EPAPER

Hyderabad City Lakes: చెదిరిన చెరువులు.. అంపశయ్యపై జీవధారలు..

Hyderabad City Lakes: చెదిరిన చెరువులు.. అంపశయ్యపై జీవధారలు..

Hyderabad City Lakes: భాగ్యనగరం చెరువులకు నిలయం.శతాబ్దాలుగా ఎన్నో చెరువులు ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తూ మన సంస్కృతిలో భాగమై విరాజిల్లుతున్నాయి. అలాంటి చెరువుల ఉనికి రానురాను ప్రమాదంలో పడుతోంది. ఆధునిక నగరం. అభివృద్దికి కేరాఫ్ అడ్రస్. గ్లోబల్ సిటీగా ఓ పక్క ఎదుగుతున్నా ఆ అభివృద్ధి మాటున చెరువుల చెర కొనసాగుతూనే ఉంది. ఎందరో రాబందులు ఆక్రమనలతో అక్రమ నిర్మాణాలతో అడుగడుగునా చెరువులకు సంకెళ్లు వేస్తూ అంతకంతకు కబ్జా చేస్తూ పోతూనే ఉన్నారు. దీంతో వర్షంతో చెరువు నిండిదంటే సంతోషించాల్సిన పరిస్థితి నుంచి భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.


హైదరాబాద్ నానాటికి విస్తరిస్తూ పోతుండడం, అనేక ప్రాంతాల వారికి ఒక ఉపాధి కేంద్రంగా విరాజిల్లుతుండడంతో ఇక్కడ భూముల విలువ చుక్కల్లో చేరింది. దీంతో భూమి కేంద్రంగా జరిగే కాసుల వేటకు ఈజీగా దోచుకునే రాచమార్గంగా చెరువు కనబడింది. ఎంత ఆక్రమించినా ఆడిగే నాథుడే లేడని గద్దల్లా చెరువు భూములను దోచుకుంటునే ఉన్నారు ఎందరో రాబందులు.

ఇది ఉప్పల్ లో ఉన్న నల్లచెరువు. నాటి కాలంలో ప్రజల తాగునీరు సాగునీరు కోసం అని 100 ఎకరాలపై చిలుకు విస్తీర్ణంలో ఈ చెరువును ఏర్పాటు చేశారు. నగరం అంతకంతకు విస్తరిస్తూ పోతుండటం. దానికి తగ్గట్టే అనేక రకాల పరిశ్రమలు, కంపెనీలు చుట్టుపక్కల ఏర్పాటు కావడం ఆ పరిశ్రమల వ్యర్ధజలాలు యథేచ్ఛగా ఈ చెరువులో కలుస్తుండటంతో ఈ చెరువు ఫూర్తిగా కలుషితం అయిపోయింది. అంతేకాక సిటీకి దగ్గరగా ఉండటం, నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఎందరో అక్రమణదారుల కన్ను ఈ చెరువుపై పడింది. దీంతో రాజకీయ నాయకుల అండతో అధికారులను చేతిలో పెట్టుకొని యథేచ్ఛ ఆక్రమించేసేయడం తర్వాత అమ్ముకోవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో చెరువు విస్తీర్ణం కాస్తా 30 ఎకరాలకు పడిపోయింది.చెరువలోకి నీటిని తెచ్చే పీడర్ చానెల్స్ ముసుకుపోయి మరోపక్క ఎఫ్ టీ యల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలతో చెరువు రోజురోజుకు కృషించి పోతుంది.సుందరీకరణ పేరుతో ప్రస్తుంతం చెరువు మధ్యలో కట్టలు నిర్మించి అభివృద్ధి చేస్తున్న ఫ్రభుత్వం అక్రమ నిర్మాణాల మాట మాత్రం మరిచారు.


