caste census :
⦿ సామాజిక సాధికారతకే ఈ యత్నం
⦿ గాంధీ కుటుంబం మాటంటే అంతే..
⦿ రాహుల్‌ని ప్రధాని చేయనున్న కులగణన
⦿ దీని సమన్వయానికి జిల్లాకో అబ్జర్వర్
⦿ కేడర్ అంతా కలిసి దీనిని సక్సెస్ చేయాలి
⦿ కార్యకర్తలే నా బలం.. నేనూ మీలో ఒకడినే
⦿ సీఎంగా ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదు
⦿ పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు
⦿ పది నెలల్లో ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం
⦿ కులగణన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, స్వేచ్ఛ: గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు ఇచ్చిన హామీ మేరకే తెలంగాణలో కులగణనను నిర్వహిస్తున్నామని, సామాజిక సాధికారత కోసమే దీనిని చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం గాంధీ భవన్‌లో కులగణనపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాధ్యత అని, అందుకే యావత్ కాంగ్రెస్ యంత్రాంగం కులగణనను విజయవంతమయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు.
వారి మాట శాసనమే..
తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అప్పట్లో ఎన్నో రకాల రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి, ఇక్కడి ప్రజల కలను సాకారం చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ, సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ఇక్కడి సమాజానికి వాగ్దానం చేశారు. వారు మాటిస్తే, హరిహరాదులు అడ్డువచ్చినా అది నెరవేరి తీరుతుందని వ్యాఖ్యానించారు. కులగణన అంశం విజయవంతంగా అమలు కావటానికి ఈ నెలాఖరు వరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిజం చేస్తూ, ఇప్పటికే రైతు రుణమాఫీని అమలు చేశామని గుర్తుచేశారు.
జిల్లాకో అబ్జర్వర్..
కులగణన కార్యక్రమం విజయవంతం చేసేందుకు పార్టీ తరపున జిల్లాకు ఒక పరిశీలకుడిని నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎలా పనిచేస్తున్నారనేది ఈ పరిశీలకులంతా తమ జిల్లాలలో గ్రామ స్థాయి నుంచి సమన్వయం చేసుకుంటారని తెలిపారు. మొత్తం 33 జిల్లాలలో ఈ కార్యక్రమం సమాంతరంగా జరగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాధ్యతగా పనిచేసిన ప్రతి కార్యకర్త కష్టాన్ని పార్టీ గుర్తించి, గౌరవిస్తుందని ప్రకటించారు. నవంబరు నెలాఖరు నాటికి కులగణను విజయవంతంగా పూర్తి చేసి, తెలంగాణ నుంచి మోదీ మీద భవిష్యత్ రాజకీయ పోరాటానికి కేడర్ సిద్ధం కావాల్సి ఉందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కుల గణనపై తెలంగాణ మోడల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.
మీరే నా బలం..
కాంగ్రెస్ కార్యకర్తలే తన బలమని, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏమీ లేదని సీఎం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నిరంకుశ పాలనపై ప్రతి కార్యకర్తా.. సింహంలా పోరాడబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అందరూ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన కులగణన హామీని అమలు చేయాలని , ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదని, ఈ విషయంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా పార్టీ సహించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నిరంజన్‌ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించి, చిత్తశుద్ధితో ఇచ్చిన హామీని అమలుచేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ‘ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప… వ్యక్తిగత అజెండాతో పనిచేయడు. ప్రతిపక్షాల కుట్రలను ప్రతి కార్యకర్తా ఆధారాలతో సహా తిప్పికొట్టాలి’ అని రేవంత్ పేర్కొన్నారు.
ఇది దేశానికే దిక్సూచి..
కులగణన తెలంగాణ వాస్తవిక సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని అంచనా వేసే ఎక్స్ రే వంటిది మాత్రమే కాదని, ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదని సీఎం అభివర్ణించారు. తెలంగాణ వనరులను అన్ని వర్గాలకు అందేలా చేసి, సామాజిక సాధికారతను సాధించటమే దీని అసలు లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కేంద్రం చేపట్టే జనగణనలో ఈ తెలంగాణ కులగణన నమూనా ఒక మోడల్‌గా నిలవనుందని, ప్రస్తుత కులగణన డాక్యుమెంట్‌ను కేంద్రానికి కూడా పంపుతామని తెలిపారు.
పార్టీ లైన్ దాటొద్దు
కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలనే టీపీసీసీ అమలు చేస్తోందని ఈ క్రమంలో పలు అంశాలపై పార్టీ నిర్ణయాలను కాదని నేతలెవరూ మాట్లాడవద్దని, అలాంటి వ్యాఖ్యలు చేసే నేతలను పార్టీ ఉపేక్షించబోదని సీఎం హెచ్చరించారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల్లో నేతల వ్యాఖ్యలతో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందని ఆయన గుర్తుచేశారు. మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
విపక్షాల కుట్రలను ఛేదిస్తాం
ఈ పదినెలల కాలంలో ప్రభుత్వం తలపెట్టిన అనేక పనులను అడ్డుకునేందుకు విపక్షాలు కుట్రపన్నాయని, అయినా, వాటిని ఛేదించి డీఎస్సీ పరీక్షను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించి, ఉద్యోగ నియామక పత్రాలనూ అందించామని గుర్తుచేశారు. గత 10 నెలల్లో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షనూ నిర్వహించామని తెలిపారు. గుప్పెడు అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారనే దుర్మార్గపు వాదనను విపక్ష పార్టీలు చేశాయని, మెయిన్స్‌కు ఎంపికైన 31,383 మందిలో 10శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాల వారు ఉన్నారని వివరించారు. మెయిన్స్‌కు ఎంపికైన వారిలో 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారని లెక్క చెప్పారు.
‘నీ చదువు పూచీ.. నాదీ’
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో శ్రమించి నీట్‌లో క్వాలిఫై అయి, మంచిర్యాల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించి, ఫీజు కట్టేందుకు డబ్బులేక బాధపడుతున్న ఓ గిరిజన బాలికకు ఆపన్న హస్తం అందించారు. కొమురం భీం జిల్లా జూనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయి శ్రద్ధ డాక్టర్ కోర్సులో చేరేందుకు ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతోందని మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం రేవంత్ ఆమె కలను నెరవేర్చే బాధ్యతను ప్రజాప్రభుత్వం స్వీకరిస్తుందని ప్రకటించారు. అంతేగాక, బాలిక కుటుంబానికి చెక్ రూపంలో ఆర్థిక సాయం కూడా అందజేశారు. తన చదువు విషయంలో సాక్షాత్ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని స్పందించటం పట్ల శ్రద్ధ సంతోషం వ్యక్తం చేయగా, ఆమె తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
దీపావళి శుభాకాంక్షలు
వెలుగులు పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత పదేండ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా, ప్రమాదాలకు తావులేకుండా చిన్నా పెద్దా ఈ పండుగ జరుపుకోవాలని సూచించారు.
పండగ పూట.. గుడ్ న్యూస్
దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2022 జులై 1 నుంచి వర్తిస్తుందని, నవంబరు జీతంతో కలిపి ఈ పెరిగిన డీఏ చెల్లిస్తామని తెలిపింది. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. అలాగే, తెలంగాణలోని 7,65,700 మంది గురుకులాలు, అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ క్రమంలో 3 – 7వ తరగతుల వారి ప్రస్తుత రూ.950గా డైట్ ఛార్జీలను రూ.1,330కి, రూ.55గా ఉన్న కాస్మోటిక్ ఛార్జీలను రూ.175కి పెంచారు. 8 – 10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1,540కి, వీరి కాస్మోటిక్ చార్జీలను రూ.75 నుంచి రూ.275కి పెంచారు. ఇంటర్ – పీజీ వారి ప్రస్తుత రూ.1,500 డైట్ ఛార్జీలను రూ.2,100కి పెంచారు.