Breaking news: మంచిర్యాల జిల్లా కుశ్నపల్లి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేస్తూ, వైరల్ గా మారిన అఘోరి.. తన స్వగ్రామానికి చేరుకోవడంతో, భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. తాను ఆత్మార్పణకు సిద్ధమంటూ అఘోరీ ప్రకటించి, స్వగ్రామానికి రావడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున గ్రామం వద్దకు చేరుకున్నారు. అయితే బయటి వ్యక్తులు ఎవరూ గ్రామంలోకి రాకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
వెనక్కు తగ్గిన అఘోరీ?
తాను సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరీ ప్రకటించి, తన తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అఘోరీ స్వగ్రామం కుశ్నపల్లికి రాగా, పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే భక్తుల కోరిక మేరకు తన ఆత్మార్పణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు సమాచారం. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులకు, అఘోరీ ఆశీర్వాదం ఇస్తూ.. నుదుటిపై తిలకం దిద్దుతున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. మొత్తం మీద ఆత్మార్పణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తమతో తెలపడం, ఎంతో ఆనందంగా ఉందని భక్తులు తెలుపుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు భక్తులు సహకరిస్తామంటూ ప్రకటించడంతో, అఘోరీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అఘోరీ ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.