Big Stories

BJP: కేసీఆర్ పై ఈటల ప్రయోగం.. తెలంగాణలో బెంగాల్ ఫార్ములా!

BJP: ఈటల రాజేందర్. ఒకప్పుడు ఉద్యమ నాయకుడు. ఆ తర్వాత కేసీఆర్ ప్రధాన అనుచరుడు. ఇప్పుడు బీజేపీ తురుపు ముక్క. అందుకే, గులాబీ బాస్ మీదకు ఒకప్పటి ఆయన మనిషినే ప్రయోగిస్తోంది కమలదళం. కేసీఆర్ గుట్టు మట్లన్నీ తెలవడం.. ఎత్తుగడలు, వ్యూహాల గురించి మంచి అవగాహన ఉండటంతో.. ఈటలతోనే కేసీఆర్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకే, రాజేందర్ కు ఏకంగా జాయినింగ్స్ కమిటీ బాధ్యతలు అప్పగించి.. టీఆర్ఎస్ ను కకావికలం చేసే టాస్క్ అప్పగించింది. ఢిల్లీ పెద్దలను మెప్పించేలా.. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు ఈటల.

- Advertisement -

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నా.. మునుగోడులో బీజేపీ ఓడినా.. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. ఈ సమయంలో మర్రి శశిధర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని పార్టీలోకి తీసుకురావడం వెనుక ఈటల రాజేందర్ చాణక్యం ఉందని తెలుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక, మొయినాబాద్ ఫాంహౌజ్ కేసు తర్వాత ఇక బీజేపీలోకి వలసలు ఉండవనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం మరింత బలపడితే పార్టీకి తీరని నష్టం. అందుకే, ఉన్నపళంగా మర్రిని కాంగ్రెస్ లోంచి బయటకు రప్పించి కమల దళంలో చేర్పించేశారట ఈటల. అందుకే, ఢిల్లీలో శశిధర్ రెడ్డి అఫీషియల్ గా చేరిన సందర్భంలో.. అక్కడ ఉన్న బీజేపీ నేతలంతా ఈటల రాజేందర్ ను ప్రత్యేకంగా ప్రశంసించి.. ఆ ఈవెంట్ లో అధిక ప్రాధాన్యం కల్పించారని గుర్తు చేస్తున్నారు. మర్రినే కాదు.. మునుగోడు బైపోల్ టైమ్ లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను కారులోంచి దింపేసి కాషాయంలో కలిపేసింది కూడా ఈటల రాజేందరే. అందుకే, రాజేందర్ పై హస్తిన పెద్దలకు మంచి గురి కుదిరిందని అంటున్నారు.

- Advertisement -

ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసేది కూడా ఈటల రాజేందరేనని ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ఆ డెసిషన్ ఈటలదే అయినా, అందుకు బీజేపీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో తరుచూ పర్యటిస్తున్నారు రాజేందర్. అక్కడ పార్టీని పటిష్ట పరుస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేయకున్నా.. వేరే చోటికి షిఫ్ట్ అయినా.. గులాబీ బాస్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఆయనపై బరిలో దిగాలని ఈటల రాజేందర్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.

కేసీఆర్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత భారీగా ఉందనే అంచనాతో.. నౌ ఆర్ నెవర్ అనేలా కమలనాథులు కదనోత్సాహంతో అసెంబ్లీ పోరుకు రెడీ అవుతున్నారు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనేలా.. నేరుగా గులాబీ బాస్ పైనే గురిపెట్టారు. గట్టిగా ట్రై చేస్తే.. కేసీఆర్ ను ఓడించడం అంత కష్టమేమీ కాదని లెక్కలు వేస్తున్నారు. గజ్వేల్ గుండెల్లో ఈటలను దింపేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది కమలదళం. బెంగాల్లో మమతా బెనర్జీ మీద ఆమె మాజీ సన్నిహితుడు సుదేంద్రు అధికారిని నిలబెట్టి గెలిచినట్టుగానే.. ఈసారి తెలంగాణలో అదే ఫార్ములా అమలు చేస్తూ.. కేసీఆర్ మీదకు ఈటల రాజేదర్ ను అస్త్రంగా వదులుతోంది బీజేపీ. అందుకే, ఆయనకు ఇప్పటి నుంచే అంత ప్రయారిటీ ఇస్తోందని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News