EPAPER

BRS scams : అంతా స్కామ్ మయం.. ఈ పాలనంతా స్కామ్ మయం..

BRS scams : అంతా స్కామ్ మయం.. ఈ పాలనంతా స్కామ్ మయం..

BRS scams : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలన అంతా కుంభకోణాల మయమేనా? పథకాలు, పనుల పేరుతో లక్షల కోట్ల కొల్లగొట్టారా? భారీ స్కామ్‌లు చేసినా చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం చోద్యం చూస్తోందా? బీఆర్ఎస్‌-బీజేపీ మధ్య ఉన్న రహస్య బంధంతోనే కేసీఆర్‌ని కాపాడుతున్నారా? రాష్ట్రంలో గులాబీ సర్కార్‌ కొల్లగొట్టిన మొత్తం ఎంత? రాష్ట్రం చేసిన అప్పుల్లో దాదాపు సగం వంతు అధికార పార్టీ జేబుల్లోకి వెళ్లిపోయిందా? అంటే అవును అనే అంటోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇంతచేసి ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాటే అన్నట్లుగా కాంగ్రెస్‌ పార్టీపై స్కాంగ్రెస్‌ అంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని ఫైరవుతోంది. ఇందుకు దీటుగా 17 కుంభకోణాలు, 4 లక్షల 10 వేల కోట్ల లూటీ అంటూ బీఆర్ఎస్‌పై చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఈ అంశాలను ఇంటింటికి చేర్చేలా ప్రణాళిక రూపొందించింది.


స్కాంగ్రెస్ పేరుతో బీఆర్‌ఎస్ చేస్తున్న దుష్ప్రచారానికి కాంగ్రెస్‌ పార్టీ కౌంటర్‌ సిద్ధం చేసింది. బీఆర్‌ఎస్ స్కామ్‌లంటూ ఛార్జ్‌షీట్‌ని రిలీజ్ చేసింది. కేసీఆర్ పాలనలో ప్రధానంగా 17 స్కామ్‌లు జరిగాయని లెక్క తేల్చింది. 17 కుంభకోణాల్లో అధికార పార్టీ 4.1 లక్ష కోట్ల అవీనితికి పాల్పడిందని నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తోంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పేరుతో కాంగ్రెస్‌ పార్టీ 2007లోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గోదావరి నుంచి 160 TMCల నీటిని ఎత్తిపోసి 16లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరందించేలా ప్రణాళికలు రూపొందించింది. బీఆర్ఎస్‌ గవర్నమెంట్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రీ-డిజైనింగ్‌ పేరుతో భారీ అక్రమాలకు పాల్పడింది. కాళేశ్వరం పేరుతో 1.40 లక్షల కోట్లకు అంచనాలు పెంచింది. ఇందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేతలు రూపొందించిన ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. 40 వేల కోట్ల వ్యవమయ్యే ప్రాణహిత-చేవెళ్లను పక్కకు పెట్టారని మండిపడింది. బ్యాక్‌ వాటర్‌ సమస్యతో లక్షా 87వేల మందికిపైగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. 71వేల మందికిపైగా నిర్వాసితులుగా మిగిలారని కాంగ్రెస్‌ పార్టీ లెక్కతేల్చింది.

హైదరాబాద్‌ పరిధిలో జీవో 111 రద్దుతో బీఆర్ఎస్‌ ప్రభుత్వం 1.40 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని చార్జ్‌షీట్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తావించింది. 84 గ్రామాల పరిధిలోని 1.32 లక్షల ఎకరాల్లో 32 వేల ఎకరాలు ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేశారని ఆరోపించింది. మిగతా లక్ష ఎకరాలు అధికార పార్టీ MLAలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కనుసన్నల్లో రియల్‌ ఎస్టేట్‌ దందా చేశారని తెలిపింది. ఈ మొత్తం కుంభకోణం వ్యాల్యూ లక్షా 40 వేల కోట్లుగా లెక్కతేల్చింది. ధరణి పేరుతో బీఆర్ఎస్‌ పార్టీ భారీ కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. 24 లక్షల ఎకరాల భూములను వివాదాస్పదమైనవిగా గుర్తించి ప్లాన్‌ ప్రకారం కొల్లగొట్టారని నిర్ధరించింది. కేసీఆర్‌ కుటుంబం భూ కబ్జాల కోసమే ధరణి పోర్టల్‌ రూపొందించి ప్రైవేట్‌ పోర్టల్‌కు బాధ్యతలను అప్పగించిందని తెలిపింది. 18 లక్షల ఎకరాలపై అధికార పార్టీ నేతలు కన్నేశారని.. ధరణి పోర్టల్‌తో 50 వేల కోట్లు కొల్లగొట్టారని కాంగ్రెస్‌ పార్టీ లెక్కతేల్చింది.


