EPAPER

Telangana Congress : కాంగ్రెస్ పని ఖతం?.. మళ్లీ కోలుకోగలదా?

Telangana Congress : కాంగ్రెస్ పని ఖతం?.. మళ్లీ కోలుకోగలదా?

Telangana Congress : కంచుకోటలు కూలిపోతున్నాయి. పార్టీ గాడిన పడుతున్నదనుకునేలోపే.. మళ్లీ ఓటమి శరాఘాతమైంది. ఇక కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా? హస్తం దుస్తితికి వ్యవస్థాగత తప్పిదాలే కారణమా? స్వార్థ రాజకీయాల బంధనాలు తెంచుకొని చేయి పార్టీ తిరిగి పోరాడగలదా?


కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు తయారైంది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ కు కంచుకోటైన మునుగోడు ఉపఎన్నికల్లోనూ హస్తం పార్టీ చతికిలపడింది. మరీ మూడోస్థానానికి పడిపోయింది. అదేదో కొద్దో గొప్ప తేడాతో కాదు. చెప్పుకోవాలి కాబట్టి మూడో స్థానం కాంగ్రెస్ అనాల్సిందే తప్ప.. నిజానికి ఇండిపెండెంట్ అభ్యర్థుల స్థాయికి హస్తం పార్టీ ఓటుశాతం పడిపోయింది. పాల్వాయి స్రవంతికి జనాల్లో మంచి పేరు, ఆమె పట్ల సానుభూతి ఉన్నా.. అది ఓట్లుగా మాత్రం మారలేదు. నిజానికి టీఆరెస్, బీజేపీ ఆభ్యర్థులతో పోల్చితే.. పాల్వాయి స్రవంతి ఆర్థికంగా బలహీనురాలే. పార్టీ పరంగా కూడా ఆమెకు మద్దతు కంటే.. గందరగోళమే ఎక్కువైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం జనాలను ఉర్రూతలూగించినా… క్షేత్రస్థాయిలో దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో వైఫల్యమైంది స్థానిక పార్టీ కేడర్. అంతర్గత కుమ్ములాటలతో తలో దారి .. తేలేది గోదారి అన్నట్టు వ్యవహరించారు. వెరసి.. కాంగ్రెస్ ఖాతాలో మరో ఘోర ఓటమి. ఓడిపోయిన తర్వాత ఎన్ని రకాల కారణాలైనా చెప్పుకోవచ్చు.. కానీ వాట్ నెక్ట్స్ అనేది ముఖ్యం.

2018 నుంచి రాష్ట్రంలో ఇప్పటికి 5 ఉపఎన్నికలు జరిగాయి.. అన్నింటిలో కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. ఒక్క నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మాత్రమే కాస్త టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చింది. నానాటికీ తీసికట్టు నాగం బొట్టు అన్న చందంగా మారుతున్నది కాంగ్రెస్ పరిస్థితి. నిజానికి రేవంత్ రెడ్డి టీపీసీసీ అయ్యాక .. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. పార్టీ కేడర్ అంతా ఒక్కటవుతున్నారు. కూటములు ఎలా ఉన్నా… రేవంత్ కు అండగా నిలుస్తున్నారు. కానీ, సీనియర్లు, టీపీసీసీ, ముఖ్యమంత్రి పదవిపై ఆశపెట్టుకున్న సీనియర్ నేతలు మాత్రం.. కాలిలో ముల్లులా మారుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలోనూ అదే సీన్. కోరి మరీ పాల్వాయి స్రవంతికి మునుగోడు సీటు వచ్చేలా చేసిన సీనియర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి .. తీరా ఎన్నికల సమయంలో మొఖం చాటేశారు. స్రవంతికి అనుకూలంగా ప్రచారం చేయలేదు. అంతే కాదు ఆయన తన సోదరుడు రాజగోపాల్ కే ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతలు, నియోజకవర్గ ముఖ్యులకు చేసినట్టు ఆడియోలు వెలుగు చూశాయి. దీనిపై పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసులిచ్చినా… తూచ్ అవి ఎడిటెడ్ వి అంటూ కొట్టిపారేశారు.


అసలు కాంగ్రెస్ లో నేతలంతా ఒక్క మాటమీదికి వచ్చే పరిస్థితి లేదు. ఎవరికి వారు సొంత మైలేజీ చూసుకునేవారే. దీంతో.. తాము కాకుండా మరెవరైనా పార్టీకి నాయకత్వం వహిస్తే సహకరించకపోవడమే కాకుండా.. పీత సూత్రం పాటిస్తూ కాళ్లు పట్టి లాగేస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ దుస్థితికి అసలు కారణం. దీనికి పరిష్కారం కనుగోనడంలో హైకమాండ్ విఫలమవుతన్నది. ఓ వైపు వరుస ఓటముల బాధతో .. ఇప్పుడు మంచోడో చెడ్డోడో ఉన్న లీడర్ల పై చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుందేమోనన్న అనుమానమే ఇందుకు కారణం. దీంతో.. కాంగ్రెస్ రాజకీయం అంటే ఇలాగే ఉంటుందని జనం కూడా లైట్ తీసుకుంటున్నారు.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×