EPAPER

GUDEM PY GUNPOINT: నల్లమల అడవిలో ఏం జరుగుతోంది?

GUDEM PY GUNPOINT: నల్లమల అడవిలో ఏం జరుగుతోంది?

GUDEM PY GUNPOINT(Telangana News Today):

చుట్టూ కొండగుట్టలు.నడుమ రణగొనద్వనులకు తావులేని ప్రశాంత ప్రకృతి. పక్షుల కిలకిలలు.. కీచురాళ్ల అరుపులు స్పష్టంగా వినిపిచేంత నిశబ్దం.
ఓపక్క ఎండిన ఆకులపై జంతువుల కాలిగిట్టల అలికిడి.. గలగలా పారే సెలయేర్లు.. స్వచ్ఛమైన వాగులు వంకలు..పొదల ఎదల్లో నుంచి ఎదిగి తపస్సులో ఉన్న మౌనమునుల్లా గంభీరమైన మహావృక్షాలు.
జీవవైవిధ్యానికి ప్రతికైన అమ్రాబాద్ ప్రాంతంలోని నల్లమల్ల అడవి ఇది.


నాగర్ కర్నూల్ జిల్లాలోని ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో తరతరాలుగా ఆదిమ సమాజపు ఆనవాల్లు కలిగిన చెంచులు నిసిస్తున్నారు.నల్లమలకే పరిమితమైన ప్రధాన గిరిజన తెగ వీరిది. భౌగోళిక ఏకాకిత్వం.. సమాజంలో కలవలేని బిడియం.. వీరిని అనాదిగా అడవులకే పరిమితం చేసింది. నాగరిక సమాజానికి దూరంగా.. అభయారణ్యంలో అచ్చమైన మానవుల్లా జీవిస్తున్నారు.

చెంచులకు అభయారన్యాలే లోకం. బలమైన బంధుత్వాల పునాదులపై.. తమదైన సంస్కృతినే పాటిస్తారు. ఆధునికులమని చెప్పుకుంటున్న మన సమాజంలో ఆడపిల్లల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది.కానీ చెంచు సమాజంలో మాత్రం ఆడపిల్లలు,మగపిల్లలు అన్న వివక్షే లేదు. ఆడమగ అందరూ సమానమే. కుటుంబ వ్యవహారాల్లో భార్యభర్తలకు సమాన పాత్ర. బహుభార్యత్వం కూడా అమల్లో ఉంది. అంతేకాదు తమ పిల్లలకు వివాహం కాగానే మరో గుడిసె కట్టించి వేరుకాపురం పెట్టిస్తారు.మేక పిల్లనో,ఆవు దూడనో కట్నంగా ఇస్తారు.అంతేకాదు సుస్థిరాభివృద్ధి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం చెంచులు. ప్రకృతి వనరులు మానవుడి అవసరాలకు తీరుస్తాయి. కానీ అత్యాశలకు భూమండలం కూడా సరిపోదు అని సుస్ధిరాభివృద్ది గురించి మహాత్మా గాంధీజీ సూత్రీకరించారు.ఇది తెలియకున్నా.. చెంచులు తమ జీవిత సూత్రంగా పాటిస్తున్నారు. కేవలం తమ అవసరాలకు తీర్చుకునేందుకే అడవి వనరులను వాడుకుంటారు.అంతేకాదు వన సంరక్షకులై .. వన్యప్రానులను కాపాడుతారు. అందుకే నల్లమల్ల ఇంతపచ్చగా.. వన్యప్రానుల సందడితో కలకలలాడుతోంది.


