EPAPER

CM Revanth Reddy : ఎంత నమ్మక ద్రోహం కేసీఆర్..!

CM Revanth Reddy : ఎంత నమ్మక ద్రోహం కేసీఆర్..!
Telangana politics

Medigadda barrage news today(Telangana politics): మేడిగడ్డ పిల్లర్ కుంగిన రోజే.. ఇది ఎన్నికల్లో తమ ఓటమి కారణమని కేసీఆర్ భావించారా? అసలు సంగతి బయట పడకుండా మేనేజ్ చేద్దామని ప్రయత్నించారా? మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిన బాధ్యతను.. ఆ పని చేసిన నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ వైఫల్యంగా చిత్రీకరించాలని కేసీఆర్ అండ్ కో ప్రయత్నించారా? అందుకు ఒప్పుకోని ఎల్ అండ్ టీ సంస్థను నాటి ప్రభుత్వ పెద్దలు బెదిరించారా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ రాసిన ఒక లేఖలోని అంశాలన్నీ నాటి ప్రభుత్వ దాష్టీకానికి బలం చేకూర్చుతున్నాయి.


ఈ మేడిగడ్డ పూర్వాపరాల్లోకి వెళితే..
2019లో గోదావరి మీద నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిది.. లక్ష్మీ బ్యారేజీ. మేడిగడ్డ వద్ద దీనిని నిర్మించారు. దీని పొడవు 1.6 కి.మీ కాగా.. ఆ పిల్లర్ కుంగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలోనే ఉంది. అక్టోబరు 21 సాయంత్రం 6.20 నిమిషాలకు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోయింది. ప్రాజెక్టు బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న బ్రిడ్జి అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీకి ఉన్న 20వ పిల్లర్‌ వీక్ కావటంతో భారీ శబ్దంతో బ్రిడ్జి కుంగింది.

అక్టోబరు 21 అర్థరాత్రి వేళ.. ఆ 16.17 టీఎంసీల సామర్థ్యం గల బ్యారేజీ వంగిపోయింది. ఘటన జరిగిన సమాయానికి 10.17 టీఎంసీల నీరు ఉంది. ఇంజనీర్లు మొదట 12 గేట్లు, తర్వాత మొత్తం 46 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలేశారు. డామ్ కుంగిన వెంటనే ఇంజనీర్లు అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ పోలీసులకు సమాచారమిచ్చి అటుగా ఎవరూరాకుండా చర్యలు తీసుకున్నారు. అర్థరాత్రికి బ్రిడ్జిని నిర్మించిన ఎల్‌అండ్‌టీ నిపుణులు మేడిగడ్డ చేరుకుని డ్యాం పైభాగాన్ని పరిశీలించారు.


అక్టోబరు 22న మళ్లీ ఎల్ అండ్ టీ నిపుణులు పిల్లర్లనూ పరిశీలించారు. అదే రోజు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సహా సంబంధిత ఇంజినీర్లు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందనీ, పునరుద్ధరణ పనిని ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థే చేపడుతుందని బ్యారేజీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తిరుపతిరావు పేరుతో ప్రకటన విడుదలైంది. బ్యారేజీ డిజైన్‌ పూర్తిగా రాష్ట్ర అధికారులదని, పునరుద్ధరణ పనిని తమదేనని, కనుక తామే ఈ పునరుద్ధరణ పనిని చేస్తామని ఎల్ అండ్ టీ జనరల్‌ మేనేజర్‌ కూడా అదే రోజు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆ తర్వాత కేంద్ర జలసంఘం.. అనిల్‌ జైన్‌ నాయకత్వంలోని ఒక బృందం దీనిని పరిశీలించారు. ఈ బృందం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయినప్పుడు కూడా బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్లు తెలిపారు.

డిసెంబరు 2న అంటే.. (అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావటానికి ఒకరోజు ముందు) ఎల్‌ అండ్‌ టీ జనరల్‌ మేనేజర్‌ సురేష్‌కుమార్‌ డిసెంబరు 2న ఈఎన్సీ(రామగుండం) వెంకటేశ్వర్లుకు ఓ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని, దెబ్బతిన్న పియర్స్‌ను పునరుద్ధరించే పని తమది కాదని, బ్యారేజీ కుంగిన చోట పియర్స్‌, పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అక్కడికి నీరు రాకుండా ఓ కాఫర్‌ డ్యాం కట్టాలనీ, దానికి రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, దీనికోసం అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే పనులు మొదలు పెడతామని L&T ఆ లేఖలో తెలిపింది.

బ్యారేజీ కుంగిన రోజు.. ప్రాజక్టు నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థ L&T భరిస్తుందని గతంలో అటు ప్రాజెక్టు ఇంజినీర్లు ప్రకటించటం, ఇటు L&T కూడా అందుకు అంగీకారం తెలపటం జరిగిపోయాక డిసెంబరు 2న.. అంటే 42 రోజుల తర్వాత ఈ లెటర్ రాకతో ఇంటా బయటా చర్చ మొదలైంది. పైగా.. డిసెంబరు 5న ఆ లేఖను కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ(రామగుండం) వెంకటేశ్వర్లు.. తదుపరి చర్యలు తీసుకోండంటూ కింది అధికారులకు పంపటం, ఈ రిపేరు పనికి కనీసం రూ.500 కోట్ల వరకు ఖర్చు కావొచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా అంచనా వేయటం పలు అనుమానాలకు తావిచ్చింది.

