EPAPER

ETHANOL: రాకాసి కంపెనీపై రైతు లడాయి.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..?

ETHANOL: రాకాసి కంపెనీపై రైతు లడాయి.. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..?

ETHANOL: ఒకప్పుడు కరువు కోరల్లో విలవిలలాడిన ఆ పల్లెలు నేడు ఊరకుంట,పెద్దవంపు, గైనికుంట, మన్నెవాగు లాంటి జలసిరితో పచ్చదనాన్ని నింపుకున్నాయి. రెండుకార్ల పంటలు, పశుసంపదతో ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయి. ఇక మంచిరోజులు వచ్చాయి ఉన్న ఊర్లో సొంత చేనుచెలకల్లో హాయిగా బతికేయొచ్చన్న నమ్మకం దశాబ్దంపాటు ఆనందాలు పంచింది. సంతోషాలు వెల్లివిరిసిన ఆ పల్లెల్లు, ప్రజలు ఇప్పడు భయం నీడలో బిక్కుబిక్కుమంటున్నారు. కనిపించని ఉపద్రవం కమ్మేస్తుందన్న ఆందోళనతో వణికిపోతున్నారు. తమ దాహార్తిని తీర్చే జలవనరుల గొంతులు తెగిపడనున్నాయని తమ బతుకులే విచ్చిన్నమవుతున్నాయని మండిపడుతున్నారు. తమ ఊరిని, జీవితాలను చెరబట్టేందుకు కోరలు చాస్తున్న కంపెనీ రక్కసిపై రైతులు అలుపెరగని లడాయి చేస్తున్నారు. ఆ విషయాలను బిగ్ టీవీ జనతా గ్యారేజ్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.


ఇది ఒక గ్రామానిదో లేక.. కొన్ని గ్రామాల వ్యథనో కాదు.. కృష్ణానది ప్రరివాహక ప్రాంతంలోని లక్షలాది మంది భవిష్యత్ ను కబళించే కంపెనీ కుతంత్రం. వలసబతుకు గోస పోయి.. ఇప్పుడిప్పుడే సొంతూర్లలో స్థిరజీవనం ఏర్పరుచుకుంటన్న వారి ఆశలపై గొడ్డలపెట్టులా మారుతోంది.జడలు విప్పుకుంటున్న కంపెనీ భూతంపై సమరభేరి మోగించారు చుట్టుపక్కల గ్రామాల రైతులు. హలాలు పట్టిన చేతులన్నీ పిడికిలా బిగించి..ఏడాది కాలంగా ఐక్యపోరాటం చేస్తున్నారు. గ్రామగ్రామాన టెంటులేసుకొని మరీ అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీలిమిటేషన్ తర్వాత ఐదు జిల్లాలు ఏర్పడ్డాయి.ఇందులో వనపర్తి,నారాయణ్ పేట జిల్లాల మధ్య ఉన్న చిత్తనూర్ గ్రామం ఇది. మరికల్ మండల పరిధిలో ఉన్న ఈ గ్రామ రెవెన్యూ శివార్లలో.. కొందరు పారిశ్రామికవేత్తలు కంపెనీని షురూ చేశారు. జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ యాండ్ ఇండస్ట్రీస్ పేరుతో.. 430 ఎకరాల విస్తీర్ణంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటవుతోంది.రోజుకు 600 కిలోలీటర్ల సామర్ధ్యంతో ఇథనాల్ పరిశ్రమతోపాటుగా.. 15 మెగావాట్ల బయోమాస్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు గాను పనులను శరవేగంగా జరుగుతున్నాయి. కంపెనీ యజమాన్యం.. దాదాపు రూ.2వేల కోట్లు పెట్టుబడిగా పెడుతోంది. ఇది జీరో వేస్ట్ కంపెనీ అని.. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అంతేకాదు.. ఈ ప్రాంతలో పండిన పంటనంతా మంచిధరకు తామే కొని.. ఇథనాల్ తయారుచేస్తామని భరోసానిస్తోంది. వినడానికి ఇదంతా మంచి ఆఫర్ గానే కనిపిస్తున్నా.. ఇందులో అసలు కుట్రలు వేరే ఉన్నాయంటున్నారు ఆ గ్రామాల రైతులు. ఇంతకీ కంపెనీ చెబుతున్నది నిజమేనా? కంపెనీ దాచిపెడుతున్న అసలు సంగతులేంటి?


