Bhatti Vikramarka on BRS: విద్య, వైద్య రంగాలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శనకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పవర్ ప్లాంట్ స్టేషన్ కు బొగ్గును తరలించే రైలును ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ప్రపంచ స్థాయికి పోటీనిచ్చేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం కేవలం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించిందని, తమ ప్రభుత్వం రూ.5,000 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యరంగాలను విస్మరించారని, ఇప్పుడు తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి బీఆర్ఎస్ నేతలు అడుగడుగునా అడ్డు తగులుతున్నారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను సకల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని, పేద, ధనిక అనే తేడా లేకుండా నాణ్యమైన విద్యను ఉచితంగా అందరికీ అందించడమే ఈ స్కూల్స్ ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే కాస్మోటిక్ చార్జీలను 40 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, విద్యారంగం అభివృద్ధి కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాస్మోటిక్ చార్జీలను అస్సలు పెంచలేదని, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను నాడు ఎదుర్కొన్నారన్నారు.
అలాగే యాదాద్రి పవర్ స్టేషన్ కు పర్యావరణ అనుమతులు సైతం సాధించామని తెలిపారు. అంతేకాదు సంక్రాంతి తరువాత అర్హులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకం అమలైతే పేదలకు సన్నబియ్యం అందించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కూల్స్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞాన విద్యను కూడా అందించి, భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందుకోసం ఇప్పటికే ఆయా శాసన సభ నియోజక వర్గాల్లో 25 ఎకరాల స్థలం కేటాయించగా, ఇందుకు గాను 5 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
పేద, బడుగు బలహీనవర్గాలకు ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమంకు శ్రీకారం చుట్టగా, త్వరితగతిన స్థలం సేకరించి ఈ సంవత్సరంలో ప్రారంభించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. యాదాద్రి పర్యటనలో డిప్యూటీ సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు పాల్గొన్నారు.