Teachers: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి విద్యా బోధన, వారి భవిష్యత్తును ఉజ్వలంగా రూపుదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల చేతిలో ఉన్నదని వివరించారు. అందుకే తెలంగాణ భవిష్యత్తు తమ చేతిలో కాదు.. ఉపాధ్యాయుల చేతిలో ఉన్నదని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. అందుకే తాము పదవీ బాధ్యతలు తీసుకున్న ఎల్బీ స్టేడియంలోనే ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ప్రొఫెసర్ కోదండరాం, అధికారులకు విజ్ఞప్తి చేశామని వివరించారు.
రాష్ట్ర ప్రజలు 30 వేల ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపి, వారి భవిష్యత్‌ను ఉపాధ్యాయుల చేతిలో పెట్టారని, వారి భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్ అని తెలిపారు. తెలంగాణ నిర్మాణం, జాతి నిర్మాణం కోసం ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి, రాష్ట్ర సాధనలో టీచర్ల పాత్ర విస్మరించలేనిదని, తెలంగాణ ఉద్యమం నిస్తేజ స్థితికి వెళ్లినప్పుడు పొలిటికల్ జేఏసీ బాధ్యతలు ప్రొఫెసర్ కోదండరాం తీసుకుని ముందుకు వెళ్లామని, వారు కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పినవారేనని తెలిపారు.
గ్రామాల్లో ప్రజలు తమ గౌరవం కోసమో.. పిల్లలకు మంచి చదువు వస్తుందనో ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితులను మార్చాలని, ఇందుకు ఉపాధ్యాయులు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపడం ఆత్మగౌరవంగా ప్రజలు భావించేలా మార్పు తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో 30 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో 26 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారని, అదే పది వేల పైచిలుకున్న ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల విద్యార్థులు చదువుతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు గతేడాది కంటే 2 లక్షలు తగ్గాయని తెలిపారు. అందుకే తాము విద్యా శాఖను పటిష్టం చేయాలని, పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే నిర్ణయంతో బడ్జెట్ కేటాయింపులు పెంచామనపి వివరించారు. ఈ ఏడాది రూ. 21 వేల కోట్లు విద్యకు నిధులు కేటాయించామని పేర్కొన్నారు.
Also Read: రొమాంటిక్ మూడ్‌లో ‘మిస్టర్ బచ్చన్’.. జిక్కి సాంగ్ అదరిపోయిందంతే..
అదే విధంగా విద్యా శాఖకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు ప్రకటించారు. ప్రతి పాఠశాలకు పారిశుధ్య కార్మికులను అపాయింట్‌మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు పేదలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నప్పుడు పాఠశాలలకు ఎందుకు ఇవ్వొద్దని ఆలోచించామని, పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే తాను ఈ స్థాయికి వచ్చానని, అందుకే ప్రభుత్వ ఉపాధ్యాయులను తాను సంపూర్ణంగా విశ్వసిస్తానని సీఎం వివరించారు. కేజ్రీవాల్ విద్యా వ్యవస్థను మెరుగుపరచడం వల్లే మూడు సార్లు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ‘మళ్లొక్కసారి నన్ను ఇక్కడ చూడాలంటే.. మళ్లీ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రావాలంటే మీరు పని చేయాలి. పేదలు ఆత్మగౌరవంతో బతకాలంటే.. దొరల గడీల నుంచి దూరం ఉండాలంటే మీరు పని చేయాలి. పేద పిల్లలకు మంచి చదువులు చెప్పాలి. నా బాధ్యత మీదే. మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. మిమ్మల్ని మేం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కంటే తెలంగాణ వచ్చాక ఉద్యోగుల పరిస్థితులు దిగజారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘బాషా పండిట్లకు 20 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు. మిగిలినవారికి 10 నుంచి 15 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేవు. మా జీవిత కాలంలో ఒక్కసారైనా ప్రమోషన్ చూస్తామా? అని ఉపాధ్యాయుల్లో ఆందోళన ఉన్నదని తెలుసు’ అని సీఎం తెలిపారు. అందుకే తాము ప్రమోషన్లు ఇచ్చామని వివరించారు.