Asaduddin Owaisi vs KCR: MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఆయన నోరు విప్పితే ఏం మాట్లాడుతారో? ఏం బయట పెడుతారో అని కారు పార్టీ నేతలు కలవరపడుతున్నారట. అహంకారమే బీఆర్ఎస్ ఓటమికి కారణమని.. వారి జాతకం మొత్తం తన దగ్గర ఉందన్నారు అసదుద్దీన్. MIM అధినేత దగ్గర ఉన్న జాతకం ఏంటో అని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వాటిని బయట పెట్టాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆ స్టోరీ ఏంటో చూద్దాం…
నోరు విప్పితే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అని హెచ్చరించారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. బీఆర్ఎస్ జాతకం మొత్తం తన దగ్గర ఉందని.. మూసీ ప్రక్షాళనకు ప్రణాలికలు చేసింది మీరు కాదా అని హెచ్చరించారు ఒవైసీ. గత పదేళ్లలో మూసీ సుందరీకరణ పేరుతో ఎటువంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. 10 యేండ్లు పాటు అధికారంలో ఉండే సరికి నేతల్లో అహంకారం పెరిగిందని.. ప్రజలను పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కి అన్ని సీట్లు రావడానికి కారణం MIM అని వ్యాఖ్యానించారు. అహంకారంతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిందని.. అవసరమైతే వారి జాతకం మొత్తం బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలతో గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది. రహస్య ఒప్పందాలు అన్ని బయటపెడితే పరిస్థితి ఏంటో అని ఆత్మ పరిశీలనలో కారు పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే గడిచిన 10 ఏళ్లలో చేసిన అక్రమాలు అన్ని ఒక్కొకటి బయటపడుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలను కలవరపెడుతున్నాయి.
ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై త్వరలోనే కమిషన్ నివేదిక ఖరారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇప్పటికే తప్పు చేసిన వారిని వదిలేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలానే విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా భారీగా అవకతవకలు జరిగాయని కమిషన్ నివేదిక సిద్దం చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. దీని పైన త్వరలోనే కేబినెట్ మీటింగ్ లో చర్చించి అవసరం అయితే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నివేదిక ఆధారంగా చర్యలు తప్పవని.. మాజీ సీఎం కేసీఆర్, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: బీసీ జనాభా లెక్కింపునకు ప్రత్యేక కమిషన్
మరోవైపు ప్రతిపక్ష పాత్ర 100 శాతం నిర్వర్తిస్తాం అని చెప్పిన బీఆర్ఎస్.. ఆ దిశగా అడుగులు వెయ్యడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమవుతున్నారని విమర్శను మూటగట్టుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడ కనిపించక పోవడం ఆ వాదనలను మరింత బలపరుస్తున్నాయి. ప్రతిపక్ష నేత హోదాలో కృష్ణా జలాల నీటి వాటాపై ఒకసారి నల్లగొండలో బహిరంగ సభ.. తరువాత కరీంనగర్ సభ.. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు బస్సుయాత్ర.. బడ్జెట్ సమావేశాల్లో ఒకసారి మాత్రమే కేసీఆర్ బయట కనిపించారు. మిగిలిన సమయం అంతా ఆయన ఫాం హౌస్ కే పరిమితమవుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ విఫలం అయ్యారని విమర్శ మూటగట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలిపించుకోలేకపోయారని అంటున్నారు. అంతే కాకుండా రీసెంట్ గా కేటీఆర్ బావమరిది పాకాల రాజు ఫామ్ హౌస్ పార్టీ ఇష్యూ ఫుల్ హాట్ టాపిక్ అయ్యింది. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం, కేసినో కాయిన్స్ బయటపడడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ కేసులో కేటీఆర్ బావమరిది పోలీసుల విచారణకు సైతం హాజరయ్యారు. దీంతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లుగా.. ఇప్పటికే వరుస ఓటములతో సతమవుతున్న గులాబీ పార్టీకి.. ఫాం హౌస్ పార్టీ ఇష్యూ మరింత తలనొప్పులు తెచ్చిందని అభిప్రాయపడుతున్నారట.
అసలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ ని..ఒవైసీ వ్యాఖ్యలు మరింత కలవరపెడుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. అసదుద్దీన్ ఆధారాలను బయటపెడితే కారు పార్టీ పరిస్థితి ఏంటని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒవైసీ బీఆర్ఎస్ జాతకాన్ని బయటపెట్టాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు.