EPAPER
Kirrak Couples Episode 1

Chandrababu: తెలంగాణపై బాబు లెక్కేంటి? ఖమ్మంపైనే అందరి ఫోకస్ ఏంటి?

Chandrababu: తెలంగాణపై బాబు లెక్కేంటి? ఖమ్మంపైనే అందరి ఫోకస్ ఏంటి?

Chandrababu : ఏపీ విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రమంగా శిథిలమైంది. రాష్ట్రంలో దాదాపు ఉనికిని కోల్పోయింది. చాలా మంది నేతలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. మరికొందరు నేతలు కాంగ్రెస్ , బీజేపీల్లో చేరిపోయారు. ఇక పార్టీలో కాస్త పేరున్న నేత ఒక్కరూ కూడా తెలంగాణలో లేరనేది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీకి మళ్లీ జీవం పోసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. తెలంగాణలో పార్టీకి జవసత్వాలు తేవాలని సంకల్పించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లిన చంద్రబాబుకు కార్యకర్తలు భారీగా స్వాగతం పలికి ఉత్సాహాన్ని అందించారు.


ఇటీవల తెలంగాణలో టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ను నియమించారు. అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులకు పార్టీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. ఒకప్పుడు తెలంగాణలో టీడీపీ చాలా బలంగా ఉండేది. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత మొదటి టీడీపీ నుంచే టీఆర్ఎస్ లోకి వలసలు మొదలయ్యాయి. ఉద్యమం పతాక స్థాయికి చేరుకునే సమయానికి చాలా మంది నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ అప్పటికీ టీడీపీలో బలమైన నేతలు కొందరు ఉన్నారు. అయితే ఏపీ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాలకే పరిమితం అయ్యింది. కానీ గెలిచిన స్థానాల్లో ఎక్కువ హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీకి ఈ ప్రాంతాల్లో పట్టు సడలిలేదు. అయితే ఆ తర్వాత రాజకీయపరిణామాలు మారిపోయాయి. టీడీపీలో బలంగా ఉన్న నేతలు టీఆర్ఎస్ లో చేరడంతో పూర్తిగా బలహీనపడింది. 2014 గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది కారు ఎక్కేశారు. దీంతో 2018 ఎన్నికల్లో టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. 2018 ఎన్నికల తర్వాత మిగిలిన బలమైన నేతలు పార్టీని వీడారు. చాలా కాలం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ గులాబీ కుండువా కప్పుకోవడంతో తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఉనికిని కోల్పోయింది.

మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఇప్పుడు గులాబీ బాస్ టార్గెట్ ఢిల్లీపైనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. బీజేపీ అధికారం కోసం గట్టిగా పోరాడుతోంది. ఇదే అదునుగా తెలంగాణలో మళ్లీ పార్టీకి పూర్వవైభవంగా తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం నుంచే పని మొదలుపెట్టారు. మరి 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీకి దిగుతుందా? లేకపోతే ఏ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకుంటుందా ? అంటే చంద్రబాబు కచ్చితంగా పొత్తుల కోసం బలంగానే ప్రయత్నం చేస్తారు. పార్టీ బలంగా ఉన్న ఏపీలోనే బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటిది పార్టీ నామరూపాలు లేకుండా పోయిన తెలంగాణలో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయరు.


పొత్తుల విషయంలో చంద్రబాబుకు ఉన్న మొదటి ఆఫ్షన్ బీజేపీ. ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే.. తెలంగాణలోనూ అదే కొనసాగుతుంది. అయితే తెలంగాణలో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని రాష్ట్ర పార్టీ నేతలు చెబుతున్నారు. హైకమాండ్ ఓకే అంటే వాళ్లు ఏమీ చేయలేరు. ఇక రెండో ఆఫ్షన్ చంద్రబాబు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఇది ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడలేదు కానీ నెగిటివ్ గా మారింది. కాంగ్రెస్ కు ఉన్న కాస్త అవకాశాలను దెబ్బతీసింది. మరి ఈసారి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించినా ఆ పార్టీ అందుకు సిద్ధంగా ఉంటుందనేది అనుమానమే. ఇక జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ తో చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఏపీలో ఆ ప్రభావం పడుతుందనే భయం బాబుకు ఉండవచ్చు. అలాగే టీడీపీని పునాదుల్లోంచి పెకిలించిన కేసీఆర్ పొత్తుకు ఆసక్తి చూపే అవకాశంలేదనే చెప్పాలి. మళ్లీ టీడీపీకి పునర్జీవం పోసే అవకాశాన్ని కేసీఆర్ లాంటి నేతలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు.

సో తెలంగాణలో టీడీపీ అయితే బీజేపీతో కలిసి పోటీ చేయాలి లేదంటే ఒంటరిగా బరిలోకి దిగాల్సిందే. ప్రస్తుతానికి తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తర్వాతే టీడీపీకి స్థానం. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగాపోటీ పడాలంటే బలమైన అభ్యర్థులు దొరకాలి. మరి టీడీపీలో చేరేందుకు నేతలెవరైనా సిద్ధంగా ఉన్నారంటే…ప్రస్తుతానికైతే ఎవరూ కనిపించడంలేదు. మరి ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ పొలిటికల్ రహదారిపై సైకిల్ ను బాబు ఎలా తొక్కుతారో చూడాలి మరి.

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రతో చాలా ప్రాంతాలను చుట్టేశారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యమంటూ ఆమె ముందుకుసాగుతున్నారు. షర్మిల కూడా ఖమ్మం జిల్లాపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ సీపీ 3 అసెంబ్లీ స్థానాలతోపాటు ఖమ్మం పార్లమెంట్ ను కైవసం చేసుకుంది. ఆ ఓటర్లు ఇప్పుడు వైఎస్ఆర్ టీపీని ఆదరిస్తారని షర్మిల విశ్వాసంతో ఉన్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర విభజన తర్వాత కారు ముందుకు కదలలేకపోయింది. అయితే 2018 ఎన్నికల నాటికి సీన్ పూర్తిగా మారిపోయింది. టీడీపీ నుంచి బలమైన నేతలు టీఆర్ఎస్ లో చేరడంతో కారు జోరుగా దూసుకెళ్లింది. మరి ఖమ్మం జిల్లాలో కారు స్పీడ్ కు చంద్రబాబు, షర్మిల బ్రేకులు వేస్తారా? లేక ఓట్ల చీలికతో గులాబీ పార్టీకి మరింత లబ్ధి చేకూర్చుతారా చూడాలి మరి.

Related News

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Death of Nasralla: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

Big Stories

×