2013వ సంవత్పరం వరకు ఈ ప్రాంతంలో తీవ్ర కరువు, కాటకాలు ఉండేవి. పంటపొలాలకు వానాకాలమే దిక్కు. దీంతో ఇక్కడి జనం బతుకుదెరువు కోసం దేశంలో పలుప్రాంతాలకు వలసపోయేవారు. అక్కడ కూలీనాలీ చేసి.. ఇక్కడ కుటుంబాలను పోషించుకునేవారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం ఈ ప్రాంతానికి వరంగా మారింది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు 2 టీఎంసీల నీటితో.. మహాబూబ్ నగర్ కు తాగునీరు, చుట్టుపక్కల ప్రాంతాలకు సాగు నీరందేలా దీన్ని చేపట్టారు. దీంతో కొయిల్ సాగర్ గుండా వెళ్లే నీటిని స్థానిక చెరువులు, కుంటల్లో నింపుకునే అవకాశం దొరికింది. ఇది ఇక్కడి రైతులకు అవకాశంగా మారింది. వలసపోయిన వాళ్లంతా తిరిగి వచ్చారు. ఏడాదికి రెండు నుంచి మూడు పంటలు పండించుకుంటున్నారు. నల్ల బంగారంలాంటి రేగడి పొలాలకు నీటివసతి సంవృద్ధిగా అందటంతో..పదేళ్లుగా పైరుపంటలతో సుఖంగా బతుకుతున్నారు.ఈ చిత్తనూర్ ప్రాంతంలోనే ఎకరాకు 80 బస్తాల ధాన్యం పండించి.. ఉమ్మడి పాలమూరులోనే రికార్డు సాధించారు. అంతగా వరిపంట సిరులు పూసింది.పాడి,పంట పుష్కలంగా ఉండటంతో.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పనుల కోసం ఇక్కడి వస్తుంటారు. అంతగా ఇక్కడి జీవన చిత్రం మారిపోయింది.

ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న మరికల్ మండలంపై.. కార్పొరేట్ రాబంధుల దిష్టికళ్లు పడ్డాయి.కోయిల్ సాగర్ లో నీళ్లు.. ఇబ్బండిముబ్బడిగా పండుతున్న వరిపంట..రెండింటిని కబళించేలా కుట్రలు మొదలయ్యాయి.ఇథనాల్ కంపెనీగా రూపుదిద్దుకున్నది.కరువునాళ్లలో పొలాలు అమ్ముకున్న రైతుల నుంచి..జనార్ధన్ రావ్ అనే ఆంధ్రాప్రాంత వ్యక్తికి భూములు చేరాయి.ఆయన నుంచి మొత్తం 430 ఎకరాల భూములను.. 2021లో ఇథనాల్ కంపెనీ యాజమాన్యం ఖరీదు చేసింది.ఇక్కడి నుంచే ఇథనాల్ కంపెనీ డ్రామాలు మొదలయ్యాయి. స్థానికులను నమ్మించేందుకు.. నేరేడు తోటలను పెంచుతున్నామని నమ్మబలికింది. పండ్ల గుజ్జుతో షుగర్ పేషంట్లకు మందు తయారు చేస్తామని ఊదరగొట్టింది. కొన్ని ఎకరాల్లో నేరేడు తోటలను వేసింది. పండ్లతోటలే కదా అని జనం సరేనన్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అసలు గుట్టు బైటపడింది.పెట్టేది నేరేడు గుజ్జు ఫ్యాక్టరీ కాదు.. ఇథనాల్ ఫ్యాక్టరీ అని పరిసర ప్రాంత గ్రామస్థులకు తెలిసిపోయింది. దీంతో.. అసలు ఇథనాల్ అంటే ఏంటి? దాంతో ఏం చేస్తారు? ఇథనాల్ వల్ల వచ్చే కాలుష్యం సంగతేంటి? తెలుసుకునేందుకు.. గ్రామాల్లోని యువత, పర్యావరణ వేత్తలను సంప్రదించారు. ప్రపంచంలో చాలాచోట్ల, అలాగే మనదేశంలో కొన్నిచోట్ల ఇథనాల్ కంపెనీల వల్ల తీవ్ర నష్టంజరిగింది. ఈ కంపెనీల వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతోపాటు , కృష్ణానదికి, యావత్ తెలంగాణాకే ప్రమాదం వాటిల్లనుందని తెలుసుకున్నారు. కంపెనీ ఏర్పాటైతే గాలి, తాగు, సాగునీరు అన్నీ కలుషితమైపోనుండటంతో పోరుబాట పట్టారు. ప్రజాందోళలకు పిలుపునిచ్చారు. అలా సంఘటిత పోరాటం సాగిస్తున్నారు.

