EPAPER

Rythu Bandhu Politics : రైతు బంధుపై బీఆర్ఎస్ రాజకీయం.. కాంగ్రెస్ పై నిందలు.. అంతా డ్రామానే ?

Rythu Bandhu Politics : రైతు బంధుపై బీఆర్ఎస్ రాజకీయం.. కాంగ్రెస్ పై నిందలు.. అంతా డ్రామానే ?

Rythu Bandhu Politics : తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు రాజకీయం పీక్స్‌కు చేరింది. ఇన్నాళ్లూ నిధులు లేవని చేతులెత్తేసిన కేసీఆర్‌ సర్కార్‌ మరో కొత్త డ్రామాకు తెరతీసింది. నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతివ్వగా తప్పించుకునేందుకు కొత్త నాటకం మొదలు పెట్టింది. అన్ని రూల్స్‌ తెలిసిన మంత్రి హరీష్‌రావు కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు. రైతు బంధు డబ్బులు మంగళవారం ఖాతాల్లో పడతాయని ప్రచారం చేశారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన ఈసీ గులాబీ పార్టీకి షాక్‌ ఇచ్చింది. రూల్స్‌ బ్రేక్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఇక ఎప్పటిలాగే ఈ నెపాన్ని కూడా కాంగ్రెస్‌పై నెట్టేస్తూ బీఆర్ఎస్‌ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇంతకీ రైతు బంధు ఎపిసోడ్‌లో తెరవెనుక ఏం జరుగుతోంది? అసలు ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు ఉన్నాయా? అంటే లేవన్న సమాధానం వినిపిస్తోంది.


రైతు బంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఈసీ పరిగణలోకి తీసుకుని.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ నిధుల విడుదలకు పర్మిషన్ ఆపివేసింది. అన్నదాతల ఖాతాల్లో మంగళవారం నాడు డబ్బులు పడతాయని వ్యాఖ్యలు చేశారు. రెండురోజుల పాటు వరుసగా రైతులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. ఇది కాస్తా రివర్సైంది. ఎన్నికల సంఘం బీఆర్ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. నిధుల విడుదల ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయానికి కూడా ఈసీ క్లారిటీ ఇచ్చింది. మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని.. అందుకే రైతు బంధు నిలిపివేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. దీనిపైనా సాకులు వెతికి కాంగ్రెస్‌ను బ్లేమ్‌ చేసేందుకు బీఆర్ఎస్‌ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి వచ్చిందని.. ధర్మం, న్యాయం గెలిచిందని మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నారు. నోటి కాడా బుక్కను కాంగ్రెస్ ఆపిందని అంటున్నారు. అయితే ఈసీ లెటర్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్‌తో నిర్ణయం తీసుకున్నామని ప్రస్తావించకపోవడం గమనార్హం.

ఈ నిర్ణయం రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ పరచింది. రైతు బంధు నిధులు వస్తాయని అన్నదాతలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మంగళవారం ఎప్పుడెప్పుడా అని ఫోన్ల వైపు గమనిస్తున్నారు. పెట్టుబడి సాయం వస్తుందని ఆశించారు. కానీ, పిడుగులాంటి వార్త అన్నదాతల గుండెల్లో రాయిపడేలా చేసింది. రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్‌ వేసిందనే న్యూస్‌ సంచలనంగా మారింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రిగా ఉన్న వ్యక్తికి ఎన్నికల కోడ్‌ తెలియదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్‌ నేతలు కాంగ్రెస్‌పైకి నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు వల్లే రైతు బంధు ఆగిపోయిందంటూ గులాబీ నేతలు రాజకీయం రక్తికట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వల్లే రైతు బంధు నిధులు విడుదలకు బ్రేక్‌ పడిందనే ఆరోపణలను హస్తం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రైతుల పట్ల బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేదనేది మరోసారి తేలిపోయిందంటున్నారు. ఎన్నికల కోడ్‌ అమలుకు ముందే తాము నిధులు విడుదల చేయామని చెప్పామని.. దానిపైనా తప్పుడు ప్రచారానికి తెరలేపారని హస్తం నేతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా నిధులు లేకపోవడం వల్లే కొత్త డ్రామాకు తెరలేపారని ఫైరయ్యారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత,అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామ – అల్లుళ్లకు లేదని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. అలాంటి వారిని ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదన్నారు. రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని.. కాంగ్రెస్‌ రాగానే 15 వేల రైతు భరోసా నగదు ఖాతాల్లో వేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.


ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు ఎన్నికల నిబంధనలు తెలియవా? లేదంటే కావాలనే ఆయన రైతు బంధు సాయంపై ఎన్నికల ప్రచారంలో మాట్లాడారా? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. గతంలోనూ ఎన్నికల సమయంలోనూ రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో బీఆర్ఎస్‌ ప్రభుత్వం వేసింది. మరి ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా హరీష్‌ మాట్లాడటం వెనుక ప్రభుత్వం దగ్గర నిధుల లేవనే చర్చ జరుగుతోంది. రైతు బంధుకు అనుమతిస్తూ.. ఎక్కడా మాట్లాడవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరి కోడ్‌ ఉల్లంఘించిన హరీష్‌రావు.. నిందను కాంగ్రెస్‌పై నెపం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు ఎన్నికల సంఘంపైనా గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. గతంలో రైతు బంధు నిధులను ప్రభుత్వం.. ఎప్పుడూ ఒకే విడతలో విడుదల చేయలేదు. ఒకటి, రెండు ఎకరాలు ఉన్న రైతులకు ముందుగా.. ఆ తర్వాత ఎకరాల వారీగా విడతల వారీగా డబ్బులు ఖాతాల్లో వేసే వారు. అయితే ఇప్పుడు ఒకే విడతలో అందరికీ నిధులు విడుదల చేయాలంటే ప్రభుత్వ ఖజానా వద్ద దాదాపు 7 వేల కోట్లు ఉండాలి. అంత మొత్తం లేకపోవడం వల్లే కోడ్‌ను ఉల్లంఘించి.. ఈసీతోనే అనుమతిని ఉపసంహరించుకునేలా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక ఎకరంతో మొదలుపెట్టి మమ అనిపిస్తే రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడమే కాకుండా నిధులు లేకుండా కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శల డ్రామా తేలిపోతుంది. అందుకే ఇలా హరీష్‌రావు కోడ్‌ ఉల్లంఘించి మాట్లాడారనేది స్పష్టమవుతోంది. ఇటీవల కేటీఆర్‌ సైతం టీ వర్స్క్‌లో నిరుద్యోగులతో ముఖాముఖిలో ఫండ్స్‌ లేవని అంగీకరించారు. అయితే హరీష్‌రావు మరోలా చెబుతున్నారు. ఇక కేసీఆర్‌ కౌలు రైతుల పొట్టగొట్టేలా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.

రుణమాఫీ సహా అనేక హామీలు విస్మరించడంతో బీఆర్ఎస్‌ తీరుపై జనం ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సమయంలో ఒక్క రైతు బంధు నిధుల విడుదలకే ప్రభుత్వం అనుమతి ఎందుకు తెచ్చుకుందని చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదల తదితర అంశాలపై ఈసీని ఎందుకు సంప్రదించలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టమైందని అన్నారు. రైతు బంధు నిధులు ఇప్పుడు విడుదల అయ్యేవి తీసుకోవాలని ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చాక మరో 5 వేల ఆర్థిక సాయం కూడా చేస్తామని ప్రకటించారు.

రుణ మాఫీ సహా అనేక హామీలను బీఆర్ఎస్‌ ప్రభుత్వం విస్మరించింది. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదేళ్ల పాలనా వైఫల్యాలపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మేడిగడ్డ కుంగుబాటు సహా లక్షలాది కోట్ల అవినీతిపై గులాబీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. వీటన్నింటిపై దృష్టి మరల్చి కాంగ్రెస్‌పై దుష్ర్పచారం చేయడమే కేసీఆర్‌ అండ్‌ కో పనిగా పెట్టుకుంది. కర్ణాటక, కరెంట్‌ అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా రైతు బంధుపైనా రాజకీయం చేస్తూ అభ్యంతరం లేదని చెప్పిన కాంగ్రెస్‌ను బద్నాం చేసే కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం వల్లే హరీష్‌రావు ఈసీ కొరడా ఝుళిపించేలా డ్రామాకు తెరతీశారని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×