Bandi Sanjay Comments on Harish Rao Joining BJP: రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి కాపాడుకునే దుస్థితికి చేరుకుంది. ఇందులో భాగంగానే బీజేపీలో విలీనం కావాలనే నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. బయటికి మాత్రం బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పై విమర్శలు కొనసాగిస్తూ ఉండటంతో కొన్ని అనుమానాలు వచ్చాయి. కానీ, తాజాగా బీజేపీ నేతలు తమ పంథా మార్చినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ కీలక నేతలపై ప్రశంసలు కురిపించడం దేనికి సంకేతం అనే చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ కీలక నాయకుడు హరీశ్ రావు ప్రజల మనిషి అని కితాబిచ్చారు.
హరీశ్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషి అని బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని, అయితే, వారు రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని వివరించారు. హరీశ్ రావు బీజేపీలోకి వచ్చినా స్వాగతిస్తామని, అయితే, ఆయన కూడా రాజీనామా చేసి రావాల్సి ఉంటుందని చెప్పారు. రాజీనామా చేసి వచ్చిన వారిని ఉపఎన్నికలో గెలిపిస్తామని తెలిపారు. అయితే, తాను హరీశ్ రావుతో మాట్లాడలేదని చెప్పారు. ఆయన వివాదరహితుడని స్పష్టం చేశారు. అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక్కడే మంచి నాయకుడని పొగడ్తలు కురిపించారు.
ఎమ్మెల్యేలు ఏ గుర్తుతో గెలిచారు? ఏ పార్టీలో చేరుతున్నారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వారంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వేరే పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. అదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని పేర్కొన్నారు . ఇక బీజేపీలోకి వస్తే మాత్రం ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Also Read: Ministers visits Warangal: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలోనే..
బీజేపీ పెద్దలతో విలీన చర్చలు జరిపిన కేటీఆర్‌తోపాటు హరీశ్ రావు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరపగా సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే త్వరలోనే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరుతారనే చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ నాయకుడు, సంప్రదింపుల్లో పాల్గొన్న హరీశ్ రావును బండి సంజయ్ ఆకాశానికెత్తడం చర్చనీయాంశమైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడ్డ బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా పెట్టింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంలో పడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని నిలుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది.