EPAPER

Chit Fund: చీటింగ్.. చిట్ ఫండ్స్

Chit Fund: చీటింగ్.. చిట్ ఫండ్స్
  •  వరంగల్ కేంద్రంగా వెలిసిన 300 చిట్ సంస్థలు
  • రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా బ్రాంచీలు
  • చిట్టీ సమయం అయిపోయినా డబ్బులివ్వకుండా వేధింపులు
  • రూ.వేల కోట్లతో బోర్డు తిప్పేస్తున్న కంపెనీలు
  • ఉన్నదంతా పోయి లబోదిబోమంటున్న బాధితులు
  • రోజుల తరబడి చిట్ ఫండ్స్ ఆఫీసుల ముందు ఆందోళనలు
  • కౌన్సెలింగ్, చీటింగ్ కేసులతో సరిపెడుతున్న పోలీసులు

వరంగల్, స్వేచ్ఛ: కాయ కష్టం చేసి పైసా పైసా పోగేసిన డబ్బులు, తమ పిల్లల ఉన్నత చదువులకో, పెండ్లికో, ఇల్లు కట్టుకోవడానికో, భూమి కొనుగోలు చేసేందుకో ఉపయోగపడతాయని ఆశపడి చిట్టీలు వేస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలను చిట్ ఫండ్స్ సంస్థలు నిలువునా ముంచుతున్నాయి. చిట్టీలు, డిపాజిట్ల రూపంలో సేకరించిన రూ.వేల కోట్లను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టి విలువైన భూములు కొనుగోలు చేసి కస్టమర్లకు మొండి చెయ్యి చూపిస్తున్న ఘటనలు ఈమధ్య ఎక్కువయ్యాయి. చిట్టీ కాల పరిమితి అయినా కూడా కస్టమర్లకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నాయి. వరంగల్ కేంద్రంగా 300 పైగా చిట్ ఫండ్స్ కంపెనీలు ఏర్పాటై రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయి. ఇందులో అనేక కార్యాలయాలు రోజూ వచ్చిపోయే, ఆందోళన చేసే బాధితులతోనే కనిపిస్తున్నాయి. చిట్ ఫండ్ సంస్థల నిర్వహకులు పాలిటికల్ అండ ఉన్నోళ్లు కావడంతో బాధితుల గోడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. నియంత్రణ, పరిశీలన లేని గత ప్రభుత్వ విధానాలు ఆనాటి ప్రభుత్వ పెద్దల అండతో చిట్ ఫండ్స్ వ్యాపారులు విచ్చలవిడిగా రెచ్చిపోయి కస్టమర్లను చీట్ చేశారు.


చిట్ ఫండ్ సంస్థలు ఆడిందే ఆట

భవిష్యత్ అవసరాల కోసం కడుపు కట్టుకుని చిట్టీ కట్టిన డబ్బులు సమయం అయిపోయినా రాకపోవడంతో బాధితులు కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా వ్యాపారులు కనికరం చూపడం లేదు. కస్టమర్ల చిట్టి, డిపాజిట్ డబ్బులతో భూములు కొని రియల్ ఎస్టేట్స్ వ్యాపారం సాగిస్తున్నారు. అకౌంట్లలో డబ్బులు లేకున్నా ఉత్తుత్తి చెక్కులిచ్చి గడువుల మీద గడువులు పెట్టి కస్టమర్లను తిప్పుకుంటున్నారు. తిరిగి తిరిగి విసిగిపోయిన వారికి చివరికి డబ్బులకు బదులుగా తమ వెంచర్లలో ప్లాట్లు తీసుకోవాలని, లేదంటే మీ ఇష్టమున్నట్లు చేసుకొమ్మంటూ దబాయిస్తూ వారికి వచ్చే డబ్బుల విలువ లేని భూమిని అంటగడుతున్నారు.


దాడులకు తెగబడుతున్నా దిక్కు లేదు

చిట్ ఫండ్ సంస్థలు చేస్తున్న మోసాలు వేధింపుల బారి నుంచి కస్టమర్లను పట్టించుకునే వారే లేకుండా పోయారు. సంస్థలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వాటి నిర్వహణ, నియంత్రణపై దృష్టి పెట్టకపోవడంతో ఇష్టారాజ్యంగా నడుస్తోంది. కేవలం బాధితుల ఫిర్యాదులు తీసుకోవడానికే పోలీసులు పరిమితమవుతున్నారు. మహా అయితే కొన్ని చీటింగ్ కేసులతో చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఏంచేయాలో తెలియక కుమిలిపోతున్నారు. వరంగల్ సీపీగా తరుణ్ జోషి పని చేసిన సమయంలో చిట్ ఫండ్ మోసాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తుండడంతో గ్రేటర్ వరంగల్ కేంద్రంగా నడిచే సంస్థలపై విచారణ చేయించారు. ఇందులో శుభనందిని, అచల, అక్షర, భవితశ్రీ, కనకదుర్గ లాంటి దాదాపు 10 కంపెనీల్లో బాధితులు ఎక్కువున్నట్లు గుర్తించారు.

వరంగల్ చుట్టూ తిరుగుతున్న బాధితులు

వరంగల్ కేంద్రంగా మెజారిటీ చిట్ ఫండ్ సంస్థలు బిజినెస్ చేస్తున్నాయి. జిల్లాల్లో అందుబాటులో ఉండే మేనేజర్లు, ఏజెంట్లతో రూ.వందల కోట్లను చిట్స్, డిపాజిట్ల రూపంలో సేకరించాయి. గడువు ముగిసినోళ్లు డబ్బుల కోసం గ్రేటర్ వరంగల్‌లోని బ్రాంచీల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి వరంగల్‌లోని చిట్ ఫండ్స్ హెడ్ ఆఫీసులకు వస్తున్నారు. మేనేజ్మెంట్‌ను కలిసి తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగితే డబ్బులు అడ్జస్ట్ చేయలేమని, ఉమ్మడి వరంగల్ చుట్టూ తాము వేసిన వెంచర్లలో ప్లాట్లు తీసుకోవాలని కోరుతున్నారు. ప్లాట్ నిరాకరించిన వారిని రేపు మాపంటూ తిప్పుకుంటూ సతాయిస్తున్నారు. దీంతో బాధితులు చిట్ ఫండ్స్ ముందే ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు.

నిబంధనలు గాలికి

చిట్ ఫండ్ సంస్థలు చిట్టికి గ్యారంటీ చూపాల్సి ఉండగా, సంస్థలు తక్కువ వాల్యూ చూపుతున్నాయి. ‘చిట్ ఫండ్ రూల్స్’కు విరుద్ధంగా ఒకే ప్రాపర్టీని ఇతర గ్రూప్‌కు చూపుతున్నారు. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం మూలంగానే వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఫైనాన్షియల్ లావాదేవీలు, బ్యాంకింగ్ కార్డులు, చెక్కుల స్టేటస్ చూడాల్సిన రిజిస్ట్రేషన్ అధికారులు లైట్ తీసుకుంటున్నారు.

ఎంతకైనా తెగిస్తారు

చిట్టీ డబ్బులు అడిగినందుకు గతంలో హనుమకొండ చౌరస్తాలో సెల్ ఫోన్ షాప్ నడుపుకునే పిట్టల రాజు దంపతులపై అచల సంస్థ ఏజెంట్ గొడుగు గణేశ్ పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో రాజు చనిపోగా, అతడి భార్య సిరి, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిట్టీ డబ్బులు చెల్లించకపోవడంతో కనకదుర్గ చిట్ ఫండ్ మేనేజర్ నల్ల భాస్కర్‌ను కస్టమర్లు నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన మేనేజర్ 2024 జనవరిలో హరిత హోటల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బులు అడిగితే రౌడీలతో దాడి చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల హన్మకొండ నక్కలగుట్టలోని అక్షర చిట్ ఫండ్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. అయినా స్పందించే వారు లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించి చిట్ ఫండ్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Related News

Mallanna Sagar Land: రోడ్డెక్కిన మల్లన్న సాగర్ బాధితులు.. హరీష్ రావుకు వార్నింగ్

Bhatti Vikramarka: పవర్ కట్ సమస్యలకు క్షణాల్లో పరిష్కారం.. విద్యుత్ అంబులెన్స్‌‌లు ఇలా పనిచేస్తాయ్!

Group 1 Mains: గ్రూప్‌- 1 మెయిన్స్‌ పరీక్ష ప్రశాంతం.. అన్ని కేంద్రాల్లో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్

TGPSC Group 1 Mains: ఎగ్జామ్ హాల్ లోపలికి పంపలేదని.. గోడ దూకిన గ్రూపు 1 అభ్యర్ధి.. చివరికి ఏం అయిందంటే..

MLA Kadiyam Srihari : అలా చెప్పినందుకే.. నన్ను పక్కన పెట్టేశారు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

Brs Working President KTR : విద్యుత్ ఛార్జీల మోతకు మేం వ్యతిరేకం, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌’ను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్

Big Stories

×