ఇక కంపెనీ ఏర్పాటులో అనేక అక్రమాలకు పాల్పడింది యాజమాన్యం. ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి.కాలుష్య ప్రభావంపై పొల్యూషన్ కంట్రోల్బోర్డు (పీసీబీ) అంచనా వేయాలి. ప్రజాభిప్రాయాలు రికార్డ్ చేసి కంపెనీకి అనుమతులు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి.కానీ ఫ్యాక్టరీ స్థలానికి పక్కనే ఉన్న చిత్తనూరులో పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండానే పర్మిషన్ ఇచ్చేశారు. ప్రజలు కంపెనీ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారంటూ కేంద్రానికి తప్పుడు రిపోర్టులు పంపి అనుమతులు తెచ్చుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదంతా మంత్రి, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరిగిందని జనం ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంగా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేలు,ఎంపి, మంత్రుల వరకు అందరినీ కలిసినా… ఒక్కరూ స్పందించలేదన్నారు. పైపెచ్చు కంపెనీ యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కంపెనీలో వాళ్లు కూడా వాటాదారులు కాబట్టే.. తమకు న్యాయం జరగడంలేదని వాపోతున్నారు.

మనం నిత్యం తినే బియ్యం,గోధుమలు,మొక్కజొన్న, చెరుకు తదితర ఆహార పదార్ధాలతో ఇథనాల్ తయారుచేస్తారు.పెట్రోల్లో కలిపే ఇథనాల్ కు ఇటీవల డిమాండ్ పెరిగిపోయింది. దీంతో.. కంపెనీలో ముఖ్య భాగస్వాములైన మేడ్చల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే,వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్మా కంపెనీ యజమాని.. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారు. ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా.. 2022 జనవరిలో టీఎస్ఐఐసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఒక లీటర్ ఇథనాల్ తయారీకి 5 లీటర్ల నీళ్లు, రెండు కిలోల బియ్యం, కేజీన్నర మక్కలు అవసరం.ఈ ఫ్యాక్టరీ ద్వారా రోజుకు 6 లక్షల లీటర్ల ఇథనాల్ తయారు చేయనుండగా, 30 లక్షల లీటర్ల నీళ్లు అవసరం. ఎన్ని బోర్లు వేసినా ఇంత భారీ మొత్తంలో నీళ్లు అందడం కష్టం. దీంతో ఫ్యాక్టరీ స్థలానికి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్న జూరాల – కోయిల్ సాగర్ కెనాల్ పై ఫ్యాక్టరీ యజమానులు కన్నేశారు. ఆ కాల్వకు గండికొట్టి పైపులైన్ వేసుకోవాలని ప్లాన్ వేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇందుకు సహకరించారు.కెనాల్నీటిని ఫ్యాక్టరీకి మళ్లించేందుకు అనుమతించాలని ఇరిగేషన్ ఆఫీసర్లపై ఒత్తిడితెచ్చారు. వాళ్లు రూల్స్ ఒప్పుకోవని చెప్పడంతో పైస్థాయిలో చక్రం తిప్పారు. కేవలం సాగు, తాగు అవసరాలకు మాత్రమే వాడాల్సిన ఈ కెనాల్ నుంచి 0.9 టీఎంసీలను ఫ్యాక్టరీకి తరలించేలా సర్కారుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మేరకు ఇటీవలే కెనాల్నుంచి ఫ్యాక్టరీ వరకు 500 మీటర్ల పొడువునా పైపులైన్ పనులు కూడా ప్రారంభించారు. కందకం తవ్వుతుండగా రైతులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది.