ఇది వనస్థలిపురం బీయన్ రెడ్డి నగర్ డివిజన్ లో నిజాంకాలం నాటి చెరువు. తాగునీటి కోసం నాటి పాలకులు నిర్మించిన ఈ చెరువులో సాహెబ్ నగర్ స్థానిక ప్రజలు బతుకమ్మలు వేస్తుండటంతో దీనికి బతుకమ్మ కుంటగా ముద్ర పడిపోయింది. ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కి చెరువు విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయింది. వ్యర్థాలతో నిండి మురిగి గుంటగా మారిపోయింది . చెరువు నుంచి నీరు కిందికి వెల్లే మార్గం కూడా అక్రమణలకు గురికావడం, చెరువు స్థలం నుంచే రోడ్డు వేయడంతో వర్షాకాలం వస్తే చాలు చుట్టుపక్కల వాసులు భయంతో బతకాల్సిన పరిస్ధితి. చెరువును పూడ్చి డంపింగ్ యార్డ్ గా మార్చాలని కూడా గతంలో ప్రయత్నాలు జరిగాయని స్థానికులు అడ్డుకోవడంతో అది ముందుకు సాగలేదు. చెరువు దుస్థితిపై కొందరు స్థానికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు కూడా చేయడంతో ఎన్.జి.టి జాయింట్ కమిటీ వచ్చి విచారణ చేసింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తమ చెరువును బాగుచేసి చూట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే కాస్తయినా కబ్జాలు ఆగుతాయని స్థానికులు కోరుతున్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోయిన చెరువే కూకట్ పల్లి పరిసరాల్లో ఉన్న ఎల్లమ్మ బండ చెరువు . గతంలో 41 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ చెరువు ఇప్పుడు సగానికి సగం కుచించుకు పోయింది. చెరువుకు ఫెన్పింగ్ కూడా లేకపోవడంతో కబ్జాదారులకు అది ఓక వరంగా మారింది. దీంతో అడ్డూ అదుపు లేకుండా దొరికి నంత జాగా కబ్జాల పరమైపోయింది. మిగిలిన ఆకాస్తా మురికి గుంటగా మారి పందులకు, చెత్తకు కేరాఫ్ గా మారిపోయంది. ఈ చెరువుకు సంబంధించిన పేరు గాని విస్తీర్ణం గాని ఎక్కడా పేర్కొన లేదు.

జీవ వైవిద్యం అంటే రకరాకాల మెక్కలు జంతువులకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ప్రాంతం. ఈ అమీన్ పూర్ ప్రాంతం అలాంటిదే. ఈ చెరువును 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీలు తీగు సాగు కోసం నిర్మించారు. మెత్తం 300 ఎకరాలపైచిలుకు విస్తీర్ణంలో ఉండే ఈ చెరువు ఇప్పుడు సగానికి పడిపోయింది. ఎక్కడికక్కడ చెరువును కనికరం లేకుండా కబ్జాచేశారు. అనేక పక్షులకు ఆలవాలమైన ఈ ప్రాంతం చుట్టు పక్కల వివిధ రకాల ఫార్మా కంపెనీలు, రబ్బర్ టైర్ల కంపెనీలు, కూల్ డ్రింక్ కంపెనీలు, పలు రకాల కంపెనీలు రావడంతో చెరువు కింద వందల ఎకరాల్లో ఆయకట్టు సాగయ్యే ప్రాంతం మొత్తం కాంక్రీట్ జంగిల్​గా మారింది. పారిశ్రామిక వాడ కావడంతో వాటి వ్యర్థ రసాయన జలాలన్నీ చెరువులో కలుస్తుండడంతో చెరువు నీరు తీవ్రంగా కలుషితం అయిపోతోంది. ప్రభుత్వం జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తించినప్పటికి ఆ స్థాయిలో వైవిద్యాన్ని కాపాడేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో చెరువు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. గతంలో ఎన్నో పక్షిజాతులకు నెలవుగా ఉండే ఈ ప్రాంతానికి వచ్చే పక్షుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంతేకాదు ఈ కాలుష్యంతో జలచరాలు కూడా జీవించలేని స్థితికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్సకారులు.

కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లుగా చెరువులని ఆక్రమించేస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వం సుందరీకరణ అంటూ కోట్లు ఖర్చు పెడుతుంటే మరోపక్క ఎన్నో చెరువుల పరిస్థితి మాత్రం కనీస మెయింటెనెన్స్ లేకుండా దుర్వాసనకు, చెత్తా చెదారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి.

2022 మార్చి 3న నీటి వనరుల చుట్టూ ఉన్న ఆక్రమణల తొలగింపు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు, ట్యాంకుల పునరుద్ధరణలో జాప్యాన్ని వివరించాలని నీటిపారుదల శాఖను, జిల్లా కలెక్టర్‌ను NGT ఆదేశించింది. దీంతో నీటిపారుదలశాఖ నగరంలోని 134 సరస్సుల చుట్టూ ఎఫ్‌టీఎల్‌లలో 8,718 ఆక్రమణ నిర్మాణాలు, బఫర్ జోన్‌లలో మరో 5,343 నిర్మాణాలు ఉన్నాయని ఎన్జీటీకి ఇచ్చిన నివేదిక లో పేర్కొంది.

