EPAPER

Bathukamma: ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ ఊరేగింపు.. ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

Bathukamma: ట్యాంక్ బండ్‌పై 10 వేల మందితో సద్దుల బతుకమ్మ ఊరేగింపు.. ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గతేడాది వరకు బీఆర్ఎస్ పాలనలోనే బతుకమ్మ వేడుకలు జరిగాయి. కానీ, ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొదటిసారి తమ హయాంలో జరుగుతున్న ఉత్సవాలు కావడంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. బతుకమ్మ పండుగ చివరి రోజు సందర్భంగా జరిగిన వేడుకలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ప్రజా గాయని విమలక్క, ఎమ్మెల్సీ కోదండరాం, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలాదిమంది మహిళలు రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఆమరవీరుల స్మారక కేంద్రo నుండి బతుకమ్మలతో, వివిధ కళా రూపాల ప్రదర్శనలతో ట్యాంక్ బండ్ పైకి ఊరేగింపుగా వచ్చారు. ప్రత్యేక వేదిక వద్ద మంత్రి సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.


బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ

రాష్ట్రంతో పాటు విదేశాలలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు మంత్రి సీతక్క. ఆత్మీయత, భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించుకుంటున్నామన్నారు. మహిళలకు తోడుగా ఉండాలని మగవాళ్లకు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ సంబురాల కోసం సాంస్కృతిక శాఖకు ముఖ్యమంత్రి పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. 9 రోజులపాటు పండుగను నగరంతో పాటు గ్రామాలలో ఎంతో ఘనంగా చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. అంటరానితనం, అసమానతలు రూపుమాపడం కోసం విమలక్క పాటుపడుతున్నారని, బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగగా పేర్కొన్నారు. ‘‘తెలంగాణ అంటే చెరువులు, వాగులు, వంకలు, గుట్టలు. చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేశాం. ఇంకా చేస్తున్నాం. అలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. బతుకమ్మలో ప్రతి పువ్వుకు ఒక ఔషధ గుణం ఉంది. పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి పండుగకు భక్తితో పాటు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. గౌరమ్మను చేసే పసుపులో యాంటీబయోటిక్ ఉంది. చెరువులలో వేసిన పూలు, పసుపుతో నీరు శుద్ధి అవుతుంది. బతుకమ్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భవిష్యత్ తరాలకు మన పండుగను అందించాలి. చెరువులను కాపాడుకోవాలి. మహిళలను ఎదుగనిద్దాం, చదువుకోనిద్దాం, రక్షించుకుందాం. మహిళలతో ఎలా ప్రవర్తించాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత ఉంది’’ అని వ్యాఖ్యానించారు సీతక్క.


Also Read: వాహ్.. బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం

తెలంగాణ అంటే పోరాటాల చరిత్ర

బతుకమ్మ వేడుకల్లో విమలక్క మాట్లాడుతూ, సుదీర్ఘ పోరాటాల తర్వాత ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. పాటతో తొవ్వలు వేశామని, తెలంగాణ అంటే పోరాటాల చరిత్ర అని పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా బహుజన బతుకమ్మ నిర్వహిస్తూ ఒక్కో నినాదంతో ముందుకు వస్తున్నామని, చెరువులు, కుంటలు కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు హర్షనీయమన్నారు. అక్కారం గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నామని, దళితులతో కలిసి బతుకమ్మ ఆడితే డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఇంకా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పండుగకు అంటూ, ముట్టు, కులం, మతం ఏదీ లేదన్నారు. అసమాన అంతరాలు, ఆర్థిక అంతరాలు తొలగిపోవాలని చెప్పారు. మద్యాన్ని తరిమికొట్టి మగువలను రక్షించుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలను రక్షించుకోవడానికి హైడ్రా ఉన్నట్టు, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం మన జీవిత భాగమన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై పాట పాడారు విమలక్క. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం 150 మందిపై పెట్టిన కేసులను ఈ ప్రభుత్వం ఎత్తి వేసేలా సీఎం చొరవ చూపాలని కోరారు విమలక్క.

ఆకట్టుకున్న లేజర్, క్రాకర్ షో

బతుకమ్మ వేడుకల్లో భాగంగా అమరవీరుల స్మారకం నుంచి చిల్డ్రన్స్ పార్క్ దాకా బతుకమ్మ ఊరేగింపు కొనసాగింది. సుమారు పది వేల మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. సంబురాల్లో భాగంగా ఏర్పాటు చేసిన లేజర్ షో, క్రాకర్ షో ఆకట్టుకున్నాయి. ఆకాశంలోకి తారాజువ్వలు దూసుకెళ్లాయి. వాటిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతతో బతుకమ్మ వేడుకలు జరిగాయి.

Related News

IAS Transfers : త్వరలోనే భారీగా ఐఏఎస్ బదిలీలు ? 16న కొత్త ఆఫీసర్స్ వచ్చేస్తున్నారోచ్ !

Bathukamma: వాహ్.. బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం

Hyderabad-Delhi Flight : దిల్లీకి బయల్దేరిన కాసేపటికే విమానంలో…. అత్యవసర ల్యాండింగ్

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayalaxmi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Big Stories

×