Brs Socialmedia: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పుడు సొంత పార్టీపైనే తిరగబడుతుందా? సైనికులు అని చెప్పుకున్నవారే ఇప్పుడు ఆ పార్టీపై యుద్ధం ప్రకటిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి పార్టీలో. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరవాత పదే పదే సోషల్ మీడియా వారియర్స్ అంటూ తమ పార్టీ సోషల్ మీడియాను ముందు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై బూతులతో రెచ్చిపోతున్నవారికి లీగల్ సపోర్ట్ ఇస్తూ వారిని విడిపిస్తూ ప్రోత్సహిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే నిజానికి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకుంది లేదట.. కానీ అధికారం కోల్పోయిన తరవాత మాత్రం సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నారట. ఈ మాటలు మేం అంటున్నవి కాదు ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్సే మాట్లాడుకుంటున్న మాటలు. కొంతమంది అంతర్గతంగా దీనిపై ఫైట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఏకంగా బహిరంగంగానే పార్టీని, అందులోని నేతలను విమర్శించడం ఆశ్చర్యకరం.
ఇటీవల చోటు చేసుకున్న అనేక ఘటనలు సైతం అందుకు నిదర్శనమనే చెప్పుకోవచ్చు. ట్విటర్ స్పేస్ లో రీసెంట్ గా ముచ్చటించిన కొంతమంది కార్యకర్తలు కేటీఆర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు అర్బన్ కు, రూరల్ కు తేడా తెెలీదు అంటూ మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా హరీష్ రావును కేవలం మెదక్ జిల్లాకే పరిమితం చేస్తూ తొక్కేస్తున్నారని, కేటీఆర్ ఒక్కడే ముందుండాలని చూస్తున్నాడని మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఆడియో లీక్ అవ్వడంతో సొంతపార్టీపై ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అభిప్రాయమేంటనేది తేటతెల్లమైంది. మరోవైపు బీఆర్ఎస్ మహిళా కార్యకర్త ఆశ ప్రియ తనకు సొంతపార్టీ నేత తనను వేధిస్తున్నాడని బహిరంగ ప్రకటన చేసింది. పార్టీలో ఒక వెదవ ఉన్నాడని, వాడికి తప్ప ఎవరికి సపోర్ట్ చేసినా అడ్డమైన లింకులు పెట్టి నరకం చూపిస్తున్నాడని ఆరోపించింది.
ఓ రేంజ్ లో టార్చర్ చేస్తున్నాడని, ఈ రాజకీయాలు నా వల్ల కాదు, పార్టీకి కూడా నా సేవలు అవసరం లేదనిపిస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆశ ప్రియ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారడంతో ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే రంగంలోకి దిగి ఇమేజ్ డ్యామేజ్ చర్యలకు పూనుకున్నారు. ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి కూల్ చేశారు. దీంతో ఆశప్రియ తన నిర్ణయం మార్చుకున్నానని చెప్పారు. తాజాగా మరో బీఆర్ఎస్ కార్యకర్త గత ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పనిచేసిన కొంతం దిలీప్ పై సంచలన ఆరోపణలు చేశాడు. కేటీఆర్ సన్నిహితుడు అయిన దిలీప్ తన మిర్రర్ టీవీ ద్వారా బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారన్నారు. ఎంతో మంది బీఆర్ఎస్ కోసం సోషల్ మీడియాలో పనిచేస్తే డబ్బులు మాత్రం కొంతం దిలీప్ ఖాతాలోకే వెళ్లాయని చెప్పారు.
ఆయన వద్ద నుండి అతికొద్ది మంది ఓ సామాజిక వర్గానికి చెందినవారికే అందాయని ఆరోపించారు. కింది స్థాయిలో పనిచేసిన కార్యకర్తలు ఎవ్వరికీ డబ్బులు అందలేదని ఫ్యూచర్ లో కూడా అందుతాయో లేదో అన్నది ప్రశ్నర్థాకమేనని చెప్పారు. రీల్స్ చేసే వాళ్లకు డబ్బులు పంచి దిలీప్ పార్టీని నవ్వుల పాలు చేశారని అన్నారు. వేల మంది కార్యకర్తలు కష్టపడితే వందల కోట్లు దిలీప్ ఖాతాలోకి చేరాయని చెప్పారు. అతడితో పాటు మాజీ టెడ్ కో చైర్మన్ వైవీ సతీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తేనే పార్టీ బతుకుతుందని హితవుపలికారు. కేవలం వీళ్లు మాత్రమే కాకుండా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కమ్ బాధితులు బయటకు వస్తున్నారు. దీంతో సొంతపార్టీపైనే బీఆర్ఎస్ సోషల్ మీడియా యుద్దం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని నుండి ఆ పార్టీ ఎలా బయటపడుతుంది, బతికి బట్టకడుతుంది అనేది చూడాల్సి ఉంది.