EPAPER
Kirrak Couples Episode 1

Congress: మమతానురాగం.. కాంగ్రెస్సే కీలకం..

Congress: మమతానురాగం.. కాంగ్రెస్సే కీలకం..
congress alliance

Congress: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయాలు కూడా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ టైం నడుస్తోంది. కలిసివచ్చే కాలానికి నడిచివచ్చే మిత్రులు తోడు నడుస్తున్నారు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న వారే ఇప్పుడు హస్తం పవరేంటో తెలుసుకుని మరీ ముందుకు వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనే పార్టీగా కాంగ్రెస్ మళ్లీ ఫాంలోకి రావడంతో అన్ని ప్రాంతీయ పార్టీలు హస్తానికి జై కొడుతున్నాయి.


కర్ణాటకలో కాంగ్రెస్ బంపర్ విక్టరీతో ఒక్కసారిగా నేషనల్ లెవెల్ లో పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పని అయిపోయిందని, మోదీ, అమిత్ షాను ఎదుర్కొనే పరిస్థితి లేదనుకున్న వారికి బలమైన నమ్మకం ఏర్పడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమైపోయింది. కర్ణాటకలో వచ్చిన గెలుపుతో చాలా ప్రాంతీయ పార్టీల మాట మారిపోయింది. ఇది వరకు కాంగ్రెస్ లేకుండానే థర్డ్ ఫ్రంట్ ఆలోచనలు చేసిన వారంతా ఇప్పుడు రూట్ మార్చేశారు.

బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదని మమతాబెనర్జీ, కేసీఆర్ సహా పలువురు నేతలు ఇదివరకు భావించారు. అంతెందుకు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అయితే… ఎవరితోనూ పొత్తు ఉండదని, ముఖ్యంగా కాంగ్రెస్ పై అప్పట్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పొత్తు ప్రజలతోనే అని, ప్రజల మద్దతుతోనే ఎన్నికల బరిలో నిలుస్తామన్నారు. సీన్ కట్ చేస్తే కర్ణాటకలో భారీ విక్టరీతో దీదీ కూడా ఇప్పుడు మనసు మార్చుకున్నారు. మెత్తబడ్డారు. ఇప్పటికే బిహార్ సీఎం నితీష్ కుమార్ వరుసగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శరద్ పవార్, మమత, అఖిలేష్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్ ఇలా ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస మీటింగ్ లు పెడుతున్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించడం.. అన్ని పార్టీలు ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా చర్చలు జరుపుతూ వచ్చారు.


నిజానికి కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ అసాధ్యమని చాలా మంది నేతలకు తెలుసు. కానీ హస్తం హవా లేదనుకుని చాలా మంది కాంగ్రెస్ లేకుండానే కూటమి కట్టే ప్రయత్నాలు చేశారు. కానీ రోజులు మారాయ్ పరిస్థితులు మారాయ్.. ఇప్పుడు హస్తం పార్టీ గ్రాఫ్ పెరిగిపోయింది. అందుకే మొన్నటికి మొన్న ఎవరితోనూ పొత్తు లేదన్న మమతా బెనర్జీ ఇప్పుడు మెత్తబడి కొత్త కొత్త ఫార్ములాలు ప్రతిపాదించే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న చోట సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట త్యాగాలకు సిద్ధపడాలని సూచించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో అఖిలేశ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి బలం ఉందని, అక్కడ ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో ఆప్‌, బెంగాల్‌లో తృణమూల్‌కు, బీహార్‌లో జేడీయూ-, ఆర్జేడీకి మద్దతివ్వాలంటూ సూచనలు చేశారు.

ఇన్నాళ్లూ కాంగ్రెస్ ను విమర్శించిన మమత రూట్ మార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి. వారు చేసుకుంటున్న సర్వేల్లో హస్తం పార్టీ గ్రాఫ్ పెరిగినట్లు గుర్తించారు. పైగా కర్ణాటకలో బంపర్ విక్టరీ చూశాక సీన్ మార్చుకుంటున్నారు. అటు కాంగ్రెస్ కూడా అన్ని పార్టీలతో సీట్ షేరింగ్ చర్చలు జరిగేప్పుడు కొద్దిగా ఎక్కువే అడిగేందుకు అవకాశం దొరికింది. ఇన్నాళ్లూ లైట్ తీసుకున్న వారే ఇప్పుడు కాంగ్రెస్ గూటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ బలంగా ఉన్న 200కు పైగా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇవ్వాలన్న నితీష్ ప్రతిపాదనకు మమతా బెనర్జీ అంగీకరించారు.