ఇక చిత్తనూరు ఫ్యాక్టరీలో ఇథనాల్ తయారీకి గానూ.. 1650 టన్నుల ఆహర ధాన్యాలు 30 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది.ఇథనాల్ తోపాటు 400 టన్నుల కుడితి లాంటి చిక్కటి వ్యర్ధం, కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. అయితే ఈ కాలుష్యకారకాన్ని బైటికి పోకుండా చేసి గట్టిపరిచి.. కూల్ డ్రింక్ కంపెనీలకు అమ్ముతామని కంపెనీ చెప్తున్నది. అది వాస్తవ దూరం. ఎందుకంటే వ్యర్ధజలాన్ని గడ్డ కట్టించి, వాయుపదార్ధాలను గాలిలోకి పోకుండా చేయడం అనేది అంత ఈజీ కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్. దీంతో.. ఇదంతా గ్రామస్తులను మభ్యపెట్టే చర్యే తప్పమరొకటి కాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. కంపెనీ ఆవరనలో పెద్దపెద్ద చెరువుల లాంటి గుంతలు తవ్వారు. దీంతో.. ఇక్కడే కంపెనీ వేస్ట్ ని డంప్ చేస్తారని జనం అనుమానిస్తున్నారు. ఇదే జరిగితే.. తమ ప్రాంతంలో భూగర్భ జలాలు అంతా కలుషితమవుతాయని ఆందోళనచెందుతున్నారు. కంపెనీ నుంచి వెలువడే విషవాయువులకు చిత్తనూర్ పరిసరాల్లోని 9 గ్రామాలతోపాటు.. ఉమ్మడి జిల్లాలోని 54 గ్రామాలు అల్లాడాల్సిందే. దీంతో.. రైతులంతా పోరుబాటపట్టి.. అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. తమ ప్రాంతానికి పరోక్షంగా ఇర గ్రామాలకు రాబోయే అపదను వివరిస్తున్నారు.

కరువు ప్రాభావిత ప్రాంతాల్లో పెట్టాల్సిన ఇథనాల్ కంపెనీని.. పచ్చటి పొలాల మధ్య పెట్టేందుకు అనేక అడ్డదారులు తొక్కారు యజమానులు. అనుమతుల కోసం అన్ని అబద్ధాలే చెప్పారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లో సాగుయోగ్యమైన భూములు లేనేలేవట. అక్కడ ప్రజలు నివసించే గ్రామాలే లేవట. వాగులు, సహజ వసరులు, వన్యప్రాణులు లేని కరువు ప్రాంతమట. ఇంతకంటే దుర్మార్గమేముంటుంది? అంతేకాదు.. భూకబ్జాలకు కూడా పాల్పడ్డారు.నక్షబాటలను మార్చివేశారు. కొంత అసైండ్ భూమిని సైతం కంపెనీ హద్దుల్లో కలిపేసుకున్నారు. ప్రభుత్వం నుండి 0.0309 టీఎంసీ నీటి వినియోగానికి అనుమతి ఉంటే.. వీరు మాత్రం జూరాల రివర్ బ్యాంక్ నుండి కోయిల్ సాగర్ కి వచ్చే 2 టీఎంసీలతో.. ఏకంగా 1 టీఎంసీ నీటిని వాడుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కోయిల్ సాగర్ కాలువ పక్కనే ఉన్న రైతుల పైప్ లైన్స్ ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత కంపెనీ కోసం భారీ పైపులైన్స్ వేసుకున్నారు.ఇంతే కాకుండా.. వర్షాకాలంలో వరదను తీసుకువచ్చే వాగులకు అడ్డుకట్టవేసి.. కంపెనీకి మళ్లించేలా పెద్ద సిమెంటు కాలువలు నిర్మించుకున్నారు. దీంతో రాబోయే రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల వాగులు, చెరువుల్లో వాన నీరు రాదు.ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్ధజలమే పారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తనూరులో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఏడాదికాలంగా పోరాటం చేస్తున్నారు.ఐనా.. సర్కారు ఒంటిపై పైనుబారట్లేదు. ఏ నాయకుడూ వీరి గోడు విన్న పాపాన పోవడంలేదు.పైగా కంపెనీకి దళారుల్లా వ్యవహరిస్తున్నారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి.. చుట్టుపక్కన ఉన్న ప్రతి గ్రామాభివృద్ధికి కోటిరూపాయల చొప్పున ఇప్పిస్తామంటూ ఆశ జూపుతున్నారు.ఊరికి కొన్ని ఉద్యోగాలు సైతం ఇప్పిస్తామని ట్రాప్ చేస్తున్నారు.ఐతే.. ఊర్లే పాడైపోతుంటే మీ ఉద్యోగాలెవరికోసమంటూ జనం తిరగబడ్డారు. సీజన్ లో తామే వేరే ప్రాంతాలకు చెందిన 2000 మంది పని ఇస్తున్నామని.. మాకు మీ ఉద్యోగాల బిచ్చం అక్కర్లేదు పొమ్మని తరిమికొట్టారు.

