EPAPER

ఇంత దుర్మార్గమా?.. నోటీసుల్లేకుండా కూల్చివేతలా?

ఇంత దుర్మార్గమా?.. నోటీసుల్లేకుండా కూల్చివేతలా?

– బుల్డోజర్ రాజ్యం తెచ్చారు
– అంధులనీ చూడకుండా చర్యలా?
– మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్


హైదరాబాద్, స్వేచ్ఛ: పెద్దలు ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూలదోస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి మహబూబ్ నగర్‌లోని అంధుల కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి అంధుల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. తమ సామాన్లు సర్దుకునేవరకు ఆగమని కాళ్లు పట్టుకుని మరీ అంధులు వేడుకున్నా.. పట్టించుకోకుండా వాళ్ల ఇళ్లు నేలమట్టం చేసి వారందరినీ రోడ్డున పడేశారని మండిపడ్డారు.

నోటీసులేవీ?
2007లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూముల్లో అంధులు ఇళ్లు నిర్మించుకున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కాలనీకి మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సదుపాయం అందించిందని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. నాలుగేళ్ల పాటు తమ వికలాంగ పించన్ డబ్బులతో అక్కడి అంధులు చిట్టీలు వేసుకుని రేకుల ఇళ్లు నిర్మించుకున్నారని, ఎలాంటి నోటీసులు లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఏళ్ల కష్టాన్ని ఒక్క గంటలో నేలపాలు చేసిందని ఫైర్ అయ్యారు. అంధుల కాలనీలో చెరువు కానీ.. కుంట కానీ లేదని.. అది కోట్లు విలువ చేసే భూమి కూడా కాదన్నారు. బడాబాబులకు 30 రోజుల సంజాయిషి నోటిస్‌లు ఇస్తున్నారని అంధులకు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు.


ఇదేనా మీ నీతి?
కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారిని ఒక లాగా.. ధనవంతులను మరోలా చూస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ సాధించుకున్నది.. బలహీన వర్గాలపై దాడుల కోసమా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేదల కోసం ఎన్ని ఇళ్లు కట్టిందో తెలియదు కానీ.. పేదలు కట్టుకున్న ఇండ్లను మాత్రం కూల్చివేస్తోందని అన్నారు. కూల్చివేసిన ఇళ్ల స్థానంలో ప్రభుత్వం తక్షణమే సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గంపై న్యాయస్థానాలు స్పందించి, దీనిని సుమోటోగా స్వీకరించి.. విచారణ జరపాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఆనాడు పట్టాలు ఇచ్చిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: Kondakal: ఫేక్ మనుషులు-ఫోర్జరీలు.. 50 ఎకరాలు కొట్టేసిన ఉదయ్ కుమార్ రెడ్డి

ఇదీ జరిగింది..
మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఆదర్శ నగర్ సర్వే నంబర్‌ 523 ఆదర్శనగర్‌లో దళారులు నకిలీ పట్టాలు సృష్టించి 75 నుంచి 100 గజాల చొప్పున విక్రయించారన్న ఫిర్యాదులున్నాయి. కాగా, వీటిపై ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెండున్నర గంటల వ్యవధిలో 70 ఇళ్లను నేలమట్టం చేశారు. కొన్నిటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా, ఇంకొన్నింటి పునాదులను తొలగించారు. ఆదర్శనగర్‌లో అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలు ఇది నాలుగోసారి. తమకు పట్టాలున్నాయని, పన్ను చెల్లిస్తున్నామని, నోటీసులు లేకుండా ఎలా కూల్చివేస్తారని బాధితులు ప్రశ్నించారు.

ఇది ప్రతీకార పాలన
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా అందరికీ ఒకే న్యాయం పాటించటం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పాలమూరులోని కూల్చివేతలపై ఆయన మాట్లాడుతూ.. పేదల పైన వెంటనే యాక్షన్ తీసుకుంటున్న హైడ్రా.. దుర్గం చెరువులోని సీఎం సోదరుడి ఇంటి విషయంలో మాత్రం నోటీసులకే పరిమితం కావటంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. పాలమూరు ఇళ్ల శిథిలాల్లో యూనిఫామ్ వేసుకున్న ఒక అమ్మాయి తన బుక్స్ వెతుక్కుంటోన్న దృశ్యం చూసి తనకు ఏడుపు వచ్చిందని, మరి.. ఇంత దుర్మార్గం జరిగితే సీఎంకి ఎలా నిద్రపడుతోంది? అని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదని, ప్రతీకార పాలన అని మండిపడ్డారు.

గురుకులాలు నిర్వీర్యం..
బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 9 నెలలుగా విద్యాశాఖకు మంత్రి లేరని విమర్శించారు. ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం ఒక్కసారీ సమీక్ష చేయలేదని, చలికాలం వస్తున్నా.. ఇంకా రగ్గులు అందించలేదని, విద్యార్థులకు ఇంకా బూట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. చాలా కాలేజీల యాజమాన్యాలు ఫీజులు కట్టడం లేదనే కారణంగా మెమోలు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని, గురుకులాల్లోని పెట్టిన సెంటర్ ఆఫ్ ఎక్ససెలెన్సులను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గురుకులాల్లో అన్ని వర్గాల విద్యార్థులు విద్యను పొందుతున్నారని, అక్కడి భోజన ఏర్పాట్ల బాధ్యతను ధార్మక సంస్థ అయిన అక్షయ పాత్రకు ఇవ్వటం సరికాదన్నారు. బ్రహ్మ కుమారి, అక్షయ పాత్ర సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు ఏమిటని మండిపడ్డారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×