నిజానికి మమతా బెనర్జీ పార్టీకి ఇటీవలే బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. గతంలో జరిగిన బైపోల్ లో తృణమూల్ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థి భారీ తేడాతో ఓడించారు. ఈ పరిస్థితిని దీదీ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. రిజల్ట్ వచ్చిన మరుక్షణమే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోమని ప్రకటించేశారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులతో మెత్తబడ్డారు. మరోవైపు అభివృద్ధి అజెండానే విపక్షాలు ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఖాయమంటున్నారు.

కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట ఆ పార్టీకే మద్దతిస్తామని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో తాను ఏకీభవిస్తున్నానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్వరం కలిపారు. 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేయాల్సి ఉందని, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడే పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు. బిహార్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు నితీశ్‌ కుమార్‌, కేసీఆర్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అఖిలేష్ గుర్తు చేస్తున్నారు.

విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తేనే బీజేపీ నెంబర్ ను 100 సీట్లలోపు కట్టడి చేయవచ్చని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. అంతా కలిసి వస్తే తప్ప నెంబర్ గేమ్ లో ముందుకు వెళ్లడం అసాధ్యమంటున్నారు. కాంగ్రెస్ లేని కూటమితో మోదీని ఓడించలేమని నితీశ్ చెబుతున్న మాట. విపక్షాలు ఉమ్మడిగా బరిలో దిగకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంటూ తన వెర్షన్ వినిపించారు. మరోవైపు అప్పట్లోనే కాంగ్రెస్ నేతలు కూడా అన్ని విపక్షాలు తమతో కలిసి రావాలని ఆహ్వానించారు. ఎలక్షన్లకు ఉన్నది ఏడాది మాత్రమే అని ఇప్పటినుంచే యాక్షన్ ప్లాన్ కు సిద్ధమవ్వాలంటూ ఇటీవలే రాయ్ పూర్ ప్లీనరీ వేదికగా పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ.

మోదీని ఢీకొట్టాలంటే బలమైన ప్రధానమంత్రి అభ్యర్థి కూడా అవసరమే. ప్రధాని రేసులో చాలా మంది ఆశలు పెట్టుకుంటున్నారు. మమత, శరద్ పవార్, నితీష్, కేసీఆర్, రాహుల్ ఇలా లిస్టు పెద్దదిగానే ఉంది. అయితే అన్ని రాష్ట్రాలు తిరుగుతూ నేతలతో చర్చలు నిర్వహిస్తున్న నితీశ్ కుమార్ మాత్రం తనకు ప్రధాని పదవిపై ఆశ లేదంటూ పదే పదే చెప్పుకొస్తున్నారు. మరోవైపు భారత్ జోడో యాత్రతో దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలతో మమేకం అయ్యారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఏ రాజకీయ నేత కూడా చేయని సాహస యాత్ర చేశారు. అటు సర్వేలు కూడా భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని తేల్చాయి. మోదీని ఎండగడ్డటంలో రాహుల్ ముందుంటున్నారు. లోక్ సభ సభ్యత్వం పోయినా వెనక్కు తగ్గడం లేదు. అందరూ ఒక్కతాటిపైకి వస్తే ప్రధాని అభ్యర్థి విషయం పెద్ద సమస్య కాదని అంటున్నారు. ఇగోలన్నీ పక్కన పెట్టి పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన ఫార్ములాకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ఒక్కొక్కర్ని విడివిడిగా కలవడం ప్లస్ అవుతోందంటున్నారు. నిజానికి కాంగ్రెస్ లేకుండా విపక్షాల ఐక్యత, మోదీ సర్కార్ ను ఢీకొట్టే శక్తి ఏ ప్రాంతీయ పార్టీకీ లేదు. ఏ రాష్ట్రంలో వారు ఎఫెక్ట్ చూపించినా.. వారంతా కలవకపోతే బీజేపీని నిలువరించడం కష్టమే అన్న వాదన ఉంది. కొన్ని పార్టీలైతే కాంగ్రెస్ లేకుండా కూటమి కట్టే ప్రయత్నాలు చేశారు. అయితే అవి ముందుకు కదలలేకపోయాయి. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

Related News

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Stories

×