ప్రజలంతా ముక్తకంఠంతో ఎదురుతిరగడంతో.. కంపెనీ యాజమాన్యం జులుంచేస్తున్నది. ప్రజల నిరసనలపై పోలీసులు అనేకసార్లు విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీచార్జి చేశారు. దౌర్జన్యానికి వ్యతిరేకంగా రైతులు పోరాటాన్ని మరింత ముమ్మరం చేశారు.ప్రాణంపోయినా.. పర్యావరణాన్ని పాడుచేసే రాకాసి ఫ్యాక్టరీని రానిచ్చేదే లేదంటున్నారు. ఎన్జీటీలో కూడా వేసు వేశారు. దానిపై విచారణ జరుగుతున్నది. నిజానికి జలవసరులకు, సాగునీటి ప్రాజెక్టు,కెనాల్ లకు దగ్గరగా ఎటువంటి రసాయన కంపెనీలు పెట్టొద్దని చట్టం స్పష్టంగా ఉంది. కానీ .. కనుచూపుమేరలో అంత పెద్ద జూరాల, కోయిల్ సాగర్ కాలువ కనిపిస్తుంటే.. ఇక్కడి అధికారులు కళ్లున్న గుడ్డివారిలా అద్భుతంగా నటించారు. కంపెనీకి అక్రమంగా అనుమతులు కట్టబెట్టారు. దీన్నే ప్రశ్నిస్తున్నారు.. ఇక్కడి రైతులు .

కంపెనీ లో ప్రధాన పార్ట్ నర్స్ ఐన మేడ్చల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్.జగన్ కుటుంబానికి సన్నిహితులైన ఫార్మా కంపెనీ యజమానిపై.. మరికెల్ మండలం రైతులు మండిపడుతున్నారు. న్యాయం కోసం.. తమ ఊర్లకోసం, పర్యావరణం కోసం పోరాడుతున్న తమపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనుచరులను ఉసిగొలిపి.. తమ టెంటును, బ్యానర్స్ ని చించివేశారని.. చెప్పుకోని విధంగా దుర్భాషలాడుతూ దాడులు చేశారంటున్నారు. ఐక్యరైతుల పోరాటాన్ని చీల్చేందుకు కూడా అనేక కుట్రలు చేశారని.. వారికి అధికారులు, ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు.

శిలాజ ఇంధనాలవినియోగం విచ్చలవిడిగా పెరిగి.. పర్యావరణం విధ్వంసమవుతోంది. దీంతో పలుదేశాలు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టిసారించాయి.పెట్రోల్, డిజిల్ లో కలిపి వినియోగించే జీవఇంధనంగా.. ఇథనాల్ ప్రాముఖ్యత పెరిగింది. మనదేశంలో పదేళ్లక్రితం వాహన ఇందనంలో లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కు.. 1 శాతం లోపే ఇథనాల్ కలిపేవారు. 2019 నాటికి అది 5.8 శాతానికి చేరుకుంది. దీన్ని మరింత పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 400 కోట్ల లీటర్ల ఉత్పత్తవుతున్నది. ఇది మరింత పెంచాలని అన్ని రాష్ట్రాల్లో కంపెనీల ఏర్పాటుకు లెక్కాపత్రం లేకుండా అనుమతులు ఇచ్చింది. 2023 ఏప్రిల్ 1 నుండి లీటర్ కి 20 శాతం ఇథనాల్ వాడాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకుగాను 1016 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి జరగాలి.

