుకుంది.

అసలీ వివాదం ఏంటి..?

హైటెక్ సిటీ జంక్షన్‌కు కొద్ది దూరంలో ఉంటుంది ఎన్ కన్వెన్షన్. మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి ఆనుకునే తిమ్మిడికుంట చెరువు ఉంటుంది. ఈ చెరువు విస్తీర్ణం 29 ఎకరాలు. ఇందులో 3.5 ఎకరాల దాకా హీరో నాగార్జున కబ్జా చేశారనేది ఆరోపణ. ఎకరా 12 సెంట్ల దాకా ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్‌టీఎల్), మరో 2 ఎకరాల 18 గుంటలు బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కేవలం ఎఫ్‌టీఎల్‌కు 25 మీటర్ల పరిధిలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి. కానీ, రూల్స్‌కు వ్యతిరేకంగా పలు నిర్మాణాలు జరిగాయి.

సీఎం రేవంత్‌కు కోమటిరెడ్డి లేఖ

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్ కన్వెన్షన్ వివాదంపై ఆగస్ట్ 21న సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తిమ్మిడికుంట చెరువులో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపారు. శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలు హైడ్రాకు ఇచ్చారు. మంత్రి లేఖతో రంగంలోకి దిగిన హైడ్రా, విచారణ జరిపింది. కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనిపై విచారించారు. ఎన్‌ కన్వెన్షన్‌ భాగస్వాములుగా అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతంరెడ్డి ఉన్నారని, మూడున్నర ఎకరాల దాకా కబ్జా జరిగిందని తేల్చారు. ఎన్ కన్వెన్షన్ చుట్టుపక్కల ఉన్న కమర్షియల్ షెడ్ల కూల్చివేతకు ఆదేశించారు.

కమిషనర్ ఆదేశాలతో కూల్చివేతలు

ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని తేలడంతో హైడ్రా అధికారులు శనివారం ఉదయం కూల్చివేతకు దిగారు. భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో కూల్చివేతలు కొనసాగాయి. ఉదయం 7 గంటల నుంచి మొదలైన కూల్చివేత, 11 గంటల వరకు కొనసాగింది. మొత్తం 6 భారీ మెషిన్లు, జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు. చెరువు చుట్టూ ఉన్న ఇతర నిర్మాణాలను కూడా ఖాళీ చేయించారు.

కోర్టు మెట్లెక్కిన నాగార్జున

హైడ్రా కూల్చివేతతో కంగుతిన్న నాగార్జున, హైకోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టీ వినోద్ కుమార్ విచారణ జరిపారు. హైడ్రా అక్రమ కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు. ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ శ్రీ రఘురాం వాదనలు వినిపించారు. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని అన్నారు. విచారణ తర్వాత కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది హైకోర్టు.

Also Read: N Convention Demolition: ‘N కన్వెన్షన్’లో ఫంక్షన్ చెయ్యాలంటే అంత చెల్లించాల్సిందే – వామ్మో ఏడాదికి నాగ్ అంత సంపాదిస్తున్నాడా ?

కూల్చివేతలు బాధాకరమన్న నాగార్జున

స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేత చేపట్టడం బాధాకరమని అన్నారు నాగార్జున. తమ ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఆ భూమి పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని తెలిపారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు అయిందని, ఇప్పుడు కూల్చివేత చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. అసలు దీనిపై తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని వాపోయారు.

నాగార్జునకు హైడ్రా కౌంటర్

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. తిమ్మిడికుంట ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణలను కూల్చేశామని తెలిపింది. 2014లోనే తిమ్మిడికుంట హెచ్ఎండీఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేసింది. 2016లో ఫైనల్ నోటిఫికేషన్‌ను ఇచ్చిందని స్పష్టం చేసింది. 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకే యాజమాన్యం సమక్షంలో ఎఫ్‌టీఎల్ సర్వేను హెచ్ఎండీఏ నిర్వహించింది. దానిపై 2017లో ఎన్ కన్వెన్షన్ మళ్లీ కోర్టుకు వెళ్లింది. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఎలాంటి స్టే ఆర్డర్‌ను కోర్టు ఇవ్వలేదని స్పష్టం చేసింది హైడ్రా. యాజమాన్యం అన్నింటినీ మానిప్యులేట్ చేస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపింది. ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిందని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ కూడా ఈ కట్టడాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని వివరించింది హైడ్రా.

