High level flood water crossed 50 feet Bhadrachalam
ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నిండు కుండలా ప్రవహిస్తోంది.50 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం చుట్టుపక్కల గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మైకుల ద్వారా ముంపు ముప్పు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. వరద నీటి మట్టం 60 అడుగులకు చేరుకునే ప్రమాదం ఉండటంతో దాదాపు పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుకుంటోంది.
గోదావరి ఉగ్రరూపం
గోదావరి ఉపనదుల వరద నీరు కూడా గోదావరికి వచ్చి చేరడంతో గోదావరి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి నదులనుంచి వచ్చే వరద నీరు గోదావరిలో కలుస్తోంది. మంగళవారం రాత్రికి 53 అడుగులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయవలసి వస్తుంది.గతంలో 1986 సంవత్సరంలో 70 అడుగుల స్థాయిలో భద్రాచలం వద్ద నీటి మట్టం నమోదయింది. తీరం వెంట గట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తుంగభద్ర కూడా తోడయితే..
తుంగభద్రకు కూడా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తక తప్పదని అధికారులు అంటున్నారు. ఇక తుంగభద్ర నీరు కూడా కలిస్తే గోదావరి నీటి మట్టం గంటగంటకూ ప్రమాద కర స్థాయికి చేరుకోవచ్చు. దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాలకే వరద ముప్పు తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దుమ్ముగూడెం పరిధిలో పదమూడు గ్రామాలు వరద నీటిలో చిక్కుకుంటాయని ఆ ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. 2023 సంవత్సరంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 73 గా నమోదయింది. అదే జరిగితే భద్రాచలం పరిధిలోని వందకు పైగా గ్రామాలు మునిగిపోతాయని అంటున్నారు. నీటి పారుదల అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటి పరిస్థితి పట్ల అప్రమత్తం అవుతున్నారు. ఏ ఏ ప్రాంతానికి అధికంగా వరద ముప్పు పొంచి వుందో ఆ ప్రాంతాల ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.