Big Stories

Telangana: అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సన్నాహాలు.. మరి, పార్టీలు..?

telangana elections

Telangana: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని ఈసీ బృందం హైదరాబాద్ వచ్చి రాష్ట్ర అధికారులతో సమీక్ష చేసింది. ఈవీఎంల సన్నద్ధత, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై సమీక్షించారు. తెలంగాణ శాసనసభకు 2018 డిసెంబరు 7న ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివరికల్లా అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. సమయం దగ్గర పడుతుండటంతో ఈసీ రెడీ అవుతోంది.

- Advertisement -

ఎన్నికల కమిషనే ఆర్నెళ్ల ముందునుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే.. మరి చావోరేవో తేల్చుకోవాల్సిన రాజకీయ పార్టీలు ఇంకెంతలా సన్నద్ధం కావాలి? మరి, అవుతున్నాయా? అయ్యాయా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈసారి తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ హోరాహోరీగా సాగడం ఖాయం. అధికార బీఆర్ఎస్‌ మళ్లీ పవర్‌లోకి రావడం అంత ఈజీ టాస్క్ కాకపోవచ్చు. అందుకే, గతంలో మాదిరి ఈసారి కూడా ముందస్తు ఆలోచన చేసే సాహసం గులాబీ బాస్ చేయట్లేదని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశముంది.

- Advertisement -

కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అంతుచిక్కవని అంటారు. టగ్ ఆఫ్ వార్ నడుస్తున్న ఈ సమయంలో గులాబీ బాస్ తన మెదడుకు మరింత పదును పెడతారనడంలో సందేహం అవసరం లేదు. తనపై ఉన్న విమర్శలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. సచివాలయంలో అడుగుపెట్టని ముఖ్యమంత్రి అంటూ ఇన్నేళ్లూ కేసీఆర్‌ను విమర్శించారు. ఇప్పుడు కొత్త సచివాలయంతో, అందులోనే బీఆర్ అంబేద్కర్ పేరుతో ఈ నెలలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నారు. దేశంలోకే ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహంతో రేసులో ముందున్నారు. అమరుల స్థూపం, వరంగల్‌ MGM హాస్పిటల్ నిర్మాణం.. ఇలా పెండింగ్ పనులన్నీ వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీ కూడా పూర్తి చేయడం ఎన్నికల సన్నాహాల్లో భాగమే అంటున్నారు. కొందరు మినహా దాదాపు సిట్టింగులకే మళ్లీ టికెట్లని ప్రచారం జరుగుతోంది. సో, అభ్యర్థుల ఎంపిక తలనొప్పి కూడా కేసీఆర్‌కు లేదనొచ్చు. ఓవైపు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ బలోపేతంపై ఫోకస్ పెడుతూనే.. తెలంగాణ ఎన్నికలపైనా అంతే దృష్టి సారించారు కేసీఆర్. ఇక మిగిలింది ప్రతిపక్షాలే.

కాంగ్రెస్, బీజేపీ. ఈ రెండు పార్టీలు నెంబర్ 2 కోసం పోరాడతాయా? లేదంటే, రేసుగుర్రంలా అధికారంలోకి దూసుకొస్తాయా? అనేది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. బీజేపీ జోరుగా ఉంది. కాంగ్రెస్ బలంగా కనబడుతోంది. కమలనాథులకు కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. అయితే ఎప్పటిలానే అర్బన్ ప్రాంతంలోనే కాషాయ జెండా రెపరెపలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల కొరతా ఆ పార్టీని వేధిస్తోంది. బీజేపీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా.. అది ఎంతమేరకు ఓట్లుగా మారుతుందనే డౌట్ ఉండనే ఉంది. ఈసారి 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా.. అందులో గెలిచేవారు ఎందరో?

ఇక, కాంగ్రెస్. ఆ పార్టీని ఎవరూ ఓడించలేరు, వారికి వారే ఓడించుకుంటారనే కామెంట్‌ను పదే పదే నిజం చేస్తుంటారు హస్తం నేతలు. రేవంత్‌రెడ్డి దూకుడుగా ముందుకు వెళుతుంటే.. సీనియర్లు జట్టు కట్టి ఆయన స్పీడుకు బ్రేకులు వేస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్‌రెడ్డినే సీఎం అవుతారనే అనుమానంతో పార్టీని నిండా ముంచినా ముంచేస్తారని అంటున్నారు. రేవంత్‌ను సీఎం చేయడానికి తాము కష్టపడాలా.. అని గతంలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడాని ఏమనుకోవాలి? ఇప్పుడు కొత్తగా దళిత సీఎం ప్రతిపాదన తీసుకొస్తున్నారు అదే సీనియర్లు. రేవంత్‌కు చెక్ పెట్టేందుకు తమవంతుగా శాయశక్తులా కృషి చేస్తున్నారు కానీ.. పార్టీ గెలుపు దిశగా వారు చేస్తున్న ప్రయత్నాలు అంతంతమాత్రమే అనే విమర్శ ఉంది. అందుకు, మునుగోడు ఉప ఎన్నికే నిదర్శనంగా చూపిస్తున్నారు. సొంతపార్టీ అభ్యర్థికే ఓటు వేయొద్దని చెప్పిన గొప్ప నేతలున్నారక్కడ. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మునుగోడు సీన్లు రిపీట్ కావనే గ్యారంటీ లేదు. హస్తం నేతలు ఎవరికి వారే గ్రూపులు కట్టి.. స్వలాభం చూసుకుంటుంటే.. ఇక గెలిచేదెప్పుడు? రేసులో నిలిచేదెప్పుడు? కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీనే బెటర్ అనిపిస్తోంది.

ఇక, షర్మిల పార్టీ పోటీ చేస్తుందా? కేవలం షర్మిల మాత్రమే పోటీ చేస్తారా? బీఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎవరి ఓట్లు చీల్చుతారు? ఎమ్ఐఎమ్‌కు ఎప్పటిలానే ఫిక్స్డ్ సీట్లు పక్కా. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మినహా ఏ పార్టీ కూడా ఎన్నికలకు అంతగా సన్నద్ధం అయినట్టు కనిపించడం లేదు. ఈసీకి ఉన్నంత ఆరాటం కూడా పొలిటికల్ పార్టీలకు లేకపోతే ఎలా? బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీ తలబడి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి.. మళ్లీ కేసీఆర్‌నే గెలిపిస్తారా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News