CM Revanth Reddy: పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌లు ఈ లేఖ రాశారు. విద్యారంగ ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారు చర్చించారు. ఇది వరకు కాంగ్రెస్ ప్రకటించిన విధానాలు, హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, విస్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గత బీఆర్ఎష్ ప్రభుత్వమే 10468 పండిత, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు అన్ని అనుమతులు ఇచ్చిందని, ఇప్పుడు సీఎం నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొనేవారిలో మెజార్టీగా వీరే ఉన్నారని గమనించాల్సిందిగా సూచిస్తున్నామని వారు బహిరంగ లేఖలో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కాళేశ్వరం జోన్ 1లో తమ ప్రభుత్వమే 1050 గెజిటెడ్ ప్రధానోపాధ్య ప్రమోషన్లను ఇచ్చిందని వివరించారు. తమ ప్రభుత్వం 10000 ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికీ పాఠశాలలకు కేటాయించలేదని విమర్శించారు.
Also Read: ఇదేమైనా సినిమా షూటింగ్ హా.. హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు ఫైర్
కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా గొప్పగా పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారో విస్పష్టంగా ప్రకటించాలని, వారి మేనిఫెస్టోలో పొందుపరిచిన పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను ఎప్పుడు అనుమతిస్తారో కూడా సభలో ప్రకటిస్తే సంతోషమని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఓల్డ్ పెన్షన్ స్కీం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలకు స్కావెంజర్స్ అనుమతిస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, మధ్యాహ్నం భోజన పథకం వర్కర్లకు వారి మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాల రీత్యా విద్యార్థులకు ఉదయం పూట ఉపాహారాన్ని అందించే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్టు వారు లేఖలో పేర్కొన్నారు.