కేసీఆర్ హయాంలో జరిగింది ఇదే!

ప్రత్యేక తెలంగాణ తర్వాత 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 2015లో దీని కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే, అప్పటి ప్రభుత్వంతో నాగార్జున కుమ్మక్కయి, అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని అసెంబ్లీలోనే ప్రస్తావించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేందుకు బుల్డోజర్లను పంపిన బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్లీ వాటిని వెనక్కి పిలిపించింది. ఆ తర్వాత ఎవరూ దీని జోలకి పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్నాళ్లకు కూల్చివేత జరిగింది.

Also Read: Bhadrapada Amavasya 2024: భాద్రపద అమావాస్య రోజు ఈ పూజ చేస్తే సంతాన భాగ్యం !

అసలు, ఈ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏంటి?

హైదరాబాద్‌ నగరంలో చాలా చెరువులు కబ్జాలకు గురయ్యాయి. ఇప్పుడు వాటికి మోక్షం కలిగించేందుకు హైడ్రా చర్యలకు దిగింది. దీంతో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. 25 హెక్టార్లు, అంతకంటే విస్తీర్ణంలో ఉండే చెరువులు, కుంటలు, జలాశయాలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. వాటికి 30 మీటర్ల దూరంలో ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు. ఎవరికైనా వాటి చుట్టూ భుములుంటే వ్యవసాయం చేసుకోవచ్చు, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. కానీ, నిర్మాణాలు చేపట్టకూడదు. నీటి వనరుల లభ్యతను బట్టి ఈ బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తుంటారు. ఇక, ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్‌టీఎల్) ను నీటి పారుదల శాఖ నిర్ణయిస్తుంది. వర్షాకాలంలో చెరువులు, కుంటల్లో పూర్తిగా నీరు చేరుతుంది. ఎంత సామర్థ్యంతో నీరు ఉంటుందో అక్కడి దాకా ఎఫ్‌టీఎల్ పరిధి అంటారు. అయితే, నీరు అన్ని కాలాల్లో ఉండదు కాబట్టి, ఆక్రమణలు జరుగుతుంటాయి.

కూల్చివేతలు సరే.. ఆ డబ్బంతా వసూలు చేస్తారా?

ఎన్ కన్వెన్షన్ పేరుతో తిమ్మిడికుంటలో 3.5 ఎకరాల దాకా కబ్జా అయింది. ఆక్రమించిన భూమిలో నిర్మాణాలు జరిగాయి. పెళ్లిళ్లు, సమావేశాలు, ఇతర మీటింగుల కోసం దీన్ని వాడుతుంటారు. చాలా కాస్ట్లీగా ఉండే ఎన్ కన్వెన్షన్‌లో ఎక్కువగా బడాబాబుల కార్యక్రమాలు జరుగుతుంటాయి. రేట్లు కూడా హై రేంజ్‌లో ఉంటాయి. ఎన్ కన్వెన్షన్‌లో ఓ ఫంక్షన్ చేయాలంటే రూ.10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇందులో రెండు పెద్ద ఏసీ హాల్స్ ఉంటాయి. మెయిన్ హాల్ 27వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. 25వందల మంది దాకా కూర్చోవచ్చు. రెండో హాల్ కాస్త చిన్నది. ఇందులో 500 మంది దాకా కూర్చునే వీలుంటుంది. ఇవి కాకుండా, గార్డెన్ ఏరియా, ఎన్ డైమండ్ పేరుతో మరో లగ్జరీ హాల్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఒకేరోజు 3 వేడుకలను నిర్మించుకోవచ్చు. 2015 నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాగా, ఇన్నేళ్లలో అక్రమ నిర్మాణాల్లో యాజమాన్యం ముక్కు పిండి మరీ వసూలు చేసిన సొమ్ము ఎంత? ఇన్నాళ్లు సాగించిన ఆ వసూళ్లను ప్రభుత్వం తిరిగి రాబడుతుందా? కూల్చివేతలు చేసి చేతులు దులుపుకుంటుందా? అనుమతులు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం, అధికారులను ఏం చేస్తుంది? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×