కూకట్‌పల్లిలోని మైసమ్మ చెరువులో 1745 ఆక్రమణలు ఉండగా తదుపరి స్థానంలో మీరాలం చెరువు, ఫాక్స్ సాగర్ లు ఉన్నాయి. జీడిమెట్ల చెరువుగా ప్రసిద్ధి చెందిన చెరువు ఫాక్స్ సాగర్. హైదరాబాద్‌లోని అతిపెద్ద సరస్సులలో ఒకటి. కొంపల్లి-కుత్బుల్లాపూర్ ప్రాంతాలతోపాటుగా చుట్టుపక్కల నివసించే స్థానికులు పిక్నిక్ స్పాట్‌గా వస్తుంటారు. ఈ సరస్సు మొత్తం 1,014 అక్రమ నిర్మాణాలతో భారీగా ఆక్రమణకు గురైంది. వాస్తవానికి 480 ఎకరాల్లో ఉన్న చెరువు కాలక్రమేనా కబ్జా కోరల్లో చిక్కి సగానికిపైగా అన్యాక్రాంతమైనట్లు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ చెరువు విస్తీర్ణం ఎంతుందో కూడా చెప్పలేని పరిస్థితి. అంతలా ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఫాక్స్ సాగర్​లో చేరిన వరద నీరంతా హుస్సేన్ సాగర్‌లోకి చేరాలి. సుభాష్‌నగర్, ఫతేనగర్ నాలా మీదుగా హుస్సేన్ సాగర్ లో కలవాలి. కానీ ఎప్పుడు ఈ చెరువు అలుగు పొంగింది లేదు. తూములు తెరిచింది లేదు. ఇదే అవకాశంగా మార్చుకున్న కొందరు అక్రమార్కులు సుభాష్ నగర్, జీడిమెట్ల,షాపూర్ నగర్,కుత్బుల్లాపూర్,చింతల్ సహా ఎగువనున్న శిఖం భూముల్లో యథేచ్చగా నిర్మాణాలు చేపట్టారు. అడ్డుచెప్పే వారు లేక ప్రైవేటు వ్యక్తులదే రాజ్యంగా మారింది. వరద ప్రవాహానికి ఆ నిర్మాణాలన్నీ అడ్డుగా మారాయి. అలాగే ఈ చెరువుకు ఎగువన 12 గొలుసుకట్టు చెరువులున్నాయి. మైసమ్మగూడ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, కొంపల్లిలోని చెరువుల నీరంతా పాక్స్ సాగర్ లో కలుస్తుంది. అక్కడి నుంచి దిగువకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయి కానీ ఎప్పుడు లేని విధంగా ఈసారి వర్షాలకు 34 అడుగులకు నీటిమట్టం చేరింది. అప్పటికే అలుగు పొంగి సుభాష్‌నగర్, జీడిమెట్ల, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్ లోని నివాసాలను వరద తాకింది.

నగరంలో 30 చెరువుల్లో దాదాపు 85 శాతం చెరువుస్థలాలను ఆక్రమించగా 104 చెరువుల్లో దాదాపు 15 శాతం ప్రాంతాన్ని ఆక్రమించేశారు.ఇది పేరుకు మాత్రమే. వాస్తవంగా చెప్పాలంటే నగరంలో కబ్జాకు గురికాని చెరువు లేదంటే అతిశ యోక్తి కాదు.

కొన్ని చెరువుల ఆక్రమణలు..
కూకట్‌పల్లిలోని మైసమ్మ చెరువు-1745
బహదుర్‌పుర మిరాలం చెరువు-1635
జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌-1014
సరూర్‌నగర్‌ పెద్ద చెరువు-841
నాచారం పెద్ద చెరువు-719
మల్కాజ్‌గిరి బండ చెరువు-667
రామంతపూర్‌ చిన్న చెరువు-555
మల్కాజ్‌గిరి (సఫిల్‌గూడ) నడిమి చెరువు-549
రామంతపూర్‌ చెరువు-468
మూసాపేట్‌ కాముని చెరువు-449
మల్కాజ్‌గిరి ముక్కిడి చెరువు-386
షేక్‌పేట షహతం చెరువు-370
రాయదుర్గంలోని దుర్గం చెరువు-281
ఆక్రమణలు జరిగినట్టుగా నివేదిక చెబుతోంది.