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో 25వేల కోట్ల దోపిడీ జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. కాంగ్రెస్‌ హయాంలో 2013లో 32వేల 500 కోట్లుగా నిర్ణయించిన పాలమూరు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఆలస్యం చేసి పెంచారని ఆరోపించింది. 2015లో పనులకు శంకుస్థాపన చేసిన కేసీఆర్‌ ప్రాజెక్టు వ్యయాన్ని 60వేల కోట్లకు చేర్చారని మండిపడింది. ఇందులో దాదాపు 25వేల కోట్ల స్కామ్‌ జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ లెక్కతేల్చింది. ఔటర్‌ రింగ్‌రోడ్‌ టోల్‌ టెండర్లలోనూ భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ వెల్లడించింది. ORR టోల్ వసూలు టెండర్లలో 22,620 కోట్లు చేతులు మారాయని తెలిపింది. 30 ఏళ్ల లీజును కేవలం 7వేల380 కోట్లకే అప్పగించిందని.. 30 వేల కోట్లు వచ్చే అవకాశం ఉండగా తెరవెనుక భారీ స్కామ్‌ చేశారని ఆరోపించింది. మిషన్ భగీరథలో 21,600 కోట్లు బీఆర్ఎస్‌ మేసిందని కాంగ్రెస్‌ లెక్కతేల్చింది. కమిషన్ల కోసమే మిషన్‌ భగీరథ రూపొందించాకని ఫైరైంది. ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి లోపాయకారిగా పెద్దఎత్తున డబ్బులు దండుకున్నారని తెలిపింది.

బొగ్గు గనుల కేటాయింపులోనూ అధికార బీఆర్‌ఎస్‌ స్కామ్‌ చేసిందని కాంగ్రెస్‌ పార్టీ చార్జ్‌షీట్‌లో చేర్చింది. AMRకు తాటిచర్ల కోల్‌ బ్లాక్ మైనింగ్ లీజులో రూ.16 వేల కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపింది. భూపాలపల్లి సమీపంలోని తాడిచెర్ల బొగ్గు గనులను AMR కంపెనీకి బీఆర్ఎస్‌ ప్రభుత్వం కట్టబెట్టింది. ఇందులోనూ 30 ఏళ్ల లీజ్‌ వెనక మతలబు ఇదేనని తెలిపింది. 80 మిలియన్‌ టన్నులకు పైగా A గ్రేడ్‌ నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉండగా… సింగరేణి కాలరీస్‌ సంస్థతో కుట్ర చేసి 49.73 మిలియన్‌ టన్నుల నాసిరకం బొగ్గు అందుబాటులో ఉందని తప్పుడు నివేదిక రూపొందించి స్కామ్‌ చేశారని ఆరోపించింది. మిషన్ కాకతీయలో 12 వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ఒక్క వరంగల్‌ జిల్లాలోనే 145 చెరువుల్లో 65 శాతం పనులు చేసి 100 శాతం బిల్లులు తీసుకున్నట్లు కాగ్‌ తేల్చిందని ప్రస్తావించింది. 25 శాతం తక్కువకే కోట్‌ చేశారని చెబుతుండగా 40 శాతం అదనంగా కాంట్రాక్టర్లకు అందింది. వివిధ జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులను ఏసీబీ అరెస్ట్‌ చేయడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. హరిత హారంలో 8 వేల కోట్ల కుంభకోణం జరిగిందని హస్తం పార్టీ చెబుతోంది. మొక్కలకు 10 రెట్లు అధికంగా ధర చెల్లించి హరితహారం నిధులు 70 శాతం లూటీ చేశారని ఆరోపించింది.