ఇప్పడు మనం చూస్తున్నది అప్పాపుర్ అనే గ్రామపంచాయతీకి చెందిన చెంచు పెంటలు. చెంచులు అడవుల్లో సమూహాలుగా నివసిస్తారు. 20 నుంచి 25 కుటుంబాలు.. ఒక్కో సమూహం. వీటినే పెంటలు అంటారు. వెదురుతో ఏర్పాటు చేసుకున్న తడకల గుడిసెపై జమ్ముగడ్డితో కప్పువేసుకుంటారు. క్రూరమృగాల నుంచి రక్షణ కోసం చుట్టు వెదురు తడకలతో దడి కట్టుకుంటారు.మచ్చిక చేసుకున్న జంతువులను కంటికి రెప్పగా కాచుకుంటారు. చిరుతలు,పెద్దపులుల బారిన పడకుండా.. తమ పశువులను కూడా వెదురుతో అల్లిన కొట్టాలలో ఉంచుతారు. అనాదిగా చెంచులకు వేట ప్రధాన వృత్తి. కానీ ప్రస్తుతం వన్యప్రానులను వేటాడడం చట్టారీత్యా నేరం కావడంతో.. అడవిలో ఆహార సేకరణకు వెళ్లినప్పుడు ఆత్మరక్షణ కోసం మాత్రమే విళ్లంబులు ఉపయోగిస్తున్నారు.వీరి ఆహారంలో ఎక్కువగా వన్యఉత్పత్తులే ఉంటాయి. ముఖ్యంగా విప్పపువ్వు, చింతకాయ వివిధ రకాల దుంపలు, తేనే లాంటి వాటిని అడవి నుంచి సేకరిస్తుంటారు. అటవి చట్టాల నిబంధనల ప్రకారం వీరికి వ్యవసాయ భూములు ఉన్నప్పటికి.. వీటికి కేవలం వారసత్వ హక్కులు మాత్రమే ఉంటాయి. ఈ భూముల్లో కొందరు జొన్న, రాగుల లాంటి పంటలు సాగుచేసుకుంటున్నారు.దుప్పులు,అడవి పందులు.కోతుల బెడదతో.. చాలామంది సేద్యానికి దూరంగానే ఉంటున్నారు. వంటకు అడవి నుంచి సేకరించిన వంటచెరుకును ఉపయోగిస్తారు. గతంలో రాత్రి సమయాల్లో నెగడుల వెలుతురుతోనే నెట్టుకొచ్చేవారు. ప్రస్తుతం చెంచు పెంటల్లోకి సోలార్ వెలుగులు చేరాయి. అంతేకాక అక్కడక్కడా సెల్ ఫోన్ లు కూడా రింగుమంటన్నాయి.

అడవి అంటే చెంచులు అమ్మతో సమానంగా భావిస్తారు. అందుకే ఎన్ని సాధక బాధకాలు వచ్చినా, క్రూర మృగాలు భయపెట్టినా.. అడవిని మాత్రం వీడట్లేదు. గురువయ్య అనే వ్యక్తి పుట్టినప్పటి నుంచి రాంపురం పెంట లోనే నివాసం ఉంటున్నారు.ఇద్దరు భార్యలు, ఎనమిదిమంది సంతానం. చెంచుల ఆరాధ్యదైవం సలేశ్వర లింగమయ్యకు తరతరాలుగా ఈ కుటుంబమే ప్రధాన పూజారులు.అడవిలో ఉండటం వల్ల అప్పుడప్పులు అడవి జంతువుల బారిన గతంలో పడ్డా, పలుసార్లు పాముకాటుకు గురైనా.. ఇక్కడే బతుకు,అటవిలోనే చావంటున్నాడు గురువయ్య.ఇక్కడి జనాలకు ఈయనే వైద్యుడు. పాము కాటుకు మందైనా.. చలికాలంలో వచ్చే జలుబుదగ్గుకైనా గురవయ్య దగ్గరికి రావాల్సిందే.

పచ్చటి వనాల్లో ఆదిమాజాతి చెంచుల బతుకుల్లో స్వచ్ఛమైన ఆనందమే కాదు.. అనేక సవాళ్లు కూడా ఉన్నాయి.పేదరికంలో మగ్గిపోతున్నాయి.స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యి.. అమృతోత్సవాలను జరుపుకుంటున్న వేళ కూడా.. చెంచు తెగలు ఇంకా సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో పూర్తీగా వెనకబాటుతనంతోనే ఉన్నారు.నిరక్షరాస్యత,అనారోగ్యం,అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి.చాలా కుటుంబాలలో యువతకు ఉపాధి అనేదేలేదు. అటవీ అధికారులు ఉపాధిహామీ పథకం కింద పనులు ఇస్తే చేయడం లేదా ఖాళీగా తిరగడం అంతే. ఇక సాయంత్రమైతే చాలామంది మగవాళ్లకు ఇప్పసారా తాగడం.. మత్తులో జోగడమే పని.

