Big Stories

TSPSC: అసలేంటి ‘వ్యాపం’ కేసు?… TSPSC పేపర్ లీకేజీతో పోలికేంటి?

TSPSC: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసు తెలంగాణలో ప్రకంపణలు సృష్టిస్తోంది. నిందితులు చాలా సింపుల్‌గా పేపర్లు లీక్ చేశారు. జస్ట్ సిస్టమ్స్ ఐపీ అడ్రస్ మార్చేసి.. ప్రశ్నాపత్రాలు పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసేశారు. అంగట్లో సరుకులా ఒక్కో పేపర్ లక్షల్లో అమ్మేసుకున్నారు.

- Advertisement -

అయితే, విపక్ష కాంగ్రెస్ ఆరోపణ మరోలా ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ విషయంలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని ఆరోపించారు. పలువురు ఎన్నారైలకూ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారని అన్నారు. జస్ట్ అనడమే కాదు.. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పార్టీ తరఫున పిటిషన్ కూడా వేయించారు రేవంత్‌రెడ్డి.

- Advertisement -

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం.. వ్యాపం కేసు మాదిరే జరిగిందంటూ రేవంత్‌రెడ్డి మొదటినుంచీ బలంగా ఆరోపిస్తున్నారు. హైకోర్టులో విచారణ సందర్భంగా కూడా.. గతంలో వ్యాపమ్ స్కామ్ ను సీబీఐకు సుప్రీంకోర్టు అప్పగించిందని చెప్పారు. మధ్యప్రదేశ్ వ్యాపమ్ స్కామ్ జడ్జిమెంట్ కాపీని సైతం హైకోర్టుకు సమర్పించారు. దీంతో.. మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం స్కాం కేసు ఏంటనే దానిపై మరోసారి చర్చ జరుగుతోంది.

వ్యాపం(vyapam) అనేది మధ్యప్రదేశ్ వృత్తి విద్యా కోర్సుల పరీక్ష నిర్వహణ బోర్డు. ఈ సంస్థ మధ్య‌ప్రదేశ్‌లో జరిగే అన్ని వృత్తి విద్యా ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంస్థలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారీ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే అనర్హులైనవారు మధ్యవర్తుల ద్వారా రాజకీయ నాయకులకు, వ్యాపం ఉద్యోగులకు లంచమిచ్చి టాప్ ర్యాంకులు తెచ్చుకోవడంతో వ్యాపం కుంభకోణం వెలుగు చూసింది.

వ్యాపం కుంభకోణం విస్తృత విచారణకు 2013లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్సుని నియమించింది. విచారణలో ఎందరో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపం ఉద్యోగులు, కుంభకోణం నడిపిన మధ్యవర్తులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేర్లు బయటకు వచ్చాయి. 1995 నుంచే ఈ స్కామ్ జరుగుతున్నట్టు తేల్చారు. జూన్ 2015 నాటికి 2000 మందికి పైగా అరెస్టయ్యారు. వారిలో మధ్యప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మతో పాటు వంద మందికి పైగా రాజకీయ నాయకులు ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పైనా ఆరోపణలు వచ్చాయి. వ్యాపం స్కాం కారణంగా 40 మంది వరకు చనిపోయారు. ఇందులో బలవన్మరణాలతో పాటు అనుమానాస్పద మరణాలూ ఉన్నాయి.

2015 జూలైలో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. వ్యాపం కేసులో 31 మందిని దోషులుగా నిర్ధారించిన భోపాల్ సీబీఐ కోర్టు.. కమల్ కిశోర్‌ను ప్రధాన ముద్దాయిగా తేల్చింది. ఐదుగురికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది.

లంచం తీసుకుని అర్హతలేని విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసి వారికి మంచి ర్యాంకులు వచ్చేలా చేయడం.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం.. పరీక్షల్లో కాపీయింగ్‌కు సహకరించడం.. ఓఎంఆర్ షీట్‌ను పూర్తిగా నింపకుండా ఖాళీలు వదిలేలా చేసి సరైన ఆన్సర్లను అధికారులే మార్క్ చేసేలా చేయడం.. ప్రశ్నాపత్రం ముందే లీక్ చేయడం.. ఇలా అనేక మార్గాల్లో వ్యాపం కుంభకోణం జరిగిందని తేల్చారు.

2017 సుప్రీంకోర్టు వ్యాపం కేసులో 83 పేజీల తీర్పు ఇచ్చింది. 634 మంది డాక్టర్ డిగ్రీలు రద్దు చేసింది. వ్యాపం స్కాం కేసు మధ్య ప్రదేశ్‌ను షేక్ చేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ TSPSCలో పరీక్ష పేపర్లు లీక్ కావడం.. మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయడం.. గతంలోనూ గ్రూప్ 1 పేపర్లను లీక్ చేశారని అంటుండటంతో.. టీఎస్‌పీఎస్సీ కేసు సైతం మరో వ్యాపం కేసుగా మారుతుందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మెడకు వ్యాపం కేసు చుట్టుకోగా.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని TSPSC పేపర్ లీక్ కేసు చిక్కుల్లో పడేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యాపం కేసును తెరమీదకు తీసుకొస్తూ.. వన్ షాట్ టు బర్డ్స్‌లా ఇటు బీఆర్ఎస్‌ను, అటు బీజేపీని టార్గెట్ చేయడంతో రేవంత్‌రెడ్డి రాజకీయం ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News