Madhu Yashki Comment on Union Budget: గత సమైక్య రాష్ట్రంలో అభివృద్ధిలో అన్యాయం, వివక్షలను సహించలేకనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మోదీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో అదే వివక్ష కొనసాగిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024 పై ఆయన స్పందించారు. నాడు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరిగిన అన్యాయాలపై తెలంగాణ సమాజం పోరాడిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రాని నీళ్లు, నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులలో తీరని అన్యాయం చేస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సహాయం చేసి ఆదుకోవాల్సిన కేంద్రం.. తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ మధుయాష్కీ విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించారన్నారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే, రాష్ట్ర ప్రజలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ గుండు సున్నేనా ..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి, మిగతా రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం దారుణమన్నారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల పట్ల బడ్జెట్లో తీవ్ర వివక్ష కనిపించిందంటూ ఆయన మండిపడ్డారు. దేశమంటే కొన్ని రాష్ట్రాల అభివృద్ధి మాత్రమే కాదని, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దని ప్రధాని మోదీకి సూచించారు.
Also Read: కవిత అరెస్ట్‌పై మొదటిసారిగా స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..?
తెలంగాణ రాష్ట్రాని రూపాయి కూడా కేటాయించకపోవడం విడ్డూరమన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారంటూ బండి సంజయ్, కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు ఏ మొహం పెట్టుకుని సమాధానం చెబుతారని వారిని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వ వివక్ష ఎంత ఉందో ప్రజలు ఈ సందర్భంగా గమనించాలన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలను ప్రజలు నిలదీయాలన్నారు.
తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, కొత్త రైల్వే లైన్లు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఊసే లేదంటూ మధుయాష్కీ కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అంటే.. స్వశక్తితోనేనని ఆయన నొక్కి చెప్పారు. రూ. 2 లక్షల రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తూ, అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న తెలంగాణను చూసి మోదీ ప్రభుత్వానికి కంటగింపుగా మారిందంటూ ఆయన విమర్శలు గుప్పించారు.