వెనకటి రోజుల్లో తాగు, సాగు నీటి కోసమే చెరువులు కట్టారని కానీ ప్రస్తుతం నగరంలో సాగు చేయడం లేదుగా అంటూ ల్యాండ్ యూసేజ్ మార్చి ప్రభుత్వమే ఆక్రమణలకు దారి చూపిందని దీంతో చాలామంది రాజకీయ నాయకుల అండతో రాజ్యాంగానికి, చట్టాలకు విలువలేకుండా ఏం చేస్తారో చేసుకోండి అంటూ బాహటంగా కబ్జాలు చేస్తుపోతున్నారని అధికార యంత్రాంగాలు చోద్యం చూస్తున్నారని అందుకే ఇలాంటి పరిస్ధితి వచ్చిందంటున్నారు నిపుణులు. ప్రజలు మేల్కొని ప్రశ్నించడం అలవాటు చేసుకొని ప్రజలందరి ఉమ్మడి ఆస్తులైన చెరువులను కాపాడుకోవాలంటున్నారు.

గతంలో హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో 4000 చెరువుల వరకు ఉండేవని, ప్రభుత్వ అసమర్ధతలో వాటిలో చాలావరకు కనుమరుగైపోయాయని ఉన్న వాటికన్నా బౌండరీలు ఉన్నాయా అంటే అదిలేదని కేవలం 40 చెరువులకు మాత్రమే హద్దులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. స్వంత రాష్ట్రం ఏర్పడే నాటికి హెచ్ఎండీఏ,జీహెచ్ఎంసీ పరిధుల్లో 2,857 చెరువులు మిగిలాయని అవైనా ఉన్నాయా అంటే 2,380 మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా అత్యధికం ఆక్రమణలు, కబ్జా చెరలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.

అంతేకాదు హైదరాబాద్ నగరంలో కొంతకాలంగా పట్టనీకరణ విపరీతంగా పెరిగిపోతుందని దీంతో చాలామందికి చెరువేదో కుంటేదో తెలియక అక్కడ అమ్మే స్థలాలను కొని మోసపోతున్నారని కాబట్టి ప్రతి రెవెన్యూ కార్యాలయంలో చెరువులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని చెరువు స్థలంలో కొంటె అది చెల్లుబాటుకాదు అని హెచ్చరిక బోర్డులు పెట్టాలని కాని అదేది లేకపోవడంవల్ల ఎందరో కొని ఇక్కట్లు పడుతున్నారని అంటున్నారు నిపుణులు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని చెరువులను కాపాడాలంటే ప్రతిచెరువుకు రెవెన్యూ బౌండరీలు ఏర్పాటు చేసి దాని వివరాలు రెవెన్యూ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలంటున్నారు.

చెరువుల్లోని వ్యర్థాలు,రసాయనాలతో నీటిపై గ్రీన్ ఆల్గే ఏర్పడుతోంది. దీంతో చెరువుల నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది. చెరువుల్లో కలిసే వ్యర్థాల పరిణామాలను బట్టి తీవ్రత ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెరువుల్లో విడుదలయ్యే గ్యాస్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయాలి. వాసన తీవ్రత ఎక్కువగా ఉండి జనాలు అనారోగ్య సమస్యల బారిన పడతారని భావిస్తే ఆ చెరువు చుట్టుపక్కలకు వెళ్లొద్దని హెచ్చరిక బోర్డు పెట్టాలి. ముందుగా చెరువుల్లో మురుగు నీరు కలవకుండా ఆపాలి. ప్రస్తుతం అలాంటివేమి లేవు. చాలా చెరువల్లో గుర్రపు డెక్క కూడా విస్తరిస్తోంది. ఎన్నో చెరువుల్లో ప్రాణులు నివసించడానికి వీలయ్యే బివోడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇది మంచి పరిణామం కాదని జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టు అంటున్నారు జీవవైవిద్య నిపుణులు.

చాలా చెరువులు ప్లాస్టిక్ వ్యర్థాలకు అడ్డాగా మారిపోతున్నాయి. సహజంగానే ప్లాస్టిక్ వ్యర్థాలు అంత తేలికగా భూమిలో కలవవు. నీటిలో కరగవు. అవి చిన్న చిన్న ముక్కులుగా విడిపోయి నానో ప్లాస్టిక్స్ గా మారతాయి. ఈ ప్లాస్టిక్స్ మరింత ప్రమాదకరం. జీవవైవిద్యం పర్యావరణ వ్యవస్తపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల చెరువునే నమ్ముకున్న అనేక చిన్న జీవులకు ఇది ప్రమాదకరంగా మారుతోంది అంటున్నారు నిపుణులు.

