గులాబీ కబ్జా!
చేతులు మారిన పార్క్ జాగా!
⦿ గ్రేటర్ వరంగల్‌లో పార్క్ స్థలంపై బీఆర్ఎస్ నేత కన్ను
⦿ నకిలీ డాక్యుమెట్స్‌తో సైలెంట్‌గా భార్య పేరుపై రిజిస్ట్రేషన్
⦿ వివాదాస్పదం కావడంతో బినామీ పేరు మీదకు మార్పు
⦿ రూ.4 కోట్ల విలువైన స్థలం.. అయినా పట్టించుకోని అధికారులు
⦿ అడ్డుకున్న వారిపై దాడులకు తెగబడుతున్న వైనం
⦿ అధికారం పోయినా ఆగని గులాబీ దబాయింపు
⦿ పార్క్ స్థలం కాపాడాలని కోరుతున్న కాలనీ వాసులు
సతీష్ పబ్బు, స్వేచ్ఛ వరంగల్ ఇన్వెస్టిగేషన్ టీం
వరంగల్, స్వేచ్ఛ: BRS Leader Land Scam: ఖాళీ స్థలం కనబడితే రాబందుల్లా వాలిపోవడం. అడిగినవారిని అదరగొట్టడం. సామాన్యులను ఇబ్బందుల పాలు చేయడం గత ప్రభుత్వంలో జరిగిన తంతు ఇది. కేవలం హైదరాబాద్‌లోనే కాదు, ఇంకా ఇతర జిల్లాల్లోనూ ఇలాగే నడిచింది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్‌లో ఈ కబ్జా కథలు ఎక్కువే. కబ్జా చేసిన స్థలాలను నీకింత నాకంత అని పంచుకున్నారు. అయినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. అధికారం పోయినా ఇంకా వారి కబ్జాలు మాత్రం ఆగడం లేదని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గ్రేటర్ పరిధిలో లే అవుట్ పార్కులు, ఓపెన్ ల్యాండ్స్ పదుల సంఖ్యలో కబ్జాదారుల చెరలో ఉన్నాయి. తాజాగా మరోచోట రూ.4 కోట్లు విలువ చేసే పార్క్ స్థలంపై బీఆర్ఎస్ నేత కన్నేశాడు. తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పార్క్ స్థలాన్ని తన బినామీల పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. ఆక్రమణను అడ్డుకున్న వారిపై దౌర్జన్యం చేస్తున్నాడు.
కమ్యూనిటీ అవసరాల కోసం వదిలిన జాగాపై కన్ను
గ్రేటర్ వరంగల్ పరిధిలోని వడ్డేపల్లిలోని సురేంద్రపురి కాలనీలో వెటర్నరీ, ఇతర ఉద్యోగుల కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 21/1ఏ, 22, 25, 33/ 1ల్లోని 10.20 ఎకరాల భూమిని 1983లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత 118 ప్లాట్లు చేసి, తిరుపతయ్య అనే వ్యక్తికి జీపీఏ చేసి ఆయన ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ లేఅవుట్‌లో భవిష్యత్తు అవసరాల కోసం ఓ చోట 905 గజాలు, మరో రెండు చోట్ల 635 గజాలు మొత్తంగా 1,540 గజాల ల్యాండ్ ఓపెన్ ల్యాండ్‌గా వదిలేశారు. ఎవరికి వారు ఇండ్లు నిర్మాణం చేసుకోవడంతో కమ్యూనిటీ అవసరాల కోసం వదిలిన 905 గజాల స్థలంలో ఆలయం, వినాయక మండపాన్ని నిర్మించుకుని గత ఎమ్మెల్యే అరూరి రమేష్ చేతులమీదుగా ప్రారంభించారు. అయితే, ఖాళీ స్థలంపై కన్నేసిన రాష్ట్రస్థాయి నామినేటెడ్ చైర్మన్ పదవి అనుభవించిన బీఆర్ఎస్ నేత వెంకటేశ్వర్లు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అదే సొసైటీకి చెందిన ఉప్పలయ్య అనే వ్యక్తి ద్వారా తన భార్య ఉమాదేవి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత లెంకల శ్రీనివాస్ రెడ్డి అనే తన బినామీకి రిజిస్ట్రేషన్ చేశాడని కాలనీ వాసులు అంటున్నారు.
స్థలం కాపాడాల్సిన అధికారుల జాడ ఏది?
స్థలాన్ని భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్న సదరు బీఆర్ఎస్ నేత, విమర్శలు వస్తుండడంతో తర్వాత తన బినామీ పేరు మీదకు మార్చాడు. సదరు బినామీ ఆ రిజిస్ట్రేషన్ కాగితాలతో కోర్టుకు వెళ్లాడు. వాస్తవానికి కోర్టు పరిధిలో ఉన్న స్థలంపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదనే నిబంధన ఉన్నా, లెక్క చేయకుండా వారికి సంబంధించిన మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. సమస్య ఇలా ఉండగానే బల్దియా అధికారుల అండతో పార్కు స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని, అనుచరులతో తరచూ ల్యాండ్‌పైకి వచ్చి, నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని కాలనీ వాసులు అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ నేత వెనుక ఉండి చక్రం తిప్పుతున్నా, స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు.
కమ్యూనిటీ స్థలం కాపాడాలి
పార్కు ల్యాండ్ కబ్జా చేసి, స్థానికులను భయపెట్టే ప్రయత్నం చేస్తుండటంతో కాలనీ వాసులు వరంగల్ సీపీగా ఏవీ రంగనాథ్ ఉన్నప్పుడు ఫిర్యాదు చేశారు. అప్పటి సీపీ ఆదేశాల మేరకు గత డీసీపీ అశోక్ కుమార్ విచారణ చేపట్టి, కబ్జాకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అయినా తీరు మారకుండా అక్కడకు వచ్చి గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడంతో కాలనీవాసులు అనేకసార్లు పోలీసులు, గ్రేటర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా గత నెల 23న కూడా కార్లు, ఆటోల్లో బీఆర్ఎస్ నేత అనుచరులను తీసుకొచ్చి హంగామా సృష్టించే ప్రయత్నం చేయగా, కాలనీవాసులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పార్కు కోసం కేటాయించిన ఓపెన్ ల్యాండ్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతోపాటు భయబ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రెక్కి చేసి బెదిరిస్తున్నారు.. లక్ష్మి, కాలనీ వాసి
కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి సమయంలో కార్లు, ఆటోలు, బైకులపై చాలామంది వచ్చి జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నిత్యం రెక్కీ చేస్తూ ప్రశ్నించే వారిని భయపెడుతున్నారు. సాయంత్రమైందంటే బయటకు రావాలంటేనే భయపడుతున్నాం. ఎన్ని సార్లు బెదిరించినా పార్కు స్థలం వదిలేది లేదు.
కబ్జాకోరులపై చర్యలు తీసుకోవాలి.. రమ, కాలనీ వాసి
పార్కు స్థలం కబ్జా విషయాన్ని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేశారు. అయినా వాళ్ల తీరు మారడం లేదు. తప్పుడు పత్రాలతో పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
కోర్టులో తేల్చుకుంటాం.. లెంకల శ్రీనివాస్ రెడ్డి, పార్కు స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి
నేను లీగల్‌గా భూమిని కొనుగోలు చేశానని, అసలు ఇక్కడ సొసైటీ ఎప్పుడో రద్దయింది. కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళతో లీగల్‌గా కోర్టులోనే తేల్చుకుంటా.