ప్రతిమ శ్రీనివాస్‌కు నిషేధిత భూమలు కట్టబెట్టడం ద్వారా 5వేల కోట్లు స్కామ్‌ జరిగిందని కాంగ్రెస్‌ లెక్కతేల్చింది. నిషేధిత జాబితా నుంచి వేల ఎకరాల భూములను తొలగించారని.. తెల్లాపూర్‌లో 100 ఎకరాల భూమి కేసీఆర్‌కు అత్యంత సన్నిహిడుతు ప్రతిమ శ్రీనివాస్‌కు బదిలీ చేశారని ఆరోపించింది. దాదాపు 5 వేల కోట్లు విలువైన భూములు 260 కోట్లకే చేతులు మారాయని మండిపడింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ సీట్లలో అక్రమాల ద్వారా 3,513 కోట్ల దోపిడీ జరిగిందని కాంగ్రెస్‌ లెక్కతేల్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సంస్థాగత కోటా కింద 20 శాతం సీట్లు అధికంగా భర్తీ అవుతున్నాయి. వాటిని 1.5 కోట్ల నుంచి 2 కోట్లకు పైగా వసూలు చేసి అమ్మేస్తున్నారు. నయీమ్ భూముల కబ్జాలో 2వేల కోట్లు కొల్లగొట్టారని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ఆస్తుల రికవరీలో అక్రమాలకు పాల్పడ్డారని.. పోలీసులు, బీఆర్ఎస్‌ నాయకులు కుమ్మక్కు కావడం వల్లే కేసును సీబీఐకి అప్పగించలేదని కాంగ్రెస్‌ పార్టీ ఫైరైంది. షేక్‌పేటలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించడం ద్వారా 1500 కోట్లు దండుకున్నారని తెలిపింది. దళితబంధులో కమిషన్ల రూపంలో 1150 కోట్లు వసూలు చేశారు. BRS ఎమ్మెల్యేలు ఒక్కో లబ్ధిదారుడి నుంచి 3 లక్షలు లంచం తీసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ స్వయంగా హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు 38,328 మంది దళిత బంధు లబ్ధి దారుల నుంచి 3 లక్షల చొప్పున బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 1150 కోట్లు దండుకున్నారు.

బీఆర్ఎస్‌ ఎంపీ నామానాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూప్ బ్యాంక్‌ లోన్ల రూపంలో 1064 కోట్ల స్కామ్‌కు పాల్పడింది. ఈ ఆరోపణలపై 2021లో ఈడీ మధుకాన్ గ్రూప్ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. రోడ్డు నిర్మాణ పనుల పేరుతో వెయ్యికోట్లకు పైగా లోన్లు తీసుకొని దుర్వినియోగానికి పాల్పడినట్లు మధుకాన్‌ గ్రూప్‌పై అభియోగాలు ఉన్నాయి. మార్క్‌ఫెడ్‌ మక్కల కొనుగోళ్లలో వెయ్యి కోట్లమేర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ తెలిపింది. 2019లో ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ మొక్కజొన్నలు కొనుగోలు చేసింది. ఎంపీ రంజిత్ రెడ్డికి చెందిన శ్రీ రాజేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, నావెల్టెక్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి లబ్ధి చేకూర్చినట్లు ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 100 కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఎదుర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌లో కవిత కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. మొత్తం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 17 స్కామ్‌లలో 4 లక్షల 10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్‌ లెక్కతేల్చింది. ఈ వివరాలన్నీ జనంలోకి తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించింది. స్కాంగ్రెస్‌ అంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్న బీఆర్ఎస్‌కు గట్టిగా బుద్ధిచెప్పాలని నిర్ణయించింది.

.

.

Tags

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×