Hyderabad: అందరూ ఉద్దండులే. సివిల్ సర్వీస్ ఆఫీసర్లే. IAS, IPSలు. అందులోనూ సీనియర్లు. కానీ రూల్స్ తెలీక కొట్టుకుంటున్న పరిస్థితి. వాళ్ల మధ్య ఓ రోడ్డు రచ్చ రాజేసింది.
హైదరాబాద్ పుప్పాల్‌గూడలోని ఆదర్శనగర్ సొసైటీలో రోడ్డు నిర్మాణంపై అగ్గి రాజుకుంది. హైకోర్టు వరకు వెళ్లింది. ఆదర్శనగర్ సొసైటీ భూముల నుంచి రోడ్డు ఎలా వేస్తారంటూ.. IAS, IPS అధికారులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు పనులను అడ్డుకున్నారు.
అయితే.. రోడ్డు పనులు కొనసాగించాలని కాంట్రాక్టర్‌కు HMDA ఆదేశాలు జారీ చేయడంతో వాళ్లంతా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఆ HMDA కమిషర్ కూడా సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్. ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆదర్శనగర్ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ పుప్పాలగూడలో IAS, IPSలకు HMDA అధికారులకు మధ్య వివాదం ఎప్పటినుంచో ఉంది. రోడ్ నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. ల్యాంకో హిల్స్ సమీపంలో 100 ఫీట్ల లింక్ రోడ్డు పనులు HMDA చేపట్టింది. ఆ పనుల్ని ఐఏఎస్, IPS అధికారులు అడ్డుకున్నారు. 2007లో సర్వే నెంబర్ 454 లో 57 ఎకరాల స్థలం ను ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. సొసైటికి కేటాయించిన స్థలంలో రోడ్ నిర్మాణం ఎలా చేస్తారంటూ ఐపీఎస్ అధికారులు HMDAని ప్రశ్నిస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద అడుగుల రోడ్డు నిర్మాణ పనులను అధికారులు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డును చూపి హైరేజ్ అపార్ట్‌మెంట్ నిర్మాణాలను HMDA అనుమతించింది. అయితే రోడ్డు వేయవద్దని IAS, IPS అధికారుల పట్టు పడుతున్నారు. HMDA అధికారులు కూడా వెనక్కి తగ్గబోమంటున్నారు.