EPAPER

Congress : కాంగ్రెస్ సరికొత్త ఎన్నికల వ్యూహం సక్సెస్.. ఒక్కటైన హస్తం అయిదువేళ్లు

Congress : కాంగ్రెస్ సరికొత్త ఎన్నికల వ్యూహం సక్సెస్.. ఒక్కటైన హస్తం అయిదువేళ్లు
Congress

Congress : తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. తెలంగాణలో తనకు ఎదురేలేదని విర్రవీగిన బీఆర్‌ఎస్‌ ధీమా కాంగ్రెస్ సంకల్ప బలం ముందు బద్దలైపోయింది. హ్యాట్రిక్ మాదేనంటూ గులాబీ నేతలు చేసిన ప్రచారం.. జనం విజ్ఞత ముందు దూదిపింజలా తేలిపోయింది. కాంగ్రెస్ సరికొత్త రాజకీయం ముందు కారు పార్టీ వ్యూహాలు చిత్తయిపోయింది.


గత నవంబరులో తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో ఆయన మమేకమైన తీరు యావత్ కాంగ్రెస్ శ్రేణులను అబ్బురపరచింది.

దీంతో కాంగ్రెస్‌లో సహజంగా ఉండే వర్గ విభేదాలను పక్కనబెట్టి నేతలంతా ఒక్కమాటపై నిలవటం ప్రారంభమైంది. తమ ప్రాధాన్యలను మరిచి నేతలంతా ఉమ్మడిగా కాంగ్రెస్ గెలుపుకోసం కదిలిరావటంతో అది క్షేత్ర స్థాయికి త్వరలోనే చేరుకుంది. తమ నేతల్లో ఎన్నడూ లేనంత ఐకమత్యం చూసిన కాంగ్రెస్ కార్యకర్తలకూ వెయ్యి ఏనుగుల బలం చేకూరింది. దీంతో గ్రామ, మండల స్థాయి నుంచి అధికారిక బీఆర్ఎస్ అరాచకాలను నిలదీయటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రక్రియ మొదలైంది.


ఇంతలో వచ్చిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అసాధారణ విజయం.. పొరుగునే ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి పోసింది. అక్కడి మార్పు.. ఇక్కడా సాధ్యమేననే ఆత్మవిశ్వాసం కార్యకర్తల్లో స్పష్టంగా కనిపించింది. అక్కడ రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ వ్యూహాలు విజయవంతమైన తీరు.. ఇటు కాంగ్రెస్ నేతల్లోనూ కేసీఆర్‌ను గద్దె దింపేది తామేననే ధీమాను కలిగించాయి.

గతంలో గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతల హంగామా, సొంతనేతలపై ఆరోపణలు చేయటం, వర్గాల పేరుతో విభజన రాజకీయాల్లో మునిగి తేలటం, ఢిల్లీలో నెలల తరబడి మకాం వేసి.. లాబీయింగ్ ద్వారా టికెట్ తెచ్చుకోవటం వంటి అవలక్షణాలను కాంగ్రెస్ వదిలించుకోవాల్సిందేనని, పనిచేసే వారికే టిక్కెట్లు అనే రాహుల్ స్పష్టమైన సందేశంతో కాంగ్రెస్‌ నేతల్లో ఎన్నడూ చూడనంత క్రమశిక్షణను తెచ్చింది.

అటు.. ఆయా నియోజక వర్గాల్లోని ప్రధాన నేతలంతా ఆడంబరాలకు దూరంగా, తమ సామాన్య జీవనశైలితో జనంతో మమేకమై ముందుకు సాగారు. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు ధనబలం, అధికారం కంటే సామాన్యులైన, తమలో ఒకరిగా మెలుగుతున్న కాంగ్రెస్ నేతలకే జనం జైకొట్టేలా చేశాయి.

అటు.. గ్రామాల్లో సైతం సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు.. జనానికి చేరువగా ఉంటూ కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను ఇంటింటికీ తీసుకుపోయి, వారి అభిమానాన్ని ఓటుగా మార్చటంలో తీవ్రంగా శ్రమించారు. అదే సమయంలో సోనియా,రాహుల్, ప్రియాంక గాంధీల పర్యటనలు జనం మనసులను కదిలించాయి. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణకు ఓటేయాలనే సంకల్పం దిశగా వారిని నడిపించాయి.

