Big Stories

Bandi Sanjay : సీఎం అబద్ధాలే చెప్పారని నిరూపిస్తాం..కేసీఆర్ రాజీనామా సవాల్ కు బండి కౌంటర్..

Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 తర్వాత బీజేపీ ఖతం అయిపోతుందని జోస్యం చెప్పారు. కేంద్రంపై, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. గులాబీ బాస్ విమర్శలపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. తాను చెప్పిన విషయాలు అబద్ధమైతే రాజీనామాకు సిద్ధమని కేసీఆర్ చేసిన సవాల్ కు కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్‌ అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రధాని మోదీ గురించి కేసీఆర్‌ చెప్పిన మాటలు పూర్తి అవాస్తవమని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రం ప్రభుత్వం చేసిన పనులు గురించి చెప్పుకోవడానికి ఏమీలేకే మోదీపై విమర్శలు చేశారని మండిపడ్డారు. జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, నియోజకవర్గానికో 100 పడకల ఆస్పత్రి, మండలానికో 30 పడకల ఆస్పత్రి హామీలు ఏమయ్యాయని కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. దేశ ఆర్థికవ్యవస్థ గురించి పూర్తి అవాస్తవాలు మాట్లాడారని విమర్శించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతో కేసీఆర్ కు తెలంగాణతో బంధం తెగిపోయిందన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీన ఎందుకు ఇవ్వడంలేదని కేసీఆర్ ను బండి సంజయ్ నిలదీశారు. కులగణన గురించి మాట్లాడే సీఎం సమగ్ర సర్వే రిపోర్టులను ఏం చేశారో చెప్పాలన్నారు. దేశంలో సాగునీటి రంగం గురించి మాట్లాడుతున్న కేసీఆర్‌.. 299 టీఎంసీల కృష్ణా జలాల కోసం ఎందుకు సంతకం చేశారు? అని ప్రశ్నించారు. కృష్ణానదిపై ప్రాజెక్టులు ఎందుకు కట్టడంలేదో సమాధానం చెప్పాలన్నారు.

రూ.46 వేల కోట్లతో మిషన్‌ భగీరథ అమలు చేసినా తెలంగాణలోని గ్రామాల్లో తాగేందుకు నీళ్లు లేవని బండి సంజయ్ అన్నారు. డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్ల బకాయి పడిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో నిరూపించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు ఎందుకు ఓటెయ్యాలి? రూ.5 లక్షల కోట్ల అప్పు చేసినందుకా? దళితుడిని సీఎం చేయనందుకా? అంబేడ్కర్‌ని అవమానించినందుకా? దళితబంధు అమలు చేయనందుకా? పోడు సమస్య పరిష్కరించనందుకా? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎంతో చేస్తోందని చెప్పుకొచ్చారు. పంచాయతీలకు నిధులు, 32 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు, ఉచిత రేషన్‌, పేదలకు ఇళ్లు, జాతీయ రహదారుల నిర్మాణం, పంటల కొనుగోలు, గ్రామాలకు రోడ్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు కేంద్రం చేస్తోందని అన్నారు. అందుకే మళ్లీ బీజేపీకి ఓటు వేయాలని బండి సంజయ్ అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News