మిషన్ కాకతీయ అనే కార్యక్రమం చేపట్టి చెరువుల పునరుద్ధరణ అని చెప్పిన ప్రభుత్వం. అది కాంట్రాక్టర్లకు వరంగా మార్చిందే తప్పా ప్రజల భాగస్వామ్యం లేకుండా చేపట్టిందంటున్నారు. అంతేకాక ఎల్ఆర్ఎస్ ..బీఆర్ యస్ లపేరుతో ప్రభుత్వమే ఆక్రమణలు ప్రోత్సహిస్తోందని మీరు చెరువు ఆక్రమించుకొని కట్టుకోండి ఎల్ఆర్ యస్ ..బీఆర్ఎస్ లతో నామినల్ గా కొంత అమోంట్ కట్టి రెగ్యులర్ చేయండి అన్నట్లుగా ఉన్న ప్రభుత్వ తీరు కూడా కబ్జాదారులకు వరమైంది అంటున్నారు.మరి ఎల్ఆర్ఎస్.. బీఆర్ఎస్ ల వల్ల వచ్చే డబ్బుతో హైదరాబాద్ లో వరదలు నివారించగలరా అని ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి చెరువుల పర్యవేక్షణ పునరుద్ధరణ కబ్జాల నియంత్రణ సుందరీకరణ ఎఫ్ టీ.యల్ బఫర్ జోన్ ల గుర్తింపు బౌండరీల ఏర్పాటు కోసం రెవెన్యూ , ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో రివర్ ప్రొటెక్షన్ ఫోర్స్ లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇది పేరుకు మాత్రమే ఉంది. చేతల్లో దీని వైఫల్యం వల్ల కబ్జా పర్వం యథేచ్ఛగా కొనసాగుతూనే వస్తోంది. అయితే ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు చెరువుల సంరక్షణ కై పాటు పడుతున్న నిపుణులు. విస్తీర్ణం తగ్గి వ్యర్థాలతో నిండిపోతున్న చెరువులను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు కష్టమేనంటున్నారు.

ఇతర దేశాల్లో ఉమ్మడి వనరులను ఆక్రమిస్తే అది తీవ్ర మైన నేరం. దాన్ని అరికట్ట లేకపోయిన ప్రభుత్వం మెదటి ముద్దాయిగా పరిగణిస్తారు. కానీ మన దగ్గర అడ్డదిడ్డంగా చెరువులను ఆక్రమించి చెరువుల్లోనే కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు రోడ్లు డ్రైనేజ్,కరెంటు స్తంబాలు, డ్రైనేజ్ లైన్స్ ఇచ్చి అధికారికంగా కబ్జాలు చేస్తున్నారని ఎక్కడ ప్రభుత్వం విఫలమయ్యంది అంటే శాఖల మధ్య వైఫల్యం వల్ల ఎటువంటి వైఫల్యం తలెత్తుతోందని ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకోవడం తప్ప అధికారులు మరేం చేయలేక పోతున్నారంటున్నారు నిపుణులు.

చెరువులు ప్రకృతి ప్రసాదించిన వనరులు జీవవై విద్యకేంద్రాలు కానీ ఇటువంటి చెరువులు రోజు రోజుకు చిక్కి మురికి గుంటలుగా చెత్తతో నిండిపోతున్నాయంటే బఫర్ జోన్ లు, ఫీడర్ చానల్లు కూడా ఆనవాల్లు లేకుండా పోతున్నాయంటే ఎఫ్‌టీఎల్‌లు పూర్తిగా నివాస కాలనీలుగా మారుతున్నాయంటే పూర్తి వైఫల్యం ప్రభుత్వానిదేనని బల్దియా, వాటర్‌‌‌‌ వర్క్స్, పీసీబీల సమన్వయ లోపంతోనే చెరువులు మురుగుగా మారిపోతున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.అభివృద్ది మాటున జరిగే ఈ విద్వంసాన్ని అడ్డుకోక పోతే రాబోయే రోజుల్లో నగరం మరింత సమస్యను ఎదుర్కోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు

నగరం నలుదిక్కులా విస్తరిస్తూ పోతోంది. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారి గ్లోబల్ సిటీగా ఎదుగుతుంది. అది మంచిదే కానీ ఆ మాటున జరుగుతున్న చెరువుల విధ్వంసం నిరాటంకంగా కొనసాగుతున్నా పాలకులు నిద్రనటిస్తే భవిష్యత్ హైదరాబాద్ ని వరదలకు వదిలేయడమే.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×