దళిత సీఎం వాగ్దానభంగం, రాజయ్యను అవమానించిన తీరు, దళిత బంధు అందక రగిలిపోయిన ఎస్సీలు, పోడు భూముల విషయంలో దగాపడ్డామనే ఆక్రోశంలో ఉన్న ఆదివాసీ, గిరిజనులకు ఊరట కలిగించేలా దివంగత ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలను కాంగ్రెస్ ముందుండి నడిపించే చొరవ తీసుకోవటం, ఆయన కుమార్తెకు కంటోన్మెంట్ సీటివ్వటం, ఆదిలాబాద్ జిల్లాలో నిరుపేద ఆదివాసీ అభ్యర్థి వెడ్మ బొజ్జు వంటివారికి సీటివ్వటంతో దళిత, ఆదివాసీ వర్గాలూ కాంగ్రెస్ బాట పట్టాయి.

ఇంటికో ఉద్యోగమంటూ పోటీ పరీక్షలనూ నిర్వహించకుండా దగాచేసిన ప్రభుత్వంపై కసిమీద ఉన్న నిరుద్యోగుల గుండెఘోషకు కాంగ్రెస్ గొంతునిచ్చింది. అలాగే.. తెలంగాణ సమాజంలో మచ్చలేని నేతగా నిలిచిన కోదండరామ్ వంటి మేధావులు, అందెశ్రీ వంటి ప్రజాగాయకుల మద్దతు హస్తానికి వేయి ఏనుగుల బలానిచ్చాయి.

అటు.. పీఆర్సీ ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగులు, సమ్మె వాగ్దానాలను నెరవేర్చలేదని ఆర్టీసీ కార్మికులు, తమను పట్టించుకోలేదనే కోపంతో యావత్ పోలీస్ యంత్రాంగం ‘ఇక చాలు… మార్పు కావాలి’ అని సంఘటితమైన సంగతిని గమనించిన కాంగ్రెస్ వారికి ఊరటనిచ్చే పలు వాగ్దానాలను మేనిఫెస్టోలో చేర్చి వారి మనసు గెలిచింది.

తెలంగాణలో 15 శాతానికి పైగా ముస్లింలున్న 24 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును తనవైపుకు మళ్లించుకోవటంలో ఎంతోకొంత సఫలీకృతమైంది. అలాగే.. తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గం కూడా కాంగ్రెస్‌ కోసం మునుపెన్నడూ లేని విధంగా పార్టీ విజయం కోసం కృషి చేసింది. మరోవైపు ప్రధాని మోదీ ప్రకటించిన ఎస్సీ వర్గీకరణ, బీజేపీ బీసీ సీఎం ప్రభావం ఎన్నికల్లో చూపకపోగా.. జనం మరింతగా కాంగ్రెస్‌ను కోరుకునేలా చేశాయి.

చివరగా.. పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి దూకుడు, అందరినీ కలుపుకుపోయిన తీరు, ప్రజావైఫల్యాలను తన పదునైన విమర్శలతో జనంలోకి తీసుకుపోవటం, తామంతా ఒక్కటిగా నిలిస్తే.. బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టగలమని పదేపదే చెబుతూ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన తీరు ఈ ఎన్నికల్లో హైలెట్‌ అని చెప్పక తప్పదు. చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో సీమాంధ్రుల్లో నెలకొన్న అసంతృప్తిని గుర్తించి, వారిని కాంగ్రెస్ వైపు నిలవటంతో రేవంత్ చాణక్యం ప్రశంసించాల్సిందే.

మొత్తంగా.. తాను సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలకూ ప్రతీకగా నిలుస్తానని, నేటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఆలోచనలతో ముందుకు సాగే పార్టీనని కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని పొందగలిగింది. నామినేషన్ నుంచి తుది ఫలితం వరకు కాంగ్రెస్ నేతలు చూపిన సంయమనం.. ఇది మారిన కాంగ్రెస్ అని నిరూపించింది. అదే… నేటి ఎన్నికల ఫలితంలోనూ స్పష్టంగా వ్యక్తమైంది.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×