ప్రభుత్వం చెంచు యువకులకు ఉపాధి కల్పన కోసం ఐ.టి.డి.ఏ మున్ననూర్ ద్వారా పెంటకొక ఆటోను రుణం ద్వారా ఇప్పించింది.ఐతే.. వాటిద్వారా ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో కూడా తెలియని అమాయకత్వం ఇక్కడి చెంచులది. లింగస్వామి అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం బతుకు తెరువు కోసం లోన్ ద్వారా ఆటో ఇప్పించారు.అయితే ఇప్పటి వరకు ఒక్క కిస్తు కూడా కట్టలేక పోయనని వాపోతున్నారు లింగస్వామి. ఏప్రిల్ నెలలో సలేశ్వరం జాతర 6 రోజులపాటు అన్ని జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇదే వారికి ఉపాధి.కానీ.. ఫారెస్ట్ అధికారుల ఆంక్షలు వీరికి శాపంగా మారాయి.

నాణ్యమైన విద్య కూడా చెంచు పిల్లలకు అందని ద్రాక్షగానే ఉంది. అప్పాపూర్ గ్రామపంచాయతీ లో చెంచు పిల్లల చదువుల కోసం ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేశారు.పుల్లాయిపల్లి,రాంపూర్,భౌరంపురం, మేడిమొలకల,సంగిడి,గుండాల,ఈర్ల పెంట లకు చెందిన పిల్లలు చదువుకుంటారు. కానీ ఉపాధ్యాయులు సరిగా రారు. పిల్లలు కూడా చదువులపై శ్రద్ధపెట్టరు. అంతేకాక పిల్లలకు యూనిఫాంలు కాదు కదా సరైన బట్టలే లేని దుస్థితి. మాసిన జుట్టు.. మాసికల దుస్తులతోనే తచ్చాడుతుంటారు.

నిజానికి చెంచులకు సంప్రదాయ విద్య అర్థకాని విషయమే. వారి జీవనపథంలో ఉపయోగపడేవే వారికి అసలైన విద్యలనుకుంటారు.అందుకే .. పుస్తకాల చదువు కాదు.. తమ పిల్లల్లోని హిడెన్ ట్యాలెంట్ కే మెరుగులు దిద్దాలంటున్నారు. చెంచులు చాలా వేగంగా పరిగెత్తగలరు, విల్లు బాణాల షూటింగ్, అథ్లెటిక్స్ లాంటి విద్యల్లో ఆరితేరి ఉంటారు. అందుకే వారికి రెగ్యూలర్ పాఠశాలల్లో కాకుండా స్పోర్ట్స్ స్కూళ్లలో చేర్పించాలని కోరుతున్నారు. పోనీ ట్రెడిషనల్ చదువులే చెప్పాలనుకుంటే ఇక్కడి యువతలో చదువుకున్న వారిని టీచర్లుగా నియమించాలని కోరుతున్నారు.

ఇక వీరికి ప్రకృతి పరంగా సిద్ధించిన రోగనిరోధక శక్తే బలం.ఐనా.. పౌష్టికాహారలోపంతో రక్తహీనత సమస్య వీరిలో ఎక్కువ.మలేరియా,క్షయ,డయేరియా, వైరల్ ఫీవర్లు, చర్మవ్యాధులు కూడా వెంటాడుతుంటాయి. చెంతనే కృష్ణానది పారుతున్నా.. నేటికీ చెలమలే చెంచుల దాహార్తిని తీరుస్తున్నాయి. ఇక్కడి మహిళలకు కుటుంబ నియంత్రనపై అవగాహన లేదు. ఒక్కో ఇంట్లో ఐదు నుంచి 8 మంది పిల్లలను కంటున్నారు.ఇది మహిళల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది.చెంచుల ఆరోగ్యంపై ప్రభుత్వాలకు శ్రద్ధ లేదు.పెంటలన్నిటికి అందుబాటులో ఉండేలా అప్పాపూన్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. దీంతో అనారోగ్యం వస్తే అడవిలో తీవ్ర ఇబ్బందులు పడాలి లేదా.. మున్ననూర్ దాకా వెళ్లి చికిత్స చేయించుకోవాలి. లేదా అడవిలోనే చావుకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి చెంచులది.