ఇథనాల్ వాడకం రోజురోజుకు పెంచితే దాని వల్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గించవచ్చు. విదేవిమారక ద్రవ్యం మిగులుతుంది. గోడౌన్ లలో ముక్కిపోయే బియ్యం, గోధుమలను ఇథనాల్ కి ఉపయోగించవచ్చు.భారీగా పెరిగిన వరిసాగు వినియోగానికి ఇదో మార్గం. ఇవే మాటలను కేంద్రం, కంపెనీ చెబుతున్నాయి. కానీ పర్యవరణ వేత్తలు మాత్రం దీన్ని తప్పుబడుతున్నారు. అనవసర వాహనాల వినియోగాన్ని అరికట్టడం.. పర్యావరణ హితకారి విధానాలు తీసుకురావడం లాంటివాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టకుండా.. ఇథనాల్ వినియోగం లాంటి పర్యావరణానికి ప్రమాదకర విధానాలు అవలంభించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయిల్ లేకున్నా బతకగలం..మరి తిండి లేకుంటే బతక గలమా అని నిలదీస్తున్నారు.

మహబూబ్ నగర్ లాంటి ప్రాంతం కరువు నుండి తేరుకొని.. ఇప్పుడే కోలుకుంటున్నది. ఇలాంటి చోట ప్రజల బతుకులు ఆగం చేసే చర్యలేంటని పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందంటున్నారు. బి.వోడి తగ్గి ఆ చెరువుల్లో జలచరాలు బతకలేవు. కంపెనీల నుండి వెలువడే వాయుకాలుష్యం.. మనుష్యుల ఆరోగ్యాలకు గొడ్డలిపెట్టు అవుతుందంటున్నారు.

అసలు బయో ఇంధనంపై కేంద్ర,రాష్ట్ర సర్కార్లకు అవగాహన లేకపోవడమే ఇలాంటి పరిణామాలకు కారణం.బయో ఇంధనం పర్యావరణానికి మంచిది అని ప్రచారం చేస్తున్నారు.కానీ ఆహారాన్ని రవాణా ఇందనంగా మార్చడం అంటే.. ఆహార భద్రతను ప్రమాదంలో పడేసినట్టేనంటున్నారు పర్యావరణ వేత్తలు. జనాభాలో 40 కోట్ల మంది బియ్యం కొనలేని కటిక దారిద్రం ఉన్న దేశంలో.. ఆహారాన్ని ఇందనంగా మార్చడం లో అర్ధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఓపక్క అభివృద్ధి చెందిన దేశాలు.. హైడ్రోజన్ , ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారుతుంటే.. మనం ఆయా దేశాలు ప్రమాదకరమని వదిలేసిన బయోడీజిల్ టెక్నాలజీని తలకెత్తుకోవడం మూర్ఖత్వమేనంటున్నారు.

చిత్తనూరులో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వద్దని చుట్టుపక్కల రైతులు పోరాటం చేస్తుంటే.. రాష్ట్రసర్కారు ఎందుకు స్పందించడం లేదు? చట్టాలను ఉల్లంఘించి.. జలవనరుల సమీపంలో కంపెనీ ఎలా నిర్మాణమైంది? ఇందులో కేంద్ర, రాష్ట్ర సర్కారుల పాపమెంత? తేల్చెదెవరు. రేపటి తరాలకు మనం ఇవ్వగలిగేది మంచి వాతావరణమేనని సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు చెప్పారు. మరి పర్యావరణాన్ని హననం చేసే ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఎలా ఇచ్చారు? పోనీ.. మంత్రులో,నేతలదో, అధికారులదో తప్పైతే.. దాన్ని సరిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రిది కాదా.? ఏడాదిగా రైతులు చేస్తున్న పోరాటం.. ఇంకా ప్రగతిభవన్ గోడలు దాటుకొని సీఎం కేసీఆర్ చెవికి చేరలేదా? ఇంకెప్పుడు సర్కారుకు సోయి వస్తుంది.? ఇవే మరికల్ మండలంలోని రైతులు సంధిస్తున్న ప్రశ్నలు.

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×