– ఆదేశాలు జారీచేసిన వైద్య ఆరోగ్యశాఖ
– వరుస చేదు ఘటనలతో సర్కారు నిర్ణయం
– పుడ్ సేఫ్టీ కోసం 3 టెస్టింగ్ ల్యాబ్స్
– నిషేధాన్ని ఉల్లంఘించే హోటళ్లు సీజ్
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్న మయోనైజ్‌ను రాష్ట్రంలో నిషేధిస్తూ తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో పలు హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ ఎంక్వైరీలను చేయాలని సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా మంత్రి కీలక సూచనలు చేశారు.
3 టెస్టింగ్ ల్యాబ్స్
రాష్ట్రంలో నూతనంగా 3 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు, 5 మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని దామోదర రాజనర్సింహా ఆదేశించారు. కల్తీ ఆహారపదార్థాల్ని తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతోన్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఈ మయోనైజ్‌ను ఎక్కువగా మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటున్నారని, చాలా చోట్ల దీనిలో కల్తీ జరుగుతోందని ఆయన వివరించారు. గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారని, ఇది ఉడికించని పదార్థం కావడం వలన హానికర బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుందని అధికారులు తెలిపారు.
Also Read: బీఆర్ఎస్ నేతల్లో గందరగోళం.. ఏం మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు?
వరుస ఘటనల నేపథ్యంలో..
హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరిశంకర్‌కాలనీలలో గత శుక్రవారం జరిగిన సంతలో ‘దిల్లీ హాట్ మోమోస్’ దుకాణంలో విక్రయించిన నాన్వెజ్మోమోస్, వాటితో పాటు ఇచ్చిన మయోనైజ్, చట్నీని బస్తీకి చెందిన రేష్మబేగం అనే మహిళ, ఆమె పిల్లలు రుమ్షా, రఫియాలు తిన్నారు. అదేరోజు రాత్రి ముగ్గురికీ విరోచనాలు, వాంతులు అయ్యాయి. పిల్లలిద్దరినీ హాస్పిటల్లో చేర్చగా తల్లి ఇంట్లోనే ఉంది. ఆదివారం రేష్మబేగం (31) ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించింది. గతంలో అల్వాల్‌లోని గ్రిల్ హౌజ్ హోటల్‌లో నాసిరకమైన మయోనైజ్‌ను తిన్న కొందరు యువకులు ఇటీవల హాస్పిటల్ పాలయ్యారు. ఈ కేసులో పోలీసులు ఇవాళ మోమోస్ విక్రయించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ హోటళ్లు తీరు మారట్లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది.