Aleti Maheshwar Reddy: ఈ రోజు అసెంబ్లీలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు వాటికవే విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగడం, ఆ తర్వాత సీఎం చాంబర్ ముందు ధర్నాకు దిగడం, కేటీఆర్‌ను మార్షల్స్ ఎత్తుకెళ్లడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బీజేపీ చట్టసభ్యులు తమ గళాన్ని వినిపించే అవకాశం లేకుండా పోయింది. దీంతో బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ వల్లే సభలో తమకు మాట్లాడే అవకాశం రాకుండా పోయిందని బీజేఎల్పీ యేలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు.
అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీజేపీ సభాపక్ష నేత యేలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నాటకాన్ని తెలంగాణ సమాజం చూస్తున్నదని విమర్శించారు. అప్రెషన్ బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నదని ఆరోపించారు. సభలో అందరి సమయాన్ని వృధా చేసి.. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుతోనే బీజేపీ సభ్యులకు అప్రెషన్ బిల్లుపై మాట్లాడటానికి సమయం రాలేదని చెప్పారు. అయితే, సభలో సమయం ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రజల వైపునకే నిలబడతామని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని యేలేటి స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం.. చర్చించే అంశాలివే?
ఇవాళ స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై మాట్లాడనివ్వకుండా బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసనలు తెలిపారని, ఫలితంగా మిగిలిన పార్టీలకు మాట్లాడే సమయం ఇవ్వకుండా చేశారని యేలేటి మండిపడ్డారు. సభలను బీఆర్ఎస్ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నదని, బుల్డోజ్ రాజకీయాల వల్లే బీఆర్ఎస్‌కు ఈ గతి పట్టిందన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసింది? అని నిలదీశారు. ఇప్పుడే రాష్ట్రంలోని సమస్యలు కనిపిస్తున్నాయా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి నాశనం చేసిందని వీళ్లు కాదా? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది వీరు కాదా? అని మండిపడ్డారు.