ఎల్ అండ్ టీ లేఖలోని అంశాలు

చేసిన పనికి తగ్గట్లుగా బిల్లు చెల్లించే పద్ధతి (నాన్‌ ఈపీసీ)లో ఈ ప్రాజెక్టు పని చేసేందుకు ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. నీటిపారుదల శాఖ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు పనిని 2018 ఆగస్టు 25 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, 2020 జూన్‌ 29 నాటికి పూర్తయింది. రూ.3,062.79 కోట్లకు ఒప్పందం జరగ్గా, టెండరు విలువ కంటే 2.7 శాతం ఎక్కువ కోట్‌ చేయడం, పెరిగిన ధరలు.. ఇలా అన్నీ పరిగణనలోకి తీసుకొని గుత్తేదారుకు రూ.3,348.24 కోట్లు చెల్లించారు.

ఆ ఒప్పందం మేరకు పని పూర్తయినట్లు 2021 మార్చి 15న సంబంధిత ఎస్‌ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అగ్రిమెంట్‌ ప్రకారం సివిల్‌ పనులకు డిఫెక్ట్‌ లయబిలిటీ పిరియడ్‌ (ఏదైనా నష్టం వాటిల్లితే బాధ్యత వహించే సమయం) 24 నెలలు. తాము 2020 జూన్‌ 29 నుంచి, 2022 జూన్‌ 29 వరకు డిఫెక్ట్‌ లయబిలిటీ పిరియడ్‌గా పేర్కొన్నామని, అధికారులు కూడా 2021 మార్చి 15న పని పూర్తయి స్వాధీనం చేసుకొన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని ఎల్ అండ్ టీ తన లేఖలో వివరించింది. పలు ఆధారాలనూ ఎల్ అండ్ టీ తన లేఖకు జతచేసింది.

ఈఎన్సీ నుంచి గత అక్టోబరు 25న, నవంబరు 25న వచ్చిన లేఖల ఆధారంగా కొత్త పని చేపట్టాలంటే మళ్లీ ప్రత్యేక ఒప్పందం ఉండాలని, ఇది కూడా ఇద్దరి మధ్య పరస్పర అవగాహనతో ఉండాలని ఎల్‌అండ్‌టీ పేర్కొంది. కాఫర్‌డ్యాం నిర్మాణానికి రూ.55.75 కోట్లు వ్యయమవుతుందని, ఇది కూడా జీఎస్టీ, సీనరేజి ఛార్జీలు కాకుండా అని తెలిపింది. నిర్మాణ సమయంలో మెటీరియల్‌ లభ్యత, ధరల పెరుగుదల కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.

పని పూర్తయినట్లు సంబంధిత ఇంజినీర్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన 2021 మార్చి 15వ తేదీని లెక్కలోకి తీసుకున్నా.. ఆ రోజు నుంచి 24 నెలలు అంటే.. 2023 మార్చి 15 వరకే కాంట్రాక్టరుకు మెయింటెనెన్స్ బాధ్యత ఉంటుంది. కానీ.. పిల్లర్ కూలింది 2023 అక్టోబరు 21. మరి.. అటు పునరుద్ధరణ బాధ్యత గుత్తేదారుదే అని నీటిపారుదల శాఖ ఎందుకు చెప్పింది? ఆ పని చేసే బాధ్యత మాదేనంటూ ఎల్ అండ్ ఎందుకు ప్రకటించింది? ఈ 42 రోజుల్లో ఏమేమి జరిగాయో తెలియాల్సి ఉంది.

తాజాగా రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డలో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం.. 2021లోనే బ్యారేజీకి కొన్ని సమస్యలు రాగా, వాటిని పట్టించుకోలేదని తేలింది. అంతేకాదు.. చివరి నిమిషం వరకు బ్యారేజీలో పిల్లర్ కుంగలేదనే నాటి ప్రభుత్వ పెద్దలు ప్రజలకు చెబుతూ వచ్చారు. నేటి నిపుణుల వివరణతో ఇన్ని రోజులుగా వారు చెప్పింది అబద్ధమని స్పష్టంగా తేలిపోయింది.

అంతేకాదు.. విజిలెన్స్ విభాగపు అధినేత రాజీవ్ రతన్ నేడు సీఎం రేవంత్ చేపట్టిన పర్యటనలో మరో బాంబు పేల్చారు. బ్యారేజీ నిర్వహణ గురించి గత రెండేళ్లుగా చర్యలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే.. ఇప్పుడు ఇదే టెక్నాలజీని వాడి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల, అన్నారంలోనూ ఇదే సమస్యలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×