EPAPER

CM KCR : గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతారా? కారణాలివేనా?

CM KCR : గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతారా? కారణాలివేనా?

CM KCR : తెలంగాణ రాష్ట్రమంతా ఒక ప్రచారమైతే నడుస్తోంది. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట ఈ మూడింటినే అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రాన్ని వదిలేశారు. ఇక్కడ డబ్బులన్నీ తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారు. మేం మనుషులం కాదా? అని ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.


ఎప్పటిలాగే గజ్వేల్ నుంచి కేసీఆర్ ఒక లక్ష ఓట్లకు తగ్గకుండా మెజార్టీతో గెలుస్తాడని అనుకున్నారు. కానీ ఆయన ఎవరూహించని విధంగా కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగుతున్నారు. ఇంత అభివృద్ధి చేసిన గజ్వేల్ ను వదిలి అటెందుకు వెళుతున్నారు? ఇక్కడ ఓడిపోతారని భయపడుతున్నారా? సమస్యేమిటి? అని ఆరా తీస్తే, అసలు విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. మరి అవేమిటో చూసేద్దాం.

గజ్వేల్ నియోజకవర్గంలో బీడు పడ్డ పొలాలను సస్యశ్యామలం చేస్తామంటూ 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ కు నీరందించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ములుగు మండలంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేపట్టి 15 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేలా చూశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.


కానీ జలాశయం కోసమని భూమిని తీసుకున్న నిర్వాసితులకు నష్టపరిహారం అరకొరగా ఇచ్చారు. దీంతో వారందరూ రోడ్డున పడ్డారు. అటు నమ్ముకున్న భూమి పోయింది. ఇటు నమ్మిన కేసీఆర్ నట్టేట ముంచాడని కారాలు మిరియాలు నూరుతున్నారు. సీఎం కేసీఆర్ కాదు, ఎవరొచ్చినా గ్రామాల్లోకి రానివ్వమని హెచ్చరిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ నేతల్లో కలవరం పుట్టిస్తోంది.

ఈ నేపథ్యంలో భూమి కోల్పోయిన రైతులు ఆందోళన బాట పట్టారు. మేం జలాశయం కోసం భూములిస్తే, వాటిని ప్రైవేటు కంపెనీలకి ధారాదత్తం చేస్తున్నారని అసలు విషయాలు బయట పెడుతున్నారు. పేదోడి దగ్గర తీసుకొని, పెత్తందార్లకు పెడతారా? అని కోపంతో ఊగిపోతున్నారు. అయితే ప్రాజెక్టు కోసం వాడండి, లేదంటే మా భూమి మాకిచ్చేయండి అని గొడవ చేస్తున్నారు. మరోవైపు నుంచి అవసరానికి మించి ప్రజల దగ్గర నుంచి భూములను సేకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక ఇందులో పెద్ద మతలబు ఏమిటంటే,  ప్రాజెక్టు పేరు చెప్పి ప్రభుత్వం సేకరించిన భూములను బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖులుగా చెలామణీలో ఉన్న వారికే అప్పగించారనే విమర్శలు పబ్లిక్ గానే వినిపిస్తున్నాయి. ఎవడెవడో డబ్బులున్నవాడి కోసం, తరతరాలుగా వస్తున్న తమ భూములను అప్పనంగా ఇవ్వలేమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు చెప్పిందొకటి, ఇక్కడ జరుగుతున్నదొకటి, ఇది అన్యాయమని నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇలా జరిగితే ఇక మాకు దిక్కెవరని వాపోతున్నారు. భూములు సస్యశ్యామలమయ్యే మాట దేవుడెరుగు.. నష్టపరిహారం అందడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఇలా భూములు కోల్పోయిన వందలాదిమంది రైతులు అడ్డా మీద కూలీలుగా మారిపోవాల్సిందని కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇక్కడే గజ్వేల్ లో వేడి మొదలైంది. సీఎం కేసీఆర్ కు ఆపోజిట్ గా ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో చెరకు రైతులు ఉన్నారు. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఉన్నారు .ఇలా అంతా కలిశారు. కేసీఆర్ పై పోటీకి దిగారు.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కుమార్తె కవితకు జరిగిన పరాభవమే గజ్వేల్ లో కూడా జరుగుతుందనే భయంతోనే సేఫ్ సైడ్ కామారెడ్డిలో కేసీఆర్ మరో నామినేషన్ వేశారని అంటున్నారు. ఇక్కడో ట్విస్ట్ ఏమిటంటే కొన్నిచోట్ల గ్రామాల్లోకి వెళ్లాలంటే స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో పార్టీ పెద్దలు ఉన్నారట. రేపటి ఎన్నికల్లో ఇదెటు టర్న్ తీసుకుంటోందని నాయకులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×