EPAPER

CM Revanth Reddy: బిజీబిజీగా సీఎం ఢిల్లీ టూర్

CM Revanth Reddy: బిజీబిజీగా సీఎం ఢిల్లీ టూర్

– ఏఐసీసీ పెద్దలతో కీలక చర్చలు
– కొలిక్కి వచ్చేసిన పీసీసీ చీఫ్ ఎంపిక
– కేబినెట్‌ విస్తరణ మీదా క్లారిటీ
– నామినేటెడ్ పదవులకూ పచ్చజెండా
– పలువురు కేంద్రమంత్రులతో భేటీ
– టీ ఫైబర్‌పై సింధియాతో చర్చలు
– స్పోర్ట్ వర్సిటీకి నిధులకై మన్‌సుఖ్‌కు వినతి
– జాతీయ స్థాయి గేమ్స్ నిర్వహణపై ప్రతిపాదనలు
– పార్టీ, ప్రభుత్వ పనుల సమన్వయంలో సీఎం


Revanth Reddy Delhi Tour updates(Today news in telangana): సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. శుక్రవారం ఉదయం పార్టీ, ప్రభుత్వ పరమైన పలు కీలక అంశాలపై ఏఐసీసీ నేతలతో చర్చించిన సీఎం, సాయంత్రం పలువురు కేంద్రమంత్రులను కలిసి ఆయా శాఖలకు సంబంధించిన పలు రాష్ట్ర ప్రతిపాదనలను అందజేసి కీలక హామీలను పొందే ప్రయత్నం చేశారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కులగణన, వరంగల్ రైతు కృతజ్ఞత సభ వంటి అంశాలపై పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి చర్చించినట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా సీఎంతో బాటు ఆయా కార్యక్రమాలకు హాజరయ్యారు.

పార్టీ పెద్దలతో భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్‌తో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నూతన పీసీసీ ఎంపిక, క్యాబినెట్ విస్తరణ, వరంగల్లో సభ నిర్వహించే అంశాలపై రాహుల్ గాంధీ తదితరులతో సీఎం చర్చించిన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎంతో బాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.


పీసీసీ పదవిపై ఏకాభిప్రాయం
పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ సమావేశంలో లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాస్కీగౌడ్, ఎస్సీల నుంచి సంపత్‌కుమార్, లక్ష్మణ్‌కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాంనాయక్‌ల పేర్లను అధిష్ఠానం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్‌కుమార్‌కు, ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాంనాయక్‌కు, బీసీలకైతే మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఎక్కువ అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నేటి సమావేశంలో మహేష్‌కుమార్‌ గౌడ్‌ పేరుపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Telangana: అక్షర శరథి.. మన దాశరథి..!

కేబినెట్, నామినేటెడ్ పోస్టులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన నాటి నుంచి మంత్రి వర్గ విస్తరణ జరగని సంగతి తెలిసిందే. కాగా, దీనిపై గతంలోనూ సీఎం ఢిల్లీ పెద్దలతో పలుమార్లు చర్చించారు. అయితే, అప్పట్లో లోక్‌సభ ఎన్నికలు, తర్వాత ఆషాడం రావటంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. కాగా, ఇప్పుడు కేబినెట్ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి తన ఆలోచనలను పార్టీ పెద్దల ముందు ఉంచారని, మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం నలుగురికి చోటు కల్పించనున్నారని, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డికి ఈసారి బెర్త్ ఖాయమని, ఆదిలాబాద్ కోటా నుంచి ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. అలాగే, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల ప్రకటన కూడా వీలున్నంత త్వరగా జరగనుందని తెలుస్తోంది.

సింధియాతో భేటీ..
అలాగే, శుక్రవారం సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి సీఎం రేవంత్.. కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాని కలిశారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణలోని గ్రామాలు, మండలాలకు నెట్ సేవలను విస్తరించటం, 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడమే టీ ఫైబర్ లక్ష్యం అని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు దీనిద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నెలకు రూ.300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ- ఎడ్యుకేషన్ సేవలు అందించబోతున్నట్లు తెలిపారు. టీ-ఫైబర్ అమలుకు ఎన్ఎఫ్ ఓఎన్ సహకారం అవసరం అని, అందువల్ల భారత్ నెట్ పథకాన్ని టీ-ఫైబర్ కు వర్తింపజేసి టీ ఫైబర్ కు రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్‌ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వ‌ర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని, అలాగే, ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డీపీఆర్ ను ఆమోదించాలని సింధియాకు విజ్ఞప్తి చేశారు.

Also Read: Modi Ukraine Visit: ఉక్రెయిన్ లో మోదీ పర్యటన.. దాని వెనుక పెద్ద కథే ఉందని మీకు తెలుసా ?

గేమ్స్ నిర్వహణకు ఛాన్స్
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడా, యువ‌జ‌న వ్యవహారాల శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌తో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో కలసి తెలంగాణలో క్రీడాభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై చర్చించారు. 2002లో నేషనల్ గేమ్స్, 2003లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్, 2007లో ప్రపంచ మిలటరీ గేమ్స్ హైదరాబాద్ లో నిర్వహించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నగరంలో స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, అంత‌ర్జాతీయ‌ ప్రమాణాలతో కూడిన ఈత కొల‌నులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, సింథ‌టిక్ అథ్లెటిక్ ట్రాక్స్, ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌, స్కేటింగ్ ట్రాక్స్‌, వాట‌ర్ స్పోర్ట్స్‌, ఇత‌ర క్రీడ‌ల‌కు వ‌స‌తులు ఉన్నాయ‌ని గుర్తుచేశారు. అందువల్ల భవిష్యత్ లో జరగబోయే కీలకమైన గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని కోరారు. ముఖ్యంగా 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హైదరాబాద్ లో నిర్వహించే ఛాన్స్ కల్పించాలన్నారు.

స్పోర్ట్స్ వర్సిటీకి నిధులు
తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడలకు సంబంధించిన అన్ని రకాల శిక్షణ, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని అందువల్ల ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి కేంద్రం తరపున అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని మంత్రిని కోరారు. రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద విడుదల చేసే నిధుల మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీఎంసీ బాలయోగి స్టేడియం, షూటింగ్ రేంజ్, ఎల్బీ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అప్ గ్రేడేషన్ కు సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించాలని కోరారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×