Big Stories

ChotaNews: ఫటాఫట్ చోటాన్యూస్.. ఏపీ, తెలంగాణ రౌండప్

chota news

ChotaNews: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా.. గురువారం, శుక్రవారం ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

- Advertisement -

హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి శ్రీకాశీబాగ్ ఆంజనేయస్వామి ఆలయంలో వేద మంత్రాల మధ్య వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు దంపతులు పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే హనుమాన్ మాలధారులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు.

- Advertisement -

అనంతపురం జిల్లా కూడేరులో నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు క్రేన్‌ సాయంతో లోకేష్‌కు గజమాల వేస్తుండగా.. ఓ వైపు తాడు తెగి భుజంపై పడిపోయింది. వెంటనే అక్కడున్న కార్యకర్తలు గజమాలను పక్కకు తోసేసారు. దీంతో లోకేష్‌కు పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.

నల్గొండ జిల్లాలో అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. వరి కోతలు ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా…. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 15వ తేదీ తర్వాత ప్రారంభం అవుతాయని అధికారులు ప్రకటించారు.

ప్రధాని మోదీ ఈ నెల 8న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. 11 గంటల 45 నిమిషాలకు సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్ రైలుని ప్రారంభిస్తారు. అనంతరం వివిధ శంకుస్థాపనలు, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు తిరిగి వెళ్తారు.

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మోదీ ప్రియమైన ప్రధాని కాదని… పిరమైన ప్రధాని అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్రకు పోలీసులుకట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. యాత్ర కొనసాగే మార్గాల్లో పదిహేను వందలకు పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ మందిరం నుంచి యాత్ర ప్రారంభమై, రాత్రి ఎనిమిది గంటలకు సికింద్రాబాద్ తాడ్‌బన్ వద్ద శోభాయాత్ర ముగియనుంది.

ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్‌ నాయక్‌ బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారత్‌ తరుపున 1974లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు.

వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టం సీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. చతుర్దశి రోజు పండు వెన్నెలలో నిండు చంద్రుడు కనులారా వీక్షించే విధంగా.. సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 19 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం 73,208 మంది స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

టీమిండియా క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్‌సింగ్, సురేశ్ రైనాతో పాటు భారత మహిళా క్రికెట్ దిగ్గజాలు, మిథాలీ రాజ్, ఝలన్ గోస్వామిలకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ వీరికి లైఫ్‌ టైమ్ మెంబర్‌షిప్ ఇచ్చి సత్కరించింది.

జియో ట్యాగింగ్‌లో కేరళ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2022-23 ఏడాదికి ఆ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులకే అత్యధిక జియో ట్యాగ్‌లు లభించాయి. జియోగ్రాఫికల్ ఇండికేషన్ రికార్డుల ప్రకారం కేరళకు చెందిన బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జియో ట్యాగ్‌లు లభించాయి.

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గురువారం 22 క్యారెట్ల బంగారంపై 950 రూపాయలు, 24 క్యారెట్లపై ఒక వెయ్యి 30 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 56 వేల 250 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 61 వేల 360గా ఉంది. కిలో వెండి ధర 80 వేల 700 వద్ద కొనసాగుతోంది.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు కదం తొక్కారు. ఆలిండియా కిసాన్‌సభ, ఆల్‌ ఇండియా అగ్రికల్చరల్‌ వర్కర్స్‌ యూనియన్‌, సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీ నిర్వహించారు.

జమ్ముకశ్మీర్‌లోని సాదివార గ్రామంలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమేందుకు ప్లాస్టిక్ ఇవ్వు.. బంగారం తీసుకో అనే నినాదంతో ఓ కార్యక్రమం చేపట్టారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 15 రోజుల్లోనే ఆ గ్రామం ప్లాస్టిక్ రహితంగా మారిపోయింది.

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ జాతి చీతాలు నిర్దేశిత ప్రాంతం దాటి వెళ్లిపోతున్నాయి. కూనో నేషనల్ పార్క్‌లోని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఆశా అనే చీతా పారిపోయింది. ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్‌ను ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా పార్కుకు తీసుకువచ్చారు. ఇప్పుడు మరో చీతా పారిపోవడంతో బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మరో రికార్డును సాధించింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో 9వ స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ జాబితా ప్రకారం 5 కోట్ల 94 లక్షలకు పైగా ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టుగా అవతరించింది.

ఉగ్రవాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కోర్టుకు హాజరయ్యారు. భారీ భద్రత మధ్య ఆయన లాహరో కోర్టుకు వచ్చిన వీడియోలను పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో ఇమ్రాన్‌ఖాన్ కోర్టుకు హాజరయ్యేందుకు పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి భద్రత ఏర్పాటు చేశారు.

అమెరికాలో టోర్నడో మరోసారి బీభత్సం సృష్టించింది. నాలుగు రోజుల క్రితమే దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన టోర్నడో తాజాగా మిస్సోరి ఆగ్నేయ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్‌ ధాటికి ఐదుగురు మృతి చెందగా, చాలా మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు దుబాయ్ లో హంగామా చేశారు. బేబీ బంప్ తో ఉన్న ఉపాసన దంపతులకు.. తన బంధువులు, స్నేహితులు కలిసి చిన్న ట్రీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోస్, వీడియోలను.. ఉసాసన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే ఉపాసనకు ఇంట్లో వారు శ్రీమంతం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News