2018లో తెలంగాణా ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా 300 గ్రామ జనాభాతో చెంచు పెటంలను గ్రామపంచాయతీలను చేసింది. దీంతో తమ సమస్యలను స్వయంపాలనతో పరిష్కరించుకోవచ్చని భావించారు. ఎందరో చెంచు యువకులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటిచేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మెత్తం 12 మంది చెంచు సర్పంచులు ఎన్నికయ్యారు. అయితే ఎంతో ఆశతో తమ జాతి అభివృద్దికోసం కృషి చేయాలన్న వారి సంకల్పాన్ని..అధికారులు, ప్రజాప్రతినిధులు అడియాసలు చేశారు.

షెడ్యూల్ ప్రాతంలోని గిరిజన గ్రామ పంచాయతీలకు సంబంధించి పెసా చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం గిరిజన ప్రాంతంలోని గ్రామసభలో తీసుకున్న తీర్మానం.. పార్లమెంట్ చట్టం తో సమానం. కానీ దీన్ని ఆచరణలో అమలుచేయడంలేదు. మల్లిఖార్జున్ అనే వ్యక్తి సార్లపల్లి గ్రామసర్పంచ్ గా ఎన్నికైన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం గ్రామసభ పెట్టి అనేక తీర్మానాలు చేసుకున్నారు. 3ఏళ్లపాటు తీర్మానం పత్రాలకు, దరఖాస్తులు జతచేసి.. కలెక్టర్, ఎమ్మెల్యే, ఆర్డీవో, జడ్పీటీసి తోసహ కలవని నాయకుడు లేడు. తిరగని కార్యాలయం లేదు. కానీ.. ఒక్క పనికూడా కాలేదు. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో.. తమ రాజీనామాను గవర్నర్ కి ఇచ్చి నిరసన తెలిపారు. తమను 5వ షెడ్యుల్ చేర్చినప్పటికి.. తమకంటూ ఏ విధమైన హక్కులు లేవని వాపోతున్నారు. తమను అణుక్షణం ఆంక్షల చట్రంలో బంధించి పరిస్థితులను ప్రభుత్వం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటు అటవి అధికారులు కూడా చెంచులను ఆంక్షల పేరుతో అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారు. కోర్ జోన్, టైగర్ రిజర్వ్ పేరుతో శాశ్వత నివాసాలు కట్టుకోకుండా చేస్తున్నారు. మరి అటవీ అధికారులు మాత్రం బేస్ క్యాంపులు ఎందుకు కట్టుకుంటున్నారని చెంచులు ప్రశ్నిస్తున్నారు. అటు అధికారులు ఇటు ప్రభుత్వం.. తమను అడవి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెంచులు ఆరోపిస్తున్నారు. అందుకే యురేనియం ప్రాజెక్టు , మైనింగ్ ప్రాజెక్టు, టైగర్ రిజర్వ్ పేర్లతో మైదాన ప్రాంతాలకు తమను తరిమేయాలని చూస్తున్నారని ఇక్కడి చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయినా అడవినిమాత్రం వీడేది లేదంటున్నారు.

నల్లమల చెంచుల ఆక్రంధన యధార్థమే. నల్లమల అడవినే నమ్ముకుని.. అక్కడే జీవిస్తున్న చెంచులకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ- NTCA ఉత్తర్వు శరాఘాతమైంది.నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల ఆవాసాలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ కూడా ఇదే.నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్-NSTR విస్తీర్ణం 3,728 చదరపు కిలోమీటర్లు.నల్లమల అడవిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఎన్‌టీసీఏ ప్రకటించింది.ఈ సాకుతో చెంచులను మైదాన ప్రాంతాలకు తరిమివేసే ఆలోచన దీని వెనుక ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి.తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.అటవీ హక్కుల చట్టాన్ని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గౌరవించడం లేదని, తమ హక్కుల కోసం చెంచులు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నారని రాష్ట్ర విభజనపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిషన్‌కు ఉద్యమకారులు నివేదించారు.

