EPAPER

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర సచివాయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, మంత్రి సీతక్క సహా ఇతర మంత్రులు, మాజీ ఎంపీ వీహెచ్, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్‌లో రెనెవేబుల్ ఎనర్జీకి సంబంధించిన మీటింగ్‌లో పాల్గొనడం వల్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మంచి కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన భట్టి విక్రమార్క.. అందరికీ అభినందనలు తెలిపారని వివరించారు.


రాజీవ్ విగ్రహ రూపకర్త రమణ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విగ్రహం చూస్తుంటే ఆయన ఇంకా సజీవంగా ఉన్నట్టుగా ఉన్నదని, బతికి వచ్చినట్టు అనిపిస్తున్నదని తెలిపారు. దేశం కోసం తల్లిని కోల్పోయాడని, తన ప్రాణాలనూ అర్పించాడని వివరించారు. కానీ, ఇవాళ పనికిరానివాళ్లు.. ఉద్యమంలో దొంగవేషాలు వేసిన వారు.. ఈ విగ్రహావిష్కరణను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. దేశాన్ని 21వ శతాబ్దికి తీసుకెళ్లిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని చెప్పడం అభ్యంతరకరం అని, కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఇన్నోవేటివ్ ఐడియాలు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే ఆలోచన ప్రత్యేకమైనదని తెలిపారు. నేరుగా గ్రామపంచాయతీలకు నిధులు రావాలని, అప్పుడే మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందని బలంగా నమ్మిన నాయకుడని వివరించారు. దేశాన్ని సమగ్రంగా ఉంచాలని కోరుతున్న సమయంలో బాంబుల వర్షానికి బలయ్యారన్నారు. రాజీవ్ గాంధీ మన మధ్య లేకున్నా ప్రతి ఒక్కరిలో ఉంటారని, విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలని వివరించారు.


Also Read: Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని వివరించారు. దేశం మత కలహాలు, పేదరికం, సంస్థానాలతో చీలికలు పీలికలుగా ఉన్న దేశానికి తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. సంస్థాలను దేశంలో విలీనం చేసి.. మత విద్వేషాలను ఎదుర్కొని శాంతి భద్రతలను నెలకొల్పడానికి నెహ్రూ.. ఒక దార్శనికతను ప్రదర్శించారని వివరించారు. వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ.. సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్‌ను కేంద్రం హోం శాఖ మంత్రిగా నియమించారని, దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి కృషి చేసిన నేత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని తెలిపారు.

బాక్రానంగల్ ప్రాజెక్టు నుంచి నాగార్జునా సాగర్ ప్రాజెక్టు వరకు సాగునీటి కోసం ప్రాజెక్టులు నిర్మాణాలను తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారని సీఎం వివరించారు. ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పి మేధోసంపత్తిని పెంపొందించడానికి కృషి చేసిన దార్శనికుడని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఏ పదవినీ తీసుకోలేదని వివరించారు. పేదల కోసం పని చేసిన ప్రధాని ఇందిరా గాంధీ అని, అందుకే ఆమె ఫొటో ఇప్పటికీ వారి ఇళ్లల్లో ఉంటాయని గుర్తు చేశారు. రాజభరణాలను రద్దు చేసి ఆ డబ్బులను పేదలకు పంచే నిర్ణయం తీసుకున్నారని, భూస్వాముల వద్దనున్న వేలాది ఎకరాలు ఉంటే.. పేదలు, బలహీనవర్గాలు వారి దగ్గర వెట్టి చాకిరి చేస్తుంటే.. వారి ఆత్మగౌరవం కోసం వేలాది ఎకరాల భూములను అసైన్డ్ పట్టాల పేరిట పేదలకు అందించారని వివరించారు.

గడీలలో గడ్డి మొలవాల్సిందేనని ఆనాడు చాకలి ఐలమ్మ చెప్పారని, ఆ స్పూర్తితో రాజీవ్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా, మీ ఫామ్ హౌస్‌లలో జిల్లెళ్లు మొలిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అప్పటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని అన్నారు.

దేశంలో రిజర్వేషన్లు తెచ్చి నిమ్న వర్గాలకు సమాన అవకాశాలు ఇచ్చే నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడి మేధావులు విదేశాల్లో ఉన్న రాజీవ్ గాంధీని రప్పించి ప్రధానిగా చేయాలని విజ్ఞప్తి చేశారని, ఆ విన్నపాలను ఆలకించి రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారని వివరించారు. అప్పుడు 21 ఏళ్ల వయసు నిండిన వారికి ఓటు హక్కు ఉండేదని, కానీ, ప్రపంచంతో పోటీ చేయాలంటే ఈ ఓటు హక్కు 18 ఏళ్లు నిండినవారికి ఉండాలని మార్పు రాజీవ్ గాంధీ చేశారని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఆయనదేనని, అందుకే ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధేనని పేర్కొన్నారు. కానీ, గత ప్రభుత్వం ఐదేళ్ల మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదని మండిపడ్డారు.

Also Read:  జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

ఇక్కడ అధికారంలోకి వచ్చి భూములు దురాక్రమణ చేసిన.. ప్రజా ధనం కొల్లగొట్టిన ఫామ్‌హౌజులు కట్టుకున్న వారు..  దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేసిన వారి పై ఆరోపణలు చేయడం దారుణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పార్టీ కోసం హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించిన కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే కూడా కనీసం వెళ్లి చివరి చూపు చూడలేదని ఫైర్ అయ్యారు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నామని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారని, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా తామేమైనా అడ్డుకున్నామా? పదేళ్లు వీళ్లేం చేశారు? అని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోవాలనే ఖాళీ ప్లేస్ పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. తాము డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు తాను అధికారులను ఆదేశించినట్టూ వివరించారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×