మైదాన ప్రాంతాలకు తరలేందుకు చెంచులు ఎన్నడూ సంసిద్ధంగా లేరు. ఈ దిశగా గతంలో పలుసార్లు జరిగిన ప్రయత్నాలను స్వచ్ఛంద సంస్థలు, చెంచులు గట్టిగా అడ్డుకున్నారు. 1980లలో తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం, 2010లో వజ్రాల అన్వేషణ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం నిల్వల కోసం ఇటీవల ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్- AMD అన్వేషణ, 2018 నుంచీ నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం నిక్షేపాల కోసం వేట.. ఇలా ప్రతి సందర్భంలోనూ చెంచుల్లో భయాందోళనలు వ్యక్తమవుతూనే వచ్చాయి. ఉన్న ఊరును,నమ్ముకున్న అడవి తల్లిని వదిలి వెళ్లాలనే భయం .. వారిని పోరుబాట పట్టిస్తోంది.

నల్లమలలో చెంచుల పోరాటం ఒడవని ముచ్చటగానే మారుతోంది. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం 19 సెప్టెంబర్ 2019న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. నల్లమలలోనే కాదు, తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా యురేనియం తవ్వకాలకు,సర్వేలకు అనుమతులు ఇవ్వబోమని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. కేంద్రం అలాంటి ప్రయత్నం చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కానీ.. ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ జెట్ విమానం నల్లమల అటవీ ప్రాంతంలో తిరుగుతూ సర్వే చేసింది.ఈ అంశం పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది. యురేనియం తవ్వకాలు జరపబోతున్నారా? అని ఏపీ ఎంపీ ఒకరు ప్రశ్నించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడం లేదని కేంద్రం బదులిచ్చింది.ఐనా .. తమ వెనక ఏదో గూడుపుఠాణీ జరుగుతున్నదన్న ఆందోళన చెంచుల్లో పెరిగింది.

నల్లమల ప్రాంతమంతా ఐదో షెడ్యూల్ కిందకు వస్తుంది. అంటే.. ఆ ప్రాంతంలో నివసించే గిరిజనులకు కూడా భూబదలాయింపు హక్కులు ఉండవన్నమాట. అలాగే 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పంచాయతీరాజ్ చట్టం నుంచి కూడా చెంచుల హక్కులకు రక్షణ లభిస్తోంది.కాగా కేంద్రం తాజాగా ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్-2022ను నోటిఫై చేసింది.ఈ నిబంధనల మేరకు అటవీభూమి బదలాయింపునకు సంబంధించి ప్రతిపాదనల పరిశీలనకు ప్రతి రాష్ట్రంలో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటవుతుంది. నాన్-మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ప్రతిపాదనలను 60 రోజుల్లోగా సమీక్షించాలి.పెద్దమొత్తంలో భూమి అవసరమైన ప్రాజెక్టుల పరిశీలనకు 75 రోజులు, 100 హెక్టార్ల అటవీభూమి అవసరమైన నాన్-మైనింగ్ ప్రాజెక్టులకు 120 రోజులు,మైనింగ్ ప్రాజెక్టులు అయితే 150 రోజుల్లో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి. అలాగే సలహా కమిటీ, ప్రాంతీయ సాధికారత కమిటీల ఏర్పాటుకు తాజా నిబంధనలు అనుమతిస్తున్నాయి.అంటే.. పార్లమెంట్ చట్టంతో సమానమైన చెంచుల గ్రామసభను ప్రభుత్వాలు బైపాస్ చేసేందుకు రంగం చేస్తున్నాయి.చెంచులకు సంబంధం లేకుండానే అడవి తల్లి గుండెల్లో కార్పొరోట్ గునపాలు దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. అడవినే నమ్ముకొని బతుకుతున్న నచెంచు గూడేలపై గన్ పాయంట్ గురిపెట్టాయి. ప్రశాంత నల్లమలలో చెంచుల బతుకులను ఆగం చేయనున్నాయి. ఇదే చెంచు గూడాల్లో భయాందోళనలు రేపుతోంది.

దేశం స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ.. తమ అడవిలో తమను పరాయీకరించే కుట్రలపై చెంచుబిడ్డలు మండిపడుతున్నారు. మాకు అభివృద్ధి అక్కర్లేదు.. మాలా మమ్మల్ని బతకనీయండి చాలంటున్నారు. కాదని ప్రొక్లెయినర్లు నల్లమల మీదికి వస్తే.. ప్రాణాలు పణంగా పెట్టైనా అడవితల్లిని కాపాడుకుంటామంటున్నారు ఇక